
సాంచాలు నడుపుతున్న ఈయన (గడ్డం గణేశ్, సిరిసిల్ల పట్ట ణం సర్ధార్‌నగర్) 25 ఏళ్లుగా ఇదే వృత్తిలో ఉన్నారు. రోజూ 10–12 గంటలపాటు 10 సాంచాలపై పాలిస్టర్ వస్త్రాన్ని నడిపితే వారానికి రూ.2 వేలు వస్తాయి. అదే బతుకమ్మ చీరల వస్త్రాన్ని నడిపితే వారానికి రూ.3 వేలు వస్తాయి. గణేశ్ భార్య మిషన్ కుడతారు. వారికి ఇద్దరు అమ్మాయిలు. భార్యాభర్తలు పనిచేస్తే వచ్చే డబ్బులు బట్టకు, పొట్టకే సరిపోతుంది... ఇది ఒక్క గణేశ్ పరిస్థితే కాదు.
సిరిసిల్లలో పాతిక వేలమంది కార్మి కుల దుస్థితి. ఈ నేపథ్యంలో ఆసాముల వద్ద పనిచేసే కార్మికులను యజమానులుగా మార్చేందుకు ప్రభుత్వం ‘వర్కర్ టు ఓనర్’ పథకాన్ని ప్రతిపాదించింది. నేతకార్మికుడే యజమానిగా.. మెరుగైన ఉపాధి పొందేలా ప్రణాళిక సిద్ధం చేసింది. కానీ ఆ పథకం ఐదేళ్లుగా తుదిరూపం దాల్చలేదు.
సిరిసిల్ల: నేత కార్మికులకు పుట్టినిల్లయిన సిరిసిల్లలో.. కార్మికుడే యజమానిగా మారితే వారి బతుకుల్లో మార్పు వస్తుందనే లక్ష్యంతో రాష్ట్రంలోనే తొలిసారిగా రూ.220 కోట్లతో వీవింగ్ పార్క్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా 2017 అక్టోబర్ 11న శంకుస్థాపన చేయించారు. సిరిసిల్లలో ఈ పథకం విజయవంతమైతే రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ ఏర్పాటు చేయాలనే ప్రణాళిక ఉంది.
రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక వసతుల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీ) దీని నిర్మాణాన్ని చేపట్టింది. ఇక్కడ సెమీ ఆటోమేటిక్ మరమగ్గాలను ఏర్పాటుచేసి.. ఆధునిక విధా నాల్లో వేగంగా వస్త్రోత్పత్తి చేయాలని నిర్ణయించారు. ఒకే సారి 4 రంగుల నూలుతో అనేక డిజైన్లతో వస్త్రాన్ని ఉత్పత్తిచేసి ప్రపంచస్థాయిలో వస్త్రాన్ని ఎగుమతి చేయాలని లక్ష్యం గా పెట్టుకున్నారు. అయితే ఏళ్లుగా వీవింగ్ షెడ్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతుండడంతో పనులు కొలిక్కి రాలేదు.
ఏమిటీ ‘వర్కర్ టు ఓనర్’పథకం?
వర్కర్ టు ఓనర్ పథకానికి ఎంపికైన కార్మికులు ప్రాజెక్టు వ్యయంలో పది శాతం చెల్లిస్తే 50 శాతం ప్రభుత్వ రాయితీ, మరో 40 శాతం బ్యాంకు రుణం అందుతుంది. ఒక్కో కార్మికుడికి ఒక యూనిట్ కింద రూ.8 లక్షలు వెచ్చిస్తారు. నాలుగు ఆధునిక మగ్గాలు సమకూర్చి, ఒక్కో షెడ్డులో ఎనిమిది మంది కార్మికులకు యూనిట్లు అందిస్తారు. ఆధునిక మగ్గా లపై వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తూ యజమాని, ఆసామి లేకుండా కార్మికులు సొంతంగా ఉపాధి పొందుతారు.
తొలివిడతగా ఎంపికయ్యే 1,104 మందికి ఆధునిక మగ్గాలపై శిక్షణ ఇచ్చి యూనిట్లు కేటాయిస్తారు. తమకు శాశ్వత ఉపాధి కల్పించే ఈ పథకం ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందా.. అని సిరి సిల్ల నేతన్నలు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. మంత్రి కేటీఆర్ దృష్టిపెట్టాలని నేతకార్మికులు కోరుతున్నారు.
మోడల్ లూమ్స్ బిగించాం
సిరిసిల్ల శివారులోని పెద్దూరు వద్ద బైపాస్ రోడ్డులో వీవింగ్ పార్క్‌లో షెడ్ల నిర్మాణాలు సాగుతున్నాయి. నాలుగు మోడల్ లూమ్స్ బిగించాము. వర్కర్ల షెడ్లు పూర్తయితే.. వీవింగ్ పార్క్‌ను ప్రారంభిస్తాం.
– తస్నీమా, జేడీ, జౌళిశాఖ, సిరిసిల్ల
Comments
Please login to add a commentAdd a comment