
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి గిరిజన ఆవాసానికి త్రీఫేజ్ విద్యుత్ అందిస్తామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. ఈ ఏడాది చివరినాటికి రాష్ట్రంలో కరెంటు లేని గిరిజన ఆవాసం ఉండొద్దని, వ్యవసాయ క్షేత్రాలకు, పరిశ్రమలకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. గిరిజన ఆవాసాల విద్యుదీకరణ, గిరిజన వ్యవసాయం, పరిశ్రమలకు త్రీఫేజ్ విద్యుత్ కల్పన, గిరివి కాసం అమలుపై శని వారం మాసబ్‌ట్యాంక్ లోని దామోదర సంజీవ య్య సంక్షేమ భవన్‌లో అటవీ, విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో విద్యుత్ సదుపాయం లేని గిరిజన ఆవాసాలు, త్రీఫేజ్ విద్యుత్ కల్పించడంపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేసి 3,467 ఆవాసాలను గుర్తించామని, వీటి విద్యుదీకరణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గత రెండు బడ్జెట్లలో రూ.221.01 కోట్లు కేటాయిం చారన్నారు. ఇందులో 2,795 గ్రామాలకు త్రీఫేజ్ విద్యుదీకరణ పూర్తయిందని, మిగిలిన 19 శాతం ఆవాసాలకు విద్యుదీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. విద్యుత్ లైన్లు వేయలేని గిరిజన ఆవాసాలకు సోలార్ విద్యుత్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, పీసీసీఎఫ్ ఆర్.ఎం.దోబ్రియల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment