సాక్షి, హైదరాబాద్: అథ్లెటిక్స్‌లో మరింతగా రాణించేందుకు పరుగుల రాణి కీర్తనకు ప్రభుత్వం తరఫున ప్రోత్సహం అందిస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. కీర్తనకు ప్రోత్సాహం లభిస్తే, పీటీ ఉషలా దేశానికి కీర్తిని తెచ్చిపేట్టే కీర్తన అవుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. పాలకుర్తి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న కీర్తన.. కేరళలో జరిగిన సౌత్ ఇండియా జూనియర్ అథ్లెటిక్స్‌లో అండర్–16 విభాగంలో 2 వేల మీటర్ల పరుగు పందెంలో స్వర్ణ పతకం సాధించింది. గూడూరుకు చెందిన చెరిపెల్లి నాగమణి– కుమార స్వామిల కుమార్తె కీర్తనను ఈ సందర్భంగా మంగళవారం మంత్రి తమ క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా సత్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, అసమాన ప్రతిభను కనబరుస్తూ అండర్–16 జూనియర్ అథ్లెటిక్ విభాగంలో స్వర్ణ పతకం గెలవడం సంతోషించదగ్గ విషయమన్నారు. గ్రామీణ నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన కీర్తన ప్రతిభకు గురుకుల పాఠశాల పదను పెట్టిందని పేర్కొన్నారు. ప్రభుత్వం స్థాపించిన గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో విద్యార్థులకు మెరుగైన ఆహారం, వసతి, చదువు, క్రీడా ప్రోత్సాహం లభిస్తోందని తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో గూడూరు సర్పంచ్ మంద కుమరయ్య, మాజీ సర్పంచ్ పుల్లయ్య, పూజరి రమాకాంత్ తదితరులున్నారు.
ప్రశంసలతోపాటు పైసలివ్వాలి: ఎర్రబెల్లి
సాక్షి, హైదరాబాద్: జలమంత్రిత్వశాఖ పనితీరుపై రాజ్యసభలో మంగళవారం జరిగిన చర్చలో తెలంగాణను కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రశంసించడంపై రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పందించారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వంద శాతం ఆవాసాలకు, నల్లాల ద్వారా ఇంటింటికీ, అన్ని పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలకు మంచినీరు సరఫరా చేస్తున్నందుకు రాష్ట్రాన్ని గతంలోనూ కేంద్రం అభినందించిందని పేర్కొన్నారు. ఫ్లోరైడ్ రహిత, శుద్ధి చేసిన నీటిని అందిస్తున్నందుకు కేంద్రం మెచ్చుకుందని తెలిపారు. అయితే రాష్ట్రానికి కేవలం ప్రశంసలే కాకుండా నీతి ఆయోగ్ సిఫార్సు చేసిన విధంగా నిధులు కూడా ఇవ్వాలని కేంద్ర మంత్రికి ఎర్రబెల్లి విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment