సాక్షి,హైదరాబాద్/ వెంగళరావునగర్: అంగన్‌వాడీటీచర్లు, హెల్పర్లు తక్షణమే సమ్మె విరమించి విధుల్లో చేరాలని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సమ్మె విరమించి చర్చలతో వాటిని పరిష్కరించుకోవాలని సూచించారు. అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు సంబంధించిన పలు అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందని, జీఓలు జారీ అయ్యాక సమ్మెకు దిగడం సరికాదని ఆమె వ్యాఖ్యానించారు.
శుక్రవారం అమీర్‌పేటలోని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ డైరెక్టరేట్‌లో మంత్రి సత్యవతిరాథోడ్ మీడియాతో మాట్లాడారు. అంగన్‌వాడీల్లో నమోదయ్యే గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ఎక్కువమంది బలహీనవర్గాలకు చెందినవారే ఉన్నారని, విధులు బహిష్కరించి సమ్మె చేయడంతో వారంతా ఇబ్బంది పడే అవకాశం ఉందని, వారి సేవలను తక్షణమే కొనసాగించాలన్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగా రాజకీయలబ్ధి కోసమే అంగన్‌వాడీలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు.
అంగన్‌వాడీల క్రమబద్ధీకరణ అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదని, దానిని రాష్ట్రప్రభుత్వం నెరవేర్చడం సాధ్యం కాదని చెప్పారు. అంగన్‌వాడీల తరపున డిమాండ్లు కేంద్రానికి నివేదిస్తామని, అవసరమైతే స్వయంగా వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి విన్నవిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి భారతి హోలికేరి, జేడీ లక్ష్మీదేవీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment