
సీసీ కెమెరా çఫుటేజీ దృశ్యం, దొంగ రామక్రిష్ణ
సాక్షి, కేపీహెచ్‌బీకాలనీ: అతనో కరుడుగట్టిన దొంగ.. దాదాపు 30 కేసుల్లో నిందితుడు.. అలవాటు ప్రకారం తాళం వేసి ఉన్న ఓ ఇంట్లోకి చోరీకి వెళ్లాడు..అక్కడ సీసీ కెమెరాలున్నాయన్న విషయం అతనికి తెలియదు..అయితే అమెరికాలో ఉన్న ఓనర్.. తన ఇంట్లో దొంగ ఉన్నట్లు గమనించి పోలీసులకు సమాచారం అందించాడు..స్పందించిన పోలీసులు వచ్చి ఇంటి బయట గడియపెట్టి.. ఆ తరువాత అరెస్టుచేశారు. అచ్చం సినీఫక్కీలా ఉన్న ఈ సంఘటన దొంగను అరెస్టు కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే...కేపీహెచ్‌బీకాలనీ రోడ్ నెంబర్ రెండులోని ఎల్‌ఐజి 237లో బి. వెంకటరత్నం నివాసముంటున్నాడు.
అతని ఇద్దరు కూతుళ్లు అమెరికాలో ఉంటున్నారు. మొదటి ఫ్లోర్ మినహా మిగతా ఇంటిని అద్దెకు ఇచ్చి ఆరు నెలల క్రితం అమెరికాకు వెళ్లాడు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత సుమారు మూడు గంటల సమయంలో తయ్యపరాజు రామక్రిష్ణ అనే కరుడుగట్టిన దొంగ వెంకటరత్నం ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డాడు. గ్రౌండ్ ప్లోర్‌లో నివాసమున్న రాజశేఖర్‌రెడ్డి దొంగతనం జరుగుతోందని అనుమానం వచ్చి అమెరికాలోని ఇంటి యజమానికి సమాచారం అందించాడు. సీసీ కెమెరాల్లో ఇంట్లోకి దొంగ వచ్చిన విషయాన్ని గుర్తించిన వెంకటరత్నం కేపీహెచ్‌బీ పోలీసులకు వెంటనే సమాచారం అందించారు.
చదవండి: చెయ్యి విరిగి ఇంటి వద్ద ఉంటున్నాడు.. కోడి గుడ్డు కూర వండలేదని..
విధుల్లో ఉన్న డిటెక్టివ్ సబ్ ఇన్‌స్పెక్టర్ శ్యాంబాబు వచ్చి ఇంటి బయటి నుంచి గడియ పెట్టారు. ఆ తరువాత పోలీసులు తలుపులు తెరిచేందుకు ప్రయత్నించగా లోపలి నుంచి కూడా గడియ పెట్టి ఉంది. దీంతో తలుపులు బద్దలు కొట్టి వెళ్లిన పోలీసులు దొంగ రామక్రిష్ణను అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే అతను దొంగిలించిన వెండి వస్తువులు, నగదును ఇంటి యజమాని సూచన మేరకు అక్కడ ఉన్నవారికి అప్పగించి దొంగను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు.