బోర్డెక్స్ మెట్రోపోల్ ప్రతినిధితో కలిసి ఒప్పంద పత్రం చూపిస్తున్న మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు పెట్టుబడులతో వచ్చేవారికి ఎర్రతివాచీతో స్వాగతం పలుకుతామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. పారిస్ పర్యటనలో ఉన్న కేటీఆర్ నేతృత్వంలోని బృందం శనివారం పలువురు ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తలు, సీఈవోలతో భేటీలు నిర్వహించింది. ‘యాంబిషన్ ఇండియా’ సదస్సులో అంతర్భాగంగా పలు భేటీలు జరిగాయి.
రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను పరిశీలించేందుకు తెలంగాణలో పర్యటించాల్సిందిగా ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తలు, సీఈవోలకు ఆహ్వానం పలికారు. కేటీఆర్ వెంట ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, ఏరో స్పేస్, డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్, డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం ఉన్నారు.
కేటీఆర్ భేటీలు సాగాయిలా..
► ఫ్రాన్స్‌లో రెండో అతిపెద్ద ఫార్మాసూటికల్ గ్రూప్ యాజమాన్యంతో మంత్రి కేటీఆర్ భేటీ అ య్యారు. తెలంగాణలో ఉన్న ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగ వాతావరణాన్ని వివరించడంతో పాటు పరిశ్రమలు, విద్యారంగం అనుసంధానానికి రీసెర్స్ అండ్ ఇన్నొవేషన్ సర్కి ల్ ఆఫ్ హైదరాబాద్ చూపుతున్న చొరవను ప్ర స్తావించారు. 2022లో జరిగే బయో ఏసియా స దస్సులో పాల్గొని పరస్పర భాగస్వామ్యానికి ఉ న్న అవకాశాలను పరిశీలించాల్సిందిగా కోరారు.
► సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్స్ ఇంజిన్స్ సీఈవో జీన్‌పాల్ అల్రే, భారత్‌లో ఫ్రాన్స్ మాజీ రాయబారి అలెగ్జాండర్ జిగెల్‌తోనూ కేటీఆర్ భేటీ అయ్యా రు. సాఫ్రాన్ ఇటీవల హైదరాబాద్‌లో ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ తయారీ కార్యకలాపాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. తెలంగాణలో వైమానిక, రక్షణ రంగాల్లో నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటుపై సాఫ్రాన్ ప్రతినిధి బృందంతో చర్చించారు. ఫ్రాన్స్‌లో భారత రాయబార కార్యాలయం ఎయిర్‌అటాషెగా ఉన్న ఎయిర్ కమెడోర్ హిలాల్ అహ్మద్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.
► 115 దేశాల్లో 4 వేలకుపైగా ప్రాజెక్టుల ద్వారా సుస్థిర అభివృద్ధి కోసం నిధులు సమకూరుస్తున్న ఫ్రెంచ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ(ఎఎఫ్‌డీ) ఆసియా, మధ్యప్రాచ్యం వ్యవహారాల డైరెక్టర్ ఫిలిప్ ఓర్లియాంజేతోనూ కేటీఆర్ సమావేశమయ్యారు. రక్షణ, సైనిక, వైమానిక, అంతరిక్ష, రవాణా రంగాల్లో పనిచేస్తున్న థేల్స్ గ్రూప్ సీనియర్ ఉపాధ్యక్షులు మార్క్ డార్మన్, భారత్ సీఈవో ఆశిష్ సరాఫ్‌తో కేటీఆర్ బృందం భేటీ జరిపింది. హైదరాబాద్ మెట్రో నిర్వహణలో భాగస్వామిగా ఉన్న కియోలిస్ గ్రూప్ సీఈవో బెర్నార్డ్ తబరీతో భేటీ అయ్యారు. ఎనర్జీ, ఆటోమేషన్‌లో డిజిటల్ పరిష్కారాలు చూపే ష్నీడర్ ఎలక్ట్రిక్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు లుక్ రెమోంట్ తో సమావేశమయ్యారు.
► పారిస్‌లోని లక్సంబర్గ్ ప్యాలెస్‌లో రాష్ట్ర ప్రభుత్వం, బోర్డెక్స్ మెట్రోపోల్ నడుమ మంత్రి కేటీఆర్ సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. సుస్థిర నగరాలను అ భివృద్ధి చేసే లక్ష్యం తో పలు ప్రాజెక్టులపై తెలంగాణ, బోర్డెక్స్ మెట్రోపోల్ కలసి పనిచేస్తాయి. 2015 అక్టోబర్ 13న ఇరుపక్షాల నడుమ కుదిరిన ఒప్పందానికి కొనసాగింపుగా ఈ ఎంఓయూ కు దిరింది.
► పారిస్ పర్యటనలో ఉన్న కేటీఆర్‌ను నీలా శ్రీనివాస్ నేతృత్వంలోని ‘తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఫ్రాన్స్’సభ్యులు, నారాయణరావు నేతృత్వంలోని ‘ఫ్రాన్స్ తెలుగు అసోసియేషన్’సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.
Comments
Please login to add a commentAdd a comment