మంచిర్యాలక్రైం: జిల్లాలో రోజురోజుకూ తల్వార్లు, కత్తుల సంస్కృతి పెరిగిపోతోంది. జన్మదిన వేడుకలు జరుపుకునేందుకు అర్ధరాత్రి నగరం నడిబొడ్డున కేక్ కట్ చేయడం హంగామా సృష్టించడం జిల్లాలో పరిపాటిగా మారింది. జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో మంగళవారం అర్ధరాత్రి అధికార పార్టీకి చెంది న యవజన విభాగం పట్టణ అధ్యక్షుడు గడప రాకేష్ (జిమ్ రాకేష్) జన్మదిన వేడుకల పేరిట హంగామా సృష్టించారు. వేడుకల్లో ఆయన అనుచరులు తల్వార్ తిప్పుతున్న వీడియో వాట్సాప్‌లో వైరల్ కావడం గమనార్హం.
సుమారు 20 రోజుల క్రితం జిల్లాలోని ఓ ఎమ్మెల్యే అనుచరుడు బెల్లంపల్లిలో అర్ధరాత్రి నడిరోడ్డుపై తల్వార్‌తో కేక్ కట్ చేసిన వీడియో, ఫొటోలు వాట్సాప్‌లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. జిల్లాలో అధికార పార్టీ నాయకులకు రాజకీయ నాయకుల అండదండలు, అధికారబలం, పోలీసుల అండదండలు మెండుగా ఉన్నట్లు సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. తల్వార్లతో కేక్ కట్ చేసిన తాలూకూ ఫొటోలు వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో జన్మదిన వేడుకల్లో తల్వార్లతో కేక్ కట్ చేయడమేంటని జిల్లా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి వారితోనే యువతలో విషసంస్కృతి సంతరించుకుంటుందని, ఇలాంటి ఘటనలపై పోలీస్ యంత్రాంగం దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
గడప రాకేష్ అనుచర వర్గంపై కేసు
జన్మదిన వేడుకల్లో తల్వార్ తిప్పిన వీడియో వాట్సాప్‌లో వైరల్ కావడంతో రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ స్పందించి, మంచిర్యాల పోలీస్ స్టేషన్ సందర్శించారు. జన్మదిన వేడుకలపై ఆరాతీశారు. రాకేష్‌తో పాటు ఆయనకు సంబంధించిన అనుచర వర్గాన్ని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వార్నింగ్‌తో పాటు 9మందిపై కేసు నమోదు చేసినట్లు స్థానిక సీఐ ముత్తి లింగయ్య తెలిపారు.
చట్టవ్యతిరేక పనులు సహించం
చట్ట వ్యతిరేకమైన పనులకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. మంచిర్యాలలో గడప రాకేష్ అనే వ్యక్తి నిబంధనలకు వ్యతిరేకంగా బర్త్‌డే పార్టీ అర్ధరాత్రి బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించడం, పైగా ఆయన అనుచర వర్గం తల్వార్‌తో హంగామా సృష్టించడం నేరంగా పరిగణించి కేసు నమోదు చేశాం. – సత్యనారాయణ, సీపీ
Comments
Please login to add a commentAdd a comment