యాదాద్రిని సంప్రోక్షణ చేయాలి | KTR Comments On BJP | Sakshi
Sakshi News home page

యాదాద్రిని సంప్రోక్షణ చేయాలి

Published Sun, Oct 30 2022 12:50 AM | Last Updated on Sun, Oct 30 2022 12:52 AM

KTR Comments On BJP - Sakshi

శనివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: ‘రేపిస్టులకే దండలు వేసి ఊరేగించి బయటకు తీసుకువచ్చే వ్యవస్థ బీజేపీకి ఉంది. అలాంటప్పుడు ఆ పార్టీ నేతలు చేసే ప్రమాణాలు, ఇమానాలకు విలువేం ఉంటుంది. వీటితో సమస్యలు పరిష్కారమైతే కోర్టులు, చట్టాలు, పోలీసుస్టేషన్లు అక్కరలేదు. అమిత్‌ షా చెప్పులు మోసిన చేతులతో దేవుడిని తాకడం పాపం. యాదాద్రి ఆలయాన్ని సంప్రోక్షణ చేయాలని వేద పండితులను కోరుతున్నా..’అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు అన్నారు. ‘బీజేపీకి ఓటు.. మునుగోడుకు చేటు’శీర్షికతో టీఆర్‌ఎస్‌ రూపొందించిన చార్జిషీట్‌ను శనివారం తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో కలిసి కేటీఆర్‌ విడుదల చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో, ఎనిమిదేళ్లలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ 21 అంశాలతో ఈ చార్జిషీట్‌ను రూపొందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. యాదాద్రిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తడిబట్టలతో ప్రమాణం చేయడంపై, ఎమ్మెల్యేలకు ఎర అంశంపై తీవ్రంగా స్పందించారు. 

దేవుడు అపవిత్రం అవుతాడు..: ‘గుజరాత్‌ వాళ్ల చెప్పులు మోసే ఖర్మ బీజేపీ నేతలకు ఉండొచ్చేమో కానీ, వీళ్లు తాకితే దేవుడు మలినం, అపవిత్రం అవుతాడు. యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. కాబట్టి పాప ప్రక్షాళన చేయాలని వేద పండితులను, ఆలయ అధికారులను కోరుతున్నా’అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. 

మా మాటలు వక్రీకరించే అవకాశం ఉంది 
‘ఎమ్మెల్యేలకు ఎర అంశంపై మేం మాట్లాడితే విచారణను ప్రభావితం చేస్తున్నారనే విమర్శలకు అవకాశముంటుంది. దురుద్దేశాలు ఆపాదించి మా మాటలను వక్రీకరించే అవకాశముంది. అయితే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. సరైన సందర్భంలో పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ స్పందిస్తారు. దర్యాప్తు సంస్థలు అన్ని వివరాలు వెల్లడిస్తాయి. అయినా ఇప్పటికే ప్రజల ముందుకు అన్ని విషయాలు వచి్చనందున దొర ఎవరో.. దొంగ ఎవరో అర్ధమైంది. దర్యాప్తును ప్రభావితం చేసేలా నాతో సహా పార్టీ నేతలెవరూ తొందరపాటు ప్రకటనలు చేయరు..’అని మంత్రి చెప్పారు. 

మునుగోడు ఆత్మగౌరవాన్ని బీజేపీ కొనాలనుకుంటోంది.. 
మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని ధనబలంతో జూటా, జుమ్లా పార్టీ బీజేపీ కొనుగోలు చేయాలనుకుంటోందని కేటీఆర్‌ విమర్శించారు. అడ్డికి పావుశేరు చొప్పున దేశాన్ని అమ్మేస్తూ బీజేపీ ప్రభుత్వం కాలే కడుపులను మరింత మాడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

8 ఏళ్లలో రూ.100 లక్షల కోట్ల అప్పు 
► చార్జిషీట్‌లోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 67 ఏళ్లలో అందరు ప్రధానులు రూ.55.87 లక్షల కోట్ల అప్పు చేస్తే, మోదీ ఒక్కరే ఎనిమిదేళ్లలో రూ.100 లక్షల కోట్లు అప్పు చేశారు.
► అప్పులపై వడ్డీలు చెల్లించేందుకు దేశ ఆదాయంలో 2014–15లో 36.1 శాతం ఖర్చు చేస్తే, 2021లో వడ్డీ భారం 43.7 శాతానికి పెరిగింది. 
► చేనేత, ఖాదీ ఉత్పత్తులపై దేశంలోనే తొలిసారిగా 5 శాతం జీఎస్టీ విధించిన ఘనత బీజేపీదే.  
► మోటార్లకు మీటర్లు పెట్టడం ద్వారా ఉచిత విద్యుత్‌కు ఉరి వేసింది. 
► కృష్ణా జలాలపై మోదీ ప్రభుత్వం నికృష్ట రాజకీయం చేస్తోంది. 
► గ్యాస్‌ ధర పెంపుతో వంట గదిలో మంట పెట్టింది 
► పెట్రో ధరల పెంపుతో జనం నడ్డివిరుస్తోంది.  
► మునుగోడు ఫ్లోరైడ్‌ గోడును కేంద్రం పట్టించుకోలేదు. 

వీటితో పాటు గిరిజన రిజర్వేషన్ల అమలు, గౌడ కులస్తుల అణిచివేత, బీసీలపై కపట ప్రేమ సంక్షేమ పథకాలు, నిరుద్యోగం, తెలంగాణ విద్యార్థులపై వివక్ష, విభజన చట్టానికి తూట్లు, రైతు వ్యతిరేక విధానాలు, రూపాయి పతనం, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం వంటి అంశాలను చార్జిషీట్‌లో పొందుపరిచారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సి.లక్ష్మారెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్‌రెడ్డి, కాలే యాదయ్య, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, పార్టీ నేతలు సీతారాం నాయక్, దాసోజు శ్రవణ్, గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement