
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సానుకూల పరిస్థితులున్నాయి. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సేనని పలు సర్వేల్లో తేలింది. ఈ పరిస్థితుల్లో పార్టీ శ్రేణులు కలిసి పనిచేయాలి. అంతర్గత కలహాలకు అవకాశం ఉండకూడదు. టీపీసీసీ అధ్యక్షుడు అన్ని వర్గాల నాయకులను సమన్వయం చేసుకుని నిర్ణయాలు తీసుకుని పార్టీని ముందుకు తీసుకెళ్లాలి..’ అని టీపీసీసీ నేతలకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ దిశా నిర్దేశం చేశారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపై మీడియాకెక్కి మాట్లాడితే సహించేది లేదని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధిష్టానం నిర్ణయించిందన్నారు.
బుధవారం ఠాగూర్ అధ్యక్షతన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం జూమ్ యాప్ ద్వారా జరిగింది. నాలుగు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డితో పాటు కన్వీనర్ షబ్బీర్ అలీ, పీఏసీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి, సీఎల్పీ నాయకులు భట్టి విక్రమార్క, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు రాంరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. కాగా ఈ భేటీలో ఏఐసీసీ కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఠాగూర్ మాట్లాడారు.
పార్టీ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి
‘పార్టీ నాయకులు, కార్యకర్తలు చిత్తశుద్ధితో పనిచేయాలి. కాంగ్రెస్ తలపెట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి విజయవంతంగా తీసుకెళ్లాలి. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, నిత్యావసర సరు కుల ధరల పెరుగుదల అంశాలను ప్రజలకు వివరించాలి. ఈనెల 10నుంచి నిర్వహించే ఏఐసీసీ శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనాలి. జన జాగరణ పాదయాత్రలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా తప్పనిసరిగా నిర్వహించాలి. ఏఐసీసీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు విధిగా పాల్గొని విజయవంతం చేయాలి..’ అని ఠాగూర్ పిలుపునిచ్చారు.
మార్చి 31లోగా సభ్యత్వ నమోదు
‘సభ్యత్వ నమోదు కార్యక్రమం వేగం పెంచాలి. రాష్ట్రంలో 30 లక్షల సభ్యత్వ నమోదు లక్ష్యంగా నిర్దేశించాం. ఇప్పటివరకు 6 లక్షల సభ్యత్వాలు పూర్తయ్యాయి. మార్చి 31 నాటికి మిగతా లక్ష్యాన్ని పూర్తిచేయాలి. సభ్యత్వ నమోదు చేసుకున్న కార్యకర్తకు రూ.2 లక్షల ప్రమాద బీమా వస్తుంది..’ అని తెలిపారు. టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన జంగ్ సైరన్, దళిత దండోర, వరి దీక్షలు, కల్లాల్లో కాం గ్రెస్ కార్యక్రమాలు విజయవంతం అయ్యాయని అభినందించారు. ‘రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అన్ని స్థాయిల్లో క్రమశిక్షణ పాటించాలి. అంతర్గత కలహాలతో రచ్చకెక్కొద్దు. ఇబ్బందులు తలెత్తితే నాకు లేదా ఏఐసీసీ కార్యదర్శికి, లేదా సోనియాగాంధీకి లేఖ ద్వారా అభిప్రాయాలను తెలపాలి..’ అని సూచించారు. కాగా క్రమశిక్షణ కమిటీ పనితీరుపై పార్టీ సీనియర్లు వీహెచ్, పొన్నాల అసంతృప్తి వ్యక్తం చేశారు. జంగా రాఘవరెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావుపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని వారు ప్రస్తావించారు.
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నాం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నామని, కాంగ్రెస్ పార్టీ తరఫున ఉదృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు చెప్పారు. ‘ఏఐసీసీ తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాం. వీటితో పాటు టీపీసీసీ తరఫున కూడా పక్కా ప్రణాళికతో కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం..’ అని తెలిపారు. షబ్బీర్‌అలీ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ కూడా మాట్లాడారు.
వైఖరి నచ్చకుంటే తప్పుకుంటా: జగ్గారెడ్డి
ఇటీవల రేవంత్‌రెడ్డిపై విమర్శలు ఎక్కుపెట్టిన జగ్గారెడ్డి ఈ సమావేశానికి ఆలస్యంగా హాజరయ్యారు. తాను ఏం మాట్లాడిందీ, ఎందుకు మాట్లాడిందీ వివరించారు. ఒకవేళ తన వ్యవహారశైలి పార్టీ అధిష్టానానికి నచ్చకపోతే, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పుకుంటానని ఆయన చెప్పినట్లు తెలిసింది. సీనియర్ నేతలు జానారెడ్డి, శ్రీధర్‌బాబు జోక్యం చేసుకుని ఎవరూ తప్పుకోవాల్సిన అవసరం లేదని, కలిసికట్టుగా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పనిచేద్దామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment