సాక్షి , హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు రెండూ తమకు సమానమేనని, ఏ రాష్ట్రం పట్ల పక్షపాతంతో వ్యవహరించడం లేదని ఏపీ ప్రభుత్వానికి కృష్ణా బోర్డు తెలిపింది. ఈ మేరకు ఏపీకి గురువారం లేఖ రాసింది. శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తిని ఆపేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించామని, అయినా విద్యుదుత్పత్తిని నిలిపివేయకపోవడంతో కేంద్ర జల శక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లామని వివరించింది. ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు, వినియోగాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటామని పేర్కొంది.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ (పీఆర్పీ) నుంచి కేటాయించిన 9 టీఎంసీల కంటే అదనంగా 0.517 టీఎంసీలను వినియోగించుకోవడంతో పీఆర్పీకి నీటి విడుదలను నిలిపేయాలని ఈ నెల 18న ఆదేశించామని గుర్తుచేసింది. ఈ ఉత్తర్వులు జారీ చేశాక పీఆర్పీకి 66, హంద్రీ–నీవాకు 5 టీఎంసీలు కేటాయించాలని ప్రతిపాదనలు పంపారని వెల్లడించింది. ఏ ప్రాజెక్టుకు కేటాయించిన నీటిని ఆ ప్రాజెక్టు ద్వారానే వాడుకోవాలని, ఒక ప్రాజెక్టుకు కేటాయించిన నీటిని మరొక ప్రాజెక్టు ద్వారా వినియోగించుకోకూడదని సూచించింది. ఇరు రాష్ట్రాల పట్ల ఒకే తరహాలో వ్యవహరిస్తున్నామని, రెండు రాష్ట్రాలు ఉత్తర్వులను అమలు చేయడంలో బోర్డుకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఏపీ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డికి కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి ఎల్బీ ముయన్‌తంగ్ లేఖ రాశారు.
Comments
Please login to add a commentAdd a comment