ఇటు ఢమాల్‌!  | Luxury Home Sales On Decline In Hyderabad | Sakshi
Sakshi News home page

ఇటు ఢమాల్‌! 

Published Fri, May 6 2022 1:39 AM | Last Updated on Fri, May 6 2022 3:22 PM

Luxury Home Sales On Decline In Hyderabad - Sakshi

నానక్‌రామ్‌గూడలో ఐదెకరాల్లో ఎత్తయిన ఆకాశహర్మ్యాన్ని నిర్మిస్తున్నాం. 800కు పైగా యూనిట్లు. ధర చదరపు అడుగుకు రూ. 8 వేలు. ప్రాజెక్టుకు పునాదిరాయి పడటం.. నిర్మాణ పనులు శరవేగంగా జరగడంతో ప్రతి నెలా 70–80 యూనిట్లు అమ్ముడుపోయేవి. 111 జీవో ఎత్తివేత ప్రకటనతో అమ్మకాలు తగ్గిపోయాయి. కనీసం రెండంకెల సంఖ్యను కూడా చేరుకోవట్లేదు... ఇదీ ఓ లగ్జరీ ప్రాజెక్టు డెవలపర్‌ ఆవేదన 

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ స్థిరాస్తి రంగంపై జీవో 111 రద్దు ప్రభావం బాగా పడింది. ముఖ్యంగా నగర రియల్టీకి ఆయువు పట్టువైన పశ్చిమ హైదరాబాద్‌పై దీనిప్రభావం ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లోని లగ్జరీ గృహాల విక్రయాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. చదరపు అడుగు రూ.6 వేల కంటే ఎక్కువ ధర ఉన్న ప్రాజెక్టుల్లో కొనుగోళ్లకు కస్టమర్లు వెనకాడుతున్నారు. ధరలు తగ్గుతాయేమోనని ఆలోచిస్తున్నారు. ఎక్కువ ధరకు అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు కొనే బదులు అదే ధరకు 84 గ్రామాల పరిధిలో వ్యక్తిగత గృహాలు, విల్లాలు కొనొచ్చని అనుకుంటున్నారు. దీంతో పశ్చిమ హైదరాబాద్‌లోని హై రైజ్, లగ్జరీ ప్రాజెక్టుల్లో విక్రయాలు పడిపోయాయి. రిజిస్ట్రేషన్ల ఆదాయమూ బాగా తగ్గింది.  

పశ్చిమంలో 50 వేల యూనిట్లు 
ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీల వల్ల పశ్చిమ హైదరాబాద్‌లో గృహ కొనుగోళ్లు, లాంచింగ్‌లు ఎక్కువగా ఉంటాయి. నగర రియల్టీలో ఈ ప్రాంతం వాటా 60 శాతం. కూకట్‌పల్లి, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కోకాపేట, గోపన్‌పల్లి, నల్లగండ్ల వంటి ప్రాంతాల్లో సుమారు 10 కోట్ల చద రపు అడుగుల్లో నివాస సముదాయాలు నిర్మాణం లో ఉన్నాయి. వీటిల్లో సుమారు 50 వేల యూనిట్లు ఉంటాయని అంచనా.

111 జీవో పరిధిలో లేకపోవడంతో కొల్లూరు, తెల్లాపూర్, నల్లగండ్ల, గోపన్‌పల్లి, నానక్‌రామ్‌గూడ, నార్సింగి, కోకాపేట, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్, పుప్పాలగూడల్లో భూముల ధరలు ఎక్కువగా ఉండేవి. ఈ ప్రాంతాల్లో గతేడాది జీహెచ్‌ఎంసీ 83 హై రైజ్‌ భవనాలకు అనుమతిచ్చింది. ఇందులో 13 ఆకాశహర్మ్యాలు 30 అంతస్తుల కంటే ఎత్తయినవి. అయితే తాజాగా జీవోను ఎత్తేయడంతో అమ్మకాలు నేలచూపులు చూస్తున్నాయి.  

ప్రీలాంచ్‌ ఒప్పందాలు రద్దు 
గతంలో కోకాపేట, నార్సింగి, పుప్పాలగూడ ప్రాంతాల్లో చాలా వరకు నిర్మాణ సంస్థలు ప్రీలాంచ్‌లో భారీగా అమ్మకాలు జరిపేవి. తక్కువ ధరకు వస్తుందని కొనుగోలుదారులూ మొగ్గు చూపేవారు. 111 జీవో రద్దుతో వీరంతా ఆయా నిర్మాణ సంస్థల ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఒప్పందం రద్దు చేసుకొని కట్టిన డబ్బులు ఇవ్వాలని డెవలపర్లను కోరుతున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement