27 నుంచి ఎంబీబీఎస్‌ ఆలిండియా కౌన్సెలింగ్‌.. | MBBS All India Counseling Starts From 27th | Sakshi
Sakshi News home page

27 నుంచి ఎంబీబీఎస్‌ ఆలిండియా కౌన్సెలింగ్‌..

Published Sat, Oct 24 2020 2:59 AM | Last Updated on Sat, Oct 24 2020 2:59 AM

MBBS All India Counseling Starts From 27th - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆలిండియా ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఈ నెల 27 నుంచి ప్రారంభం కానుంది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలకు చెందిన 15 శాతం సీట్లను ఆలిం డియా కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేస్తారు. అలాగే ఎయిమ్స్, జిప్‌మర్‌ తదితర జాతీయ స్థాయి వైద్య విద్యా సంస్థల సీట్లనూ ఈ కౌన్సెలింగ్‌ ద్వారానే భర్తీ చేస్తారు. ఆ ప్రకారం దేశవ్యాప్తంగా దాదాపు 6,410 ఎంబీబీఎస్‌ సీట్లకు రెండు విడతల కౌన్సెలింగ్‌ జరుగుతుంది. ఈ మేరకు మెడికల్‌ కౌన్సిల్‌ కమిటీ (ఎంసీసీ) శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇటీవల నీట్‌ ఫలి తాలు వెల్లడైన నేపథ్యంలో అడ్మిషన్ల ప్రక్రియ మొదలైంది. 27 నుంచి వచ్చే నెల 2 వరకు మొదటి విడత కౌన్సెలింగ్‌ జరుగుతుంది. 5న ఏ కాలేజీలో సీటు వచ్చిందో ప్రకటిస్తారు.

అనంతరం విద్యార్థులు అదే నెల 6 నుంచి 12 వరకు వారికి కేటాయించిన కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. ఇక రెండో విడత కౌన్సెలింగ్‌ వచ్చే నెల 18 నుంచి 22వ తేదీ మూడు గంటల వరకు జరుగుతుంది. 25న కాలేజీ సీటు కేటా యింపు ఫలితాన్ని ప్రకటిస్తారు. అదే నెల 26 నుంచి డిసెంబర్‌ 2 నాటికి కేటాయించిన కాలేజీల్లో విద్యార్థులు చేరాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది. రెండు విడతల కౌన్సెలింగ్‌ అనంతరం రాష్ట్రాల నుంచి తీసుకున్న 15 శాతం సీట్లలో మిగిలిన వాటిని తిరిగి ఆయా రాష్ట్రాలకు వెనక్కు ఇస్తారు. అయితే ఎయిమ్స్, జిప్‌మర్, కేంద్ర, డీమ్డ్‌ వర్సిటీ, ఈఎస్‌ఐసీ వంటి సంస్థల్లో మిగిలిన సీట్లకు మాత్రం మాప్‌ అప్‌ రౌండ్‌లో ఆలిండియా కౌన్సెలింగ్‌ జరుగుతుంది. డిసెంబర్‌ 10 నుంచి 14వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు మాప్‌అప్‌ రౌండ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ జరుగుతుంది. సీటు కేటాయించిన కాలేజీని అదే నెల 17న ప్రకటిస్తారు. విద్యార్థులు 18 నుంచి 24 నాటికి కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. అప్పటికీ మిగిలిన సీట్లను అదే నెల 28 నుంచి 31 వరకు భర్తీ చేస్తారు. 

29న రాష్ట్రంలో మెడికల్‌ నోటిఫికేషన్‌
ఆలిండియా సీట్లకు కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలైన తర్వాత ఈ నెల 29న తెలంగాణలో మెడికల్‌ ప్రవేశాల నోటిఫికేషన్‌ ప్రారంభం కానుంది. తదుపరి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభిస్తామని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు తెలిపాయి. జాతీయ స్థాయిలో మొదటి విడత కౌన్సెలింగ్‌ పూర్తయిన తర్వాత, రాష్ట్రంలో మొదటి విడత కౌన్సెలింగ్‌ మొదలవుతుంది. అలాగే జాతీయస్థాయి రెండో విడత కౌన్సెలింగ్‌ పూర్తయ్యాక, రాష్ట్రంలో రెండో విడత జరుగుతుంది. జాతీయస్థాయి కౌన్సెలింగ్‌ తర్వాత వెనక్కు వచ్చే సీట్లతో కలిపి రాష్ట్రంలో మూడో విడత కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని కాళోజీ వర్గాలు తెలిపాయి.

ఆ తర్వాత మాప్‌అప్‌ రౌండ్‌ నిర్వహిస్తారు. ఈసారి సర్టిఫికెట్ల ఫిజికల్‌ వెరిఫికేషన్‌ ఉండదని, ఆన్‌లైన్‌లోనే వెరిఫికేషన్‌ ఉంటుందని ఆ వర్గాలు వెల్లడించాయి. ఇక ఏప్రిల్‌ ఒకటి తర్వాత తీసుకున్న ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్లు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశాయి. గతేడాది తీసుకున్న ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికేట్లు చెల్లుబాటు కావని స్పష్టం చేశాయి. ఈ నెల 29 నాటికి రాష్ట్రానికి నీట్‌ ర్యాంకుల డేటా వివరాలు వస్తాయని చెబుతున్నారు. అదే రోజు నోటిఫికేషన్‌ జారీచేస్తారు. ఇదిలావుంటే కరోనా నేపథ్యంలో వైద్య విద్య తరగతులు ఎప్పుడు ప్రారంభం అవుతాయన్న విషయంలో స్పష్టత లేదని అధికారులు తెలిపారు. వాస్తవంగా జాతీయస్థాయి మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తయిన వెంటనే వచ్చే నెల 15న తరగతులు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ తరగతుల ప్రారంభంపై స్పష్టతలేదని అంటున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement