సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఆర్మీ పరిధిలో ఉన్న కంటోన్మెంట్ బోర్డు తీరు సరిగా లేదని.. అది హైదరాబాద్ నగర అభివృద్ధికి అడ్డంకిగా మారుతోందని ఐటీ పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కె.తారకరామారావు మండిపడ్డారు. ఆ ప్రాంత నిర్వహణపై స్వయం ప్రతిపత్తి ఉన్నంత మాత్రాన.. రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్ నగరపాలక సంస్థలు చేసిన సూచనలను పట్టించుకోకపోవడం సరికాదని స్పష్టం చేశారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా శనివారం ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో కేటీఆర్ మాట్లాడారు. ‘‘ఆర్మీ పరిధిలో ఉన్న కంటోన్మెంట్ బోర్డు వ్యవహారం నగర అభివృద్ధికి అడ్డంకిగా మారుతోంది. ఏఎస్‌ఐ సమీపంలోని బోర్డు ప్రాంతంలో చెక్‌డ్యాం నిర్మించారు. అక్కడ చేరుకున్న నీటితో కింద ఉన్న నదీమ్ కాలనీలోకి నీళ్లు వస్తున్నాయి. కంటోన్మెంట్ పరిధిలో రోడ్లను కూడా మూసేస్తున్నారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు సూచనలు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే కరెంటు, నీటి సరఫరా బంద్ చేస్తాం.’’అని హెచ్చరించారు.
హైదరాబాద్‌పై మోదీ స్పందించరేం?
రెండేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలతో హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలు ముంపునకు గురైన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. అప్పట్లో కేంద్ర మంత్రులు, ఇతర బీజేపీ నాయకులు వచ్చి చుట్టపుచూపుగా చూసి వెళ్లడమే తప్ప.. ఇప్పటికీ పైసా సాయం అందించకపోవడం బాధాకరమన్నారు. గుజరాత్‌లో వరదలు వస్తే వెంటనే స్పందించి రూ.వెయ్యి కోట్లు సాయం చేసిన ప్రధాన మంత్రి మోదీ.. హైదరాబాద్ విషయానికి వస్తే ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. ఇక తెలంగాణ నుంచి ఒకవ్యక్తి కేంద్ర మంత్రిగా ఉన్నారని.. కనీసం ఆ మంత్రి కూడా హైదరాబాద్‌కు వరద సాయం కోసంఏమాత్రం ప్రయత్నించకపోవడం సిగ్గుచేటని కిషన్‌రెడ్డిని ఉద్దేశించి విమర్శించారు.
Live: Replying to a question on ‘Strategic Nala Development Program (SNDP) in Hyderabad’ city https://t.co/7Fw8Zxdo5E
— KTR (@KTRTRS) March 12, 2022
వ్యూహాత్మక ప్రాజెక్టులు చేపట్టాం
భారీ వర్షాలు, వరదల నుంచి నగరాన్ని రక్షించేందుకు, సమగ్ర అభివృద్ధి కార్యక్రమాల కోసం వ్యూహాత్మక ప్రాజెక్టులు అమలు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ శాసనసభలో వివరించారు. ఇందుకోసం షా కన్సల్టెన్సీని ఎంపిక చేసి పూర్తి స్థాయి సర్వేలు చేయించామని.. అభివృద్ధి కార్యక్రమాలను మూడు విధాలుగా విభజించి చేపడుతున్నామని తెలిపారు. ముందుగా ఎంసీహెచ్ (పాత హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) పరిధిలోని అంతర్గత మురుగు వ్యవస్థ, నాలా వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. పాత పైపులైన్లను పునరుద్ధరించేందుకు రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. మురుగు నీటి పారుదల, వరద నీటి పారుదలకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాల్సిందని.. ఇన్నాళ్లుగా ఆ రెండూ కలిపి ఉండటంతో ఇబ్బందులు వస్తున్నాయని కేటీఆర్ వివరించారు. కొన్నిచోట్ల తాగునీటి పైపులైన్లు కూడా వీటిలో కలుస్తున్నాయని చెప్పారు. వ్యూహాత్మక ప్రణాళికలో భాగంగా వీటన్నింటినీ వేర్వేరుగా, ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. హైదరాబాద్ పరిధిలోని నాలాలపై దాదాపు 10వేలకు పైగా ఆక్రమణలు, నిర్మాణాలు ఉన్నాయని.. వాటిని తొలగించేందుకు వ్యూహాత్మక నాలా అభివృద్ధి ప్రాజెక్టు చేపట్టామని వివరించారు. ఆక్రమణలు తొలగించి బాధితులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment