సాక్షి, హైదరాబాద్ : మరో నాలుగు రోజుల్లో హోలీ పండుగ రాబోతుంది. ఈ క్రమంలో హోలీ నాడు రంగులతో ఆటలే కాకుండా ఫుల్‌గా తాగి రోడ్లపై తాగుబోతులు వీరంగం సృష్టిస్తుంటారు. వీరి వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. వీటన్నింటికి చెక్ పెట్టడానికి హైదరాబాద్ పోలీసులు నడుం బిగించారు. రంగుల వేడుక హోలీ పండుగ సందర్భంగా జంట నగరాల్లో ఈ సారి కఠిన నిబంధనలు అమలు చెయ్యాలని పోలీసులు భావిస్తున్నారు. హోలీ పండుగ నేపథ్యంలో 36 గంటలపాటు మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు ప్రకటిస్తూ మందుబాబులకు షాక్ ఇచ్చారు. హోలీ పండుగ సందర్బంగా మార్చి 28 తేది సాయంత్రం 6 గంటల నుంచి మార్చి 30 ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని మద్యం దుకాణాలు, కల్లు కాంపౌండ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్‌లను మూసివేయాలని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆదేశాలు జారీ చేశారు.
హోలీ వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరికీ ఇబ్బంది కలగకుండా హోలీ వేడులను ప్రజలు జరుపుకోవాలని..పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాహనాలపై గుంపులు..గుంపులుగా ప్రయాణించవద్దని ఒకవేళ అలా ప్రయాణిస్తే అలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రయాణీకులపైనా.. వాహనాలపై వెళ్లేవారిపైనా వారి అనుమతి లేకుండా బలవంతంగా రంగులు చల్లరాదనీ సీపీ హెచ్చరికలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment