
ఒక మండపాన్ని నిర్మించి అందులో రంగమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించారు
గద్వాల: 83 ఏళ్ల ఓ వృద్ధుడు తన భార్యపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. చనిపోయిన భార్య విగ్రహాన్ని ఏర్పాటు చేసిన తన మమకారాన్ని చూపారు. గద్వాలకు చెందిన గంటలబోయిన హనుమంతుకు భార్య రంగమ్మ, నలుగురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. పిల్లలందరికీ పెళ్లిళ్లు చేయగా.. వారందరూ ఎవరికి వారు జీవితంలో స్థిరపడ్డారు.
కొన్నాళ్లుగా కుటుంబసభ్యులతో కలిసి జమ్ములమ్మ ఫిల్టర్‌బెడ్ ఎదురుగా ఉన్న సొంత వ్యవసాయ పొలంలో ఇళ్లు నిర్మించుకుని వారు జీవనం సాగిస్తున్నారు. అయితే రెండేళ్ల కిందట రంగమ్మ అనారోగ్యంతో మృతిచెందారు. తన భార్యపై ఉన్న ప్రేమతో హనుమంతు రూ.7 లక్షల వ్యయంతో ఒక మండపాన్ని నిర్మించి అందులో రంగమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించారు. భార్యపై హనుమంతుకు ఉన్న అభిమానాన్ని పలువురు ప్రశంసించారు.