ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సింహభాగం కేటాయించారు. ఈ శాఖకు ప్రగతి, నిర్వహణ పద్దులు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, ఇతర సంక్షేమ పథకాలు, కేటాయింపులు, తదితరాలు కలుపుకొని మొత్తం రూ.29,271 కోట్లు ప్రతిపాదించడం విశేషం. ఇది గతేడాదితో పోల్చితే రూ.6,266 కోట్ల మేర అధికం. బడ్జెట్‌లో పీఆర్, ఆర్‌డీ శాఖకు భారీగా నిధుల కేటాయింపుతో పల్లె ప్రగతికి ప్రభుత్వం పెద్దపీట వేసినట్లయింది.
రాష్ట్రంలో పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతానికి చేపట్టిన చర్యల్లో భాగంగా గ్రామీణ వికాసానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్న సర్కార్.. అదే ఒరవడిని కొనసాగించేలా బడ్జెట్‌ను ప్రతిపాదించింది. పల్లెప్రగతి కింద గ్రామ పంచాయతీలకు ఇప్పటివరకు రూ.5,761 కోట్లు విడుదల చేసినట్లు ప్రకటించింది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి పీఆర్, ఆర్‌డీ శాఖకు రూ.23,005.35 కోట్లు కేటాయించింది. అంతకుముందు ఏడాది (2019–20)తో పోలిస్తే ఇది రూ.7,880.46 కోట్లు అధికం. ఇక 2021–22 బడ్జెట్‌లో భాగంగా ప్రగతి పద్దు కింద పంచాయతీరాజ్‌కు రూ.5,433.99 కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ.10,154 కోట్లు, నిర్వహణ పద్దు కింద పీఆర్‌కు రూ.6,898.08 కోట్లు, ఆర్‌డీకి రూ.67.13 కోట్లు ప్రతిపాదించారు.
39,36,521 మందికి ‘ఆసరా’
2021–22 బడ్జెట్‌లో ఆసరా పింఛన్ల కోసం రూ.11,728 కోట్లు ప్రతిపాదించారు. రాష్ట్రంలో 39,36,521 మందికి ఆసరా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఇందులో 2019–20లో కేంద్రం ఒక్కొక్కరికి రూ.200 చొప్పున 6,66,105 కోట్ల మందికి రూ.105 కోట్ల మేర సహాయం అందజేసింది. వీరందరికీ ఒక్కొక్కరికి రూ.1,816 రాష్ట్ర ప్రభుత్వం జతచేసి, రూ.2,016 పింఛను అందిస్తున్న విషయం తెలిసిందే. వీరే కాకుండా 31,31,660 అసహాయులకు నెలకు రూ.2,016 చొప్పున, దివ్యాంగులకు రూ.3,016 చొప్పున పూర్తి మొత్తాన్ని రాష్ట్రమే భరిస్తూ ఆసరా పింఛన్లను అందిస్తోంది. 2019–20 ఆడిట్ నివేదిక ప్రకారం పింఛన్ల పంపిణీలో కేంద్ర వాటా 1.20 శాతం మాత్రమే కాగా మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. అసహాయులకు జీవన భద్రత కల్పనకు వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, బోదకాలు బాధితులు, కల్లుగీత కార్మికులు, నేత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, ఒంటరి మహిళలకు రూ.2,016 చొప్పున, దివ్యాంగులకు రూ.3,016 చొప్పున ఆసరా పింఛన్లు అందజేస్తున్నారు.
‘పరిషత్’లకు రూ.500 కోట్లు..
బడ్జెట్‌లో తొలిసారిగా జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లకు రూ.500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందులో జెడ్పీలకు రూ.252 కోట్లు, మండల పరిషత్‌లకు రూ.248 కోట్లు ప్రతీ ఏడాది అందించేందుకు చర్యలు తీసుకోనున్నారు. దీనికి అవసరమైన విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఖరారు చేసి ప్రకటించనున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. 15వ ఆర్థిక సంఘం స్థానిక సంస్థలకు విడుదల చేసే నిధుల్లో రాష్ట్రానికి రూ.699 కోట్ల మేర కోత విధించింది. ఈ నేపథ్యంలో గ్రామాలకు ఎలాంటి కోత లేకుండా నిధులు అందించడంతో పాటు నిరాటంకంగా అభివృద్ధి కొనసాగేందుకు తొలిసారిగా బడ్జెట్‌ను కేటాయించారు. రాష్ట్రంలోని ప్రతీ గ్రామంలో మరణించిన వారికి సగౌరవంగా అంతిమ సంస్కారాలు చేసేందుకు వీలుగా ఇప్పటికే పలు పల్లెల్లో వైకుంఠధామాల నిర్మాణాలు మొదలయ్యాయి. 2021–22 బడ్జెట్‌లో వైకుంఠధామాల నిర్మాణాల కోసం రూ.200 కోట్లు ప్రతిపాదించారు.
వడ్డీలేని రుణాలకు రూ.3 వేల కోట్లు..
బడ్జెట్‌లో మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల కోసం రూ.3 వేల కోట్ల మేర భారీ మొత్తాన్ని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం అంది స్తున్న సహకారంతో ఈ çస్వయం సహాయక సంఘాలు వృద్ధి చెందడంతోపాటు, వారిలో పొదుపు చైతన్యం సైతం వెల్లివిరుస్తోంది. రాష్ట్రంలో 4,29,262 స్వయం సహాయక సంఘాలుండగా, వాటిలో 46,65,443 మంది సభ్యులున్నారు. వీరంతా పొదుపు చేసుకుంటూ బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలు పొంది, క్రమం తప్పకుండా తిరిగి చెల్లింపులు చేస్తుండటంతో వారి పరపతి గణనీయంగా పెరిగింది. 2020–21లో మహిళా సంఘాల సభ్యులకు రూ.9,803 కోట్ల రుణాలు వడ్డీలు లేకుండా అందించగా, రుణాల రికవరీ రేటు 97.25 శాతంగా నిలుస్తోంది. త్వరితంగా పూర్తి చేసేందుకు వీలుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment