మణికొండ: ఒక్కో గ్రామంలో ఒక్కో భవనం, విగ్రహాలు, చౌరస్తాలు, బావులు లాండ్ మార్క్‌గా నిలవటం సహజం. కానీ రెండు చెట్లు ఈ ప్రాంతంలో దశాబ్దాల కాలం పాటు ల్యాండ్ మార్క్‌గా నిలుస్తున్నాయి. ఈ ప్రాంతం అభివృద్ధి చెందే క్రమం నుంచి ఇప్పటికీ అవి అలాగే కొనసాగుతున్నాయి. వాటి చుట్టు పక్కల మరో ల్యాండ్ మార్క్ ఏర్పాటు చేసినా ప్రజలు వాటిని గుర్తించలేక పాత వాటితోనే పిలుస్తున్నారంటే ప్రజల్లో ఎంతలా నాటుకుపోయాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఆ చెట్లేంటి? వాటి కథేంటి? తెలుసుకుందాం..
దైనా కొత్త ప్రాంతానికి వెళ్లాలన్నా.. ఎవరికైనా అడ్రస్ చెప్పాలన్నా.. ముందుగా ఆ ప్రాంతం పేరుతోపాటు అక్కడ ప్రాచుర్యం పొందిన ల్యాండ్ మార్క్ చెప్పడం పరిపాటి.. అయితే అభివృద్ధి చెందే క్రమంలో కొన్ని పేర్లు మారుతుంటాయి.. మరికొన్ని ఏళ్ల తరబడి అవే గుర్తింపుగా మారుతుంటాయి.. అలాంటి గుర్తింపు పొందిన రెండు వృక్షాల కథే ఇది..పూర్తి వివరాల్లోకి వెళితే గతంలో మణికొండకు కొత్తగా వచ్చే వారు మీ ఇంటికి ఎలా రావాలి అంటే ముందుగా మర్రిచెట్టు వద్దకు వచ్చి ఎడమవైపు, కుడి వైపు, నేరుగా ఇటువైపు రావాలని చిరునామా చెప్పే వారు. దాని కేంద్రంగానే మణికొండకు కొత్తగా వచ్చే వారు గమ్యస్థానాలను చేరేవారు.
ఇదే మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడ, నెక్నాంపూర్ వాసులు అలకాపూర్ టౌన్‌షిప్ ప్రవేశంలో ఉండే చింత చెట్టును కేంద్రంగా చేసుకుని చిరునామా చెప్పేవారు. అక్కడి నుంచి ఎడమ, కుడి, నేరుగా అనే రోడ్లతో వారి గమ్యస్థానాలకు చేరుకునే వారు. ఆ తరువాతి క్రమంలో గూగుల్ మ్యాప్‌లు, లొకేషన్ పాయింట్లు వచ్చి వాటి ఆదారంగా కొత్త వారు గమ్య స్థానాలను చేరుకుంటున్నా వీటి గుర్తింపు ఏమాత్రం చెక్కు చెదరలేదు. వాటిలో ముందుగా మణికొండ మర్రిచెట్టు, పుప్పాలగూడ, నెక్నాంపూర్ చింతచెట్టు అడ్రస్‌కి కేరాఫ్‌గా మారాయి.
మార్పులు చేసినా...
మణికొండ మర్రిచెట్టు కూడలికి కాల క్రమంలో పేరు మార్చాలనే ఉద్దేశంతో ఓ సంస్థ దాని కింద భరతమాత విగ్రహాన్ని నెలకొలి్పంది. అప్పటి నుంచి దాన్ని భరతమాత కూడలిగా పిలవాలని ప్రకటించారు. అది ఏమాత్రం ప్రజల్లోకి ఎక్కకుండా అదే మర్రిచెట్టు కూడలిగానే ప్రసద్ధి చెందుతోంది. ఇదే తరహాలో పుప్పాలగూడ, నెక్నాంపూర్ వాసులకు ల్యాండ్ మార్క్‌గా ఉన్న చింత చెట్టు పక్కనే మున్సిపాలిటీ నుంచి శోభాయమానంగా సీతాకోకచిలుకలు ఎగురుతున్నట్టుగా కూడలిని అభివృద్ధి చేశారు. దాన్ని బటర్‌ఫ్లై కూడలిగా నామకరణం చేసినా దాన్ని ఎవరూ పట్టించుకోవటం లేదు.
అదే చింతచెట్టు సర్కిల్‌గానే దాని పేరు కొనసాగుతోంది. అదే రోడ్డులో అలకాపూర్ టౌన్íÙప్‌లోకి నేరుగా వెళితే మూలమలుపు వద్ద ఏర్పాటు చేసిన యోగ సర్కిల్(సూర్యనమస్కారాల బొమ్మలు) మాత్రం ఇప్పుడిపుడే ప్రాచూర్యం పొందుతున్నాయి. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన మర్రిచెట్టు, చింతచెట్ల చరిత్ర అవి జీవించినంత కాలం కొనసాగుతుందని స్థానికులు భావిస్తున్నారు. మణికొండలోని అదే మర్రిచెట్టుపై కొత్తగా రావి చెట్టు, దాని కింద వేపచెట్టు పెరుగుతుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment