నీ రైట్‌ కోసం ఫైట్‌! | It is our right to get the right services for the cost | Sakshi
Sakshi News home page

నీ రైట్‌ కోసం ఫైట్‌!

Published Thu, Jun 20 2024 1:58 AM | Last Updated on Thu, Jun 20 2024 1:58 AM

It is our right to get the right services for the cost

పెట్టిన ఖర్చుకు సరైన సేవలు పొందడం మన హక్కు

నష్టమొస్తే వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించి పరిహారం పొందే వీలు

లాయర్ల ఖర్చు లేదు.. కేసు మనమే వాదించుకునే చాన్స్‌

పిటిషన్ల పరిష్కారం కోసం నగరంలోనే 3 కమిషన్లు

కానీ వినియోగదారుల చట్టంపై సిటీజనుల్లో అవగాహన అంతంతే..

నగరాల్లోని వారికీ తెలియక..
ఇతర దేశాల్లో వినియోగదారుల హక్కులకు ప్రాధాన్యత ఎక్కువ. మన దేశంలో అంతంత మాత్రమే. చట్టాలున్నా వాటి అమలులో తీవ్ర నిర్లక్ష్యం ఉంది. గ్రామీణ ప్రజలే కాదు.. నగరాల్లోని వారికి కూడా వినియోగదారుల కమిషన్లను ఎలా ఆశ్రయించాలో తెలియదు. చెప్పుకోవడానికే చట్టాలు అన్నట్టుగా వ్యవస్థ తయారైంది. ప్రభుత్వం ఇతర కోర్టులతోపాటు ఈ కమిషన్లనూ అభివృద్ధి చేసి, ప్రజల చెంతకు చేర్చాలి. చట్టప్రకారం జిల్లాకో కమిషన్‌ ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం అన్ని కొత్త జిల్లాల్లో ఏర్పాటు చేస్తే దగ్గరలో సత్వర న్యాయం అందే అవకాశం ఉంటుంది.
– ఆకాశ్‌ బాగ్లేకర్, న్యాయవాది, వినియోగదారుల చట్టాల పుస్తక రచయిత 

సాక్షి, హైదరాబాద్‌:
దుర్గాభాయ్‌ దేశముఖ్‌ కాలనీకి చెందిన ఓ వ్యక్తి బేగంపేట్‌లోని ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ షాపులో రూ.66 వేలు వెచ్చించి ఓ టీవీ కొనుగోలు చేశారు. కొన్ని రోజులకే టీవీ పనిచేయడం మానేసింది. కస్టమర్‌ కేర్‌ను సంప్రదించి మరమ్మతులు చేయించినా లాభం లేకపోయింది. దీంతో ఆ వ్యక్తి వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. పరిశీలించిన కమిషన్‌.. రూ.66 వేలు రీఫండ్‌ చేయాలని, అదనంగా రూ.13 వేలు పరిహారం, రూ.5 వేలు కేసు ఖర్చుల కింద వినియోగదారుడికి ఇవ్వాలని ఆదేశించింది. మరో రూ.5 వేలు కన్జ్యూమర్‌ లీగల్‌ ఎయిడ్‌ ఖాతాలో జమ చేయాలని ఆదేశించింది.

⇒ అధిక బరువుతో బాధపడుతున్న ఓ వ్యక్తి బరువు తగ్గించే చికిత్స కోసం ఒక ప్రముఖ హెల్త్‌కేర్‌ సంస్థను సంప్రదించారు. ఈ మేరకు చికిత్స అందిస్తామని హామీ ఇచ్చిన సంస్థ.. రూ.1,30,000 ఫీజును ఈఎంఐ రూపంలో వసూలు చేసింది. కానీ ఆయన ఎంతకీ బరువు తగ్గకపోగా ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం పడింది. దీంతో తాను చెల్లించిన మొత్తం రీఫండ్‌ చేయాలని సంస్థను కోరారు. కానీ సంస్థ స్పందించకపోవడంతో.. వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. విచారించిన కమిషన్‌ రూ.1,30,000 సొమ్మును 12 శాతం వడ్డీతో కలిపి రీఫండ్‌ చేయాలని.. కేసు ఖర్చుల కింద మరో 
రూ.5 వేలు చెల్లించాలని సంస్థను ఆదేశించింది.

..వస్తువులు, సేవల్లో లోపాల వల్ల ప్రజలు నష్ట పోయిన మొత్తాన్ని తిరిగి పొందేందుకు విని యోగదారుల కమిషన్లు తీసుకున్న చర్యలు ఇవి. కానీ మనలో చాలా మందికి సరైన అవగాహన లేక, నష్టపోయినా భరించి ఊరుకుండిపోతున్నారు.

చట్టం ఎంత బలంగా ఉన్నా.. అమల్లో నిర్లక్ష్యం ఉంటే ఫలితం శూన్యం. ఎవరికోసమైతే ఆ చట్టం చేశామో.. అదొకటి ఉందని వారికి తెలియక పోతే నిష్ప్రయోజనం. అలాంటివే వినియోగదారుల చట్టాలు. గ్రామీణులకే కాదు నగరాల్లో ఉండే వారికి కూడా వాటిపై అవగాహన అంతంతే. ఐటీ రంగంలో దూసుకుపోతున్న హైదరాబాద్‌లోనూ వినియోగదారుల హక్కులేమిటో తెలియని వారు కోకొల్లలు. 

ప్రభుత్వం కూడా వినియోగదారుల చట్టాలపై అవగాహన కల్పించడంపై ఫోకస్‌ పెట్టని పరిస్థితి. ఏదో తూతూ మంత్రంగా అప్పుడప్పుడు ఏవో కార్యక్రమాలు నిర్వహించడం మినహా పెద్దగా చేస్తున్నదేదీ లేదు. నిజానికి వినియోగదారులు కాని ప్రజలంటూ ఎవరూ ఉండరు. అందుకే అందరూ ఈ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని.. సేవలను హక్కుగా పొందాలని నిపుణులు సూచిస్తున్నారు.

2020లో మార్పులు చేశాక..
1986 నుంచి ఉన్న వినియోగదారుల చట్టంలో మార్పులు చేర్పులు చేసి వినియోగదారుల రక్షణ చట్టం–2019ను రూపొందించారు. అది 2020 జూలై 20వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. వినియోగ దారుల ఫిర్యాదు లను మరింత వేగంగా పరిష్కరించడా నికి ఇది దోహదం చేస్తోంది. ఈ చట్టం ద్వారా సెంట్రల్‌ కన్సూ్యమర్‌ ప్రొటె క్షన్‌ అథారిటీ (సీసీపీఏ)ని స్థాపించారు. దీనిద్వారా వినియోగదారుల హక్కులను ప్రోత్సహిస్తూ, పరిరక్షిస్తు న్నారు. అలాగే వినియోగదారుల ఫోరంను వినియోగదారుల వివా దాల పరిష్కార కమిషన్‌ మార్చారు.

వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు ఎలా చేయాలి..
⇒ వస్తువు లేదా సేవ కోసం చేసిన ఖర్చు విలువ రూ.50 లక్షల వరకు అయితే.. జిల్లా కమిషన్‌లో ఫిర్యాదు చేయాలి. రూ.2 కోట్ల వరకు అయితే రాష్ట్ర కమిషన్‌లో, అంతకుమించితే జాతీయ కమిషన్‌లో పిటిషన్‌ దాఖలు చేయాలి.
⇒ రాష్ట్ర కమిషన్‌తోపాటు హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్లు హైదరాబాద్‌లో ఉన్నాయి.
⇒ ఆన్‌లైన్‌ ద్వారా లేదా కమిషన్‌ కార్యాలయంలో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు. 
⇒ దేశవ్యాప్తంగా టోల్‌ ఫ్రీ నంబర్‌ 180042500333కు ఫోన్‌ చేసి సమాచారం తెలుసుకోవచ్చు.

వినియోగదారుల కమిషన్ల వివరాలివీ..
జాతీయ వినియోగదారుల కమిషన్‌..
ఉపభోక్య న్యాయభవన్‌
ఎఫ్‌ బ్లాక్, జీపీవో కాంప్లెక్స్‌
ఐఎన్‌ఏ, న్యూఢిల్లీ–110023
ఈ–మెయిల్‌: ఎన్‌సీడీఆర్‌సీ ఎట్‌దిరేట్‌ ఎన్‌ఐసీ డాట్‌ ఇన్‌
ఫోన్‌ నంబర్‌: 011–24608724
⇒ ఇందులో అధ్యక్షుడితోపాటు 11 మంది సభ్యులు ఉంటారు. నేరుగా వేసే పిటిషన్లతోపాటు అప్పీళ్లను కూడా ఎన్‌సీడీఆర్‌సీ విచారణ చేస్తుంది. వినియోగదారుల రక్షణ చట్టం–2019లో పేర్కొన్న నిబంధనల ప్రకారం జాతీయ కమిషన్‌ పనిచేస్తుంది.

తెలంగాణ రాష్ట్ర కమిషన్‌..
ఏరువాక బిల్డింగ్, శ్రీధర్‌ ఫంక్షన్‌ హాల్‌ ఎదురుగా.., 
ఆనంద్‌నగర్, ఖైరతాబాద్, హైదరాబాద్‌
ఈ–మెయిల్‌: ఎస్‌సీడీఆర్‌సీ–టీఎస్‌ ఎట్‌దిరేట్‌ ఎన్‌ఐసీ డాట్‌ ఇన్‌
మీనా రామనాథన్, ఇన్‌చార్జి అధ్యక్షురాలు, ఫోన్‌: (040) 23394399
కె.రంగారావు, సభ్యుడు, ఫోన్‌: (040) 23394399
వీవీ శేషుబాబు (జ్యుడీషీయల్‌) సభ్యుడు..
ఆర్‌ఎస్‌ రాజశ్రీ, సభ్యురాలు..
వీపీ వెంకటరమణమూర్తి, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్, ఫోన్‌: 23394399

రెండేళ్లలోపు కేసు వేయాలి..
⇒ వినియోగదారుల కమిషన్‌ గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొందరికి అవగాహన ఉన్నా.. కమిషన్‌ను ఎలా సంప్రదించాలో తెలియదు. కాజ్‌ ఆఫ్‌ యాక్షన్‌ (సమస్య ఎదురైనప్పటి) నుంచి రెండేళ్లలోపు కేసు దాఖలు చేయాలి. తర్వాత పెడితే కేసు చెల్లదు. ఏవైనా బలమైన కారణాలుంటే సెక్షన్‌ 24ఏ పిటిషన్‌ దాఖలు చేసుకోవచ్చు. కొందరు అనవసర కేసులు వేస్తూ విలువైన కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నారు. దీంతో నిజంగా లబ్ధిపొందాల్సిన వారు ఇబ్బందులు పడుతున్నారు.
– మీనా రామనాథన్, రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ ఇన్‌చార్జి అధ్యక్షురాలు

మధ్యంతర ఉత్తర్వులిస్తాం..
⇒ రాష్ట్ర కమిషన్‌కు ఎక్కువగా అప్పీల్‌ కేసులు వస్తున్నాయి. దీంతో పరిష్కారంలో కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉంది. కొన్ని 
సందర్భాల్లో కమిషన్‌కు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే అధికారం ఉంటుంది. ఉదాహరణకు.. ఒక వ్యక్తి ఓ బిల్డర్‌ వద్ద ప్లాట్‌ కొనుగోలు చేశారు. బిల్డర్‌ ఆ ప్లాట్‌ను రిజిస్టర్‌ చేయకుండా మరొకరికి అమ్ముతున్నప్పుడు కమిషన్‌ను సంప్రదిస్తే.. ఆ లావాదేవీని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే అధికారం ఉంటుంది. 
– పి.భాస్కర్, కోర్టు ఆఫీసర్, రాష్ట్ర కమిషన్‌

చదువుకున్నా అవగాహన తక్కువే..
⇒ డిగ్రీ చదివినా కూడా నాకు వినియోగదారుల కమిషన్‌ను ఎలా ఆశ్ర యించాలో తెలియదు. ఎక్కడా ఎలాంటి అవగా హన కార్యక్రమం చేపట్టగా చూడలేదు. కోర్టులు తెలుసుగానీ, వినియోగదారుల కమిషన్‌లో ఎన్నడూ ఫిర్యాదు చేయలేదు. ప్రభుత్వం ఇలాంటి వాటిపై అవగాహన కార్యక్రమాలు చేపడితే బాగుంటుంది.
– ఉపేందర్‌రెడ్డి, ఉప్పల్, హైదరాబాద్‌

⇒ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఎస్‌సీడీఆర్‌సీ ఏర్పాటైంది. 2015లో తొలి అధ్యక్షుడిగా జస్టిస్‌ బీఎన్‌.రావు నియమితుల య్యారు. 2018 వరకు పనిచేశారు. తర్వాత జస్టిస్‌ ఎంఎస్‌కే జైస్వాల్‌ నియమితులయ్యారు.

⇒ రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాకు ఒక జిల్లా కమిషన్‌ ఉండగా.. హైదరాబాద్‌ జిల్లాలో మాత్రం మూడు కమిషన్లు ఉన్నాయి.

⇒ జిల్లా వినియోగదారుల కమిషన్లలో నేరుగా వినియోగదారుడే వాదనలు వినిపించుకోవచ్చు లేదా న్యాయవాదిని నియమించుకోవచ్చు.

⇒ న్యాయస్థానాలే అయినా వినియోగదారులు స్థానిక భాషలో వాదనలు వినిపించుకునే అవకాశం ఉంది.

⇒ జిల్లా కమిషన్‌కు రాష్ట్ర కమిషన్, రాష్ట్ర కమిషన్‌కు జాతీయ కమిషన్‌ అప్పీలేట్‌గా వ్యవహరిస్తాయి. జాతీయ కమిషన్‌ తీర్పులను సుప్రీంకోర్టులో మాత్రమే సవాల్‌ చేయవచ్చు. ఇతర ఏ కోర్టులూ ఈ తీర్పుల్లో జోక్యం చేసుకోలేవు.

హైదరాబాద్‌ జిల్లా కమిషన్లు..
జిల్లా వినియోగదారుల కమిషన్‌–1, 2, 3
చంద్రవిహార్‌ కాంప్లెక్స్, ఎంజే రోడ్, నాంపల్లి, హైదరాబాద్‌
ఫోన్‌ నంబర్లు: 040–24733368, 040–24747733, 040–24746001
రంగారెడ్డి జిల్లా కమిషన్‌..
రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌
ఎన్‌టీఆర్‌ నగర్, ఎల్‌బీనగర్, రంగారెడ్డి 
ఫోన్‌: 040–24031275 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement