సనత్‌నగర్: దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కె. తారక రామారావు తెలిపారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో గురువారం నిర్వహించిన అంబేడ్కర్ జయంతి ఉత్సవాలకు మంత్రులు కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్‌లతో కలసి మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగం వల్లే తెలంగాణ వచ్చిందన్నారు.
ఆయన ఆశయాల అమల్లో భాగంగానే దళితబంధు వంటి పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని చెప్పారు. దళితబంధు పథకంతో దళితుల జీవితాల్లో వెలుగులు నిండాయని, పారిశ్రామికవేత్తలుగా వారు ఎదుగుతున్నారన్నారు. కేసీఆర్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే ఎమ్మెల్యేగా ఆయన నియోజకవర్గమైన సిద్దిపేటలో దళిత చైతన్య జ్యోతి పేరిట దళితబంధు తరహా పథకాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు. అలాగే నూతన సచివాలయ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టారని తెలిపారు.
దళిత, గిరిజన యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకే టీ–ప్రైడ్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని కేటీఆర్ వివరించారు. కాగా, ఈ వేదికపై టీ–ప్రైడ్ కింద 8 వేల మంది ఔత్సాహికులకు రూ. 523 కోట్లను కేటీఆర్ మంజూరు చేశారు. అలాగే టీ–ప్రైడ్ కింద సబ్సిడీ పొంది విజయవంతంగా దూసుకెళ్తున్న 17 మందికి బెస్ట్ టీ–ప్రైడ్ అవార్డులను ప్రదానం చేశారు. దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (డిక్కీ)కి 2 ఎకరాల స్థలం కేటాయించనున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించడంతో హర్షధ్వానాలతో సభాప్రాంగణం మార్మోగింది.
ఈ కార్యక్రమంలో ఎంపీ వెంకటేశ్ నేత, ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, రేఖానాయక్, టీఎస్‌ఐఐసీ చైర్మన్ బాలమల్లు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ రామచంద్రనాయక్, ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, ‘డిక్కీ’ జాతీయ అధ్యక్షుడు నర్రా రవికుమార్, రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ, ఇండస్ట్రీస్ డైరెక్టర్ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దళిత, గిరిజనులకు స్వర్ణయుగం: సత్యవతి
దళిత, గిరిజనులు కూడా అందరితో సమానంగా వృద్ధిలోకి రావాలని రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకుంటోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. దళిత, గిరిజనులకు ఇది స్వర్ణయుగం లాంటిదన్నారు.
తెలంగాణ రాక ముందు 263 గురుకులాలు ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య వెయ్యికి చేరిందన్నారు. నూతన ఆవిష్కరణలతో తెలంగాణ దేశానికే దిక్సూచిగా మారిందని, విజన్ ఉన్న సీఎంతోనే ఇది సాధ్యమవుతోందని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. టీ–ప్రైడ్ ద్వారా ఎస్సీ, ఎస్టీలు యువ పారిశ్రామికవేత్తలుగా వృద్ధిలోకి వస్తున్నారన్నారు.
కేసీఆర్ వల్లే విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి...
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను విరమించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ బలంగా డిమాండ్ చేయడం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ జారీ చేసిన ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్‌లో పాల్గొంటామని కేసీఆర్ ప్రకటించడం వల్లే కేంద్రం దిగొచ్చి తాత్కాలికంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను విరమించుకున్నట్లు ప్రకటించిందని మంత్రి కేటీఆర్ వివరించారు.
అదానీకి బైలడిల్లా గనుల కేటాయింపు కుట్రను బీఆర్‌ఎస్ బయట పెట్టిన నేపథ్యంలో ప్రజల దృష్టి మళ్లించేందుకే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించడం లేదంటూ కేంద్రం నామమాత్ర ప్రకటన చేసిందని కేటీఆర్ అంతకుముందు ఓ ప్రకటనలో విమర్శించారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు వెంటనే క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలని డిమాండ్ చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సంపూర్ణంగా ఆగేంత వరకు, బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటయ్యే వరకు కేంద్ర ప్రభుత్వంపై తమ ఒత్తిడి కొనసాగుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment