
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి మరిన్ని సఖి(ఒన్ స్టాప్ సెంటర్) కేంద్రాలను మంజూరు చేయనున్నట్లు కేంద్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ వెల్లడించారు. లింగ ఆధారిత హింసను ఎదుర్కొంటున్న మహిళలకు ఈ కేంద్రాలు అండగా నిలుస్తాయన్నారు. ‘ఎనిమిదేళ్లలో కేంద్రం సాధించిన విజయాలు– మహిళలు, పిల్లలపై ప్రభావం’అనే అంశంపై సోమవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో జరిగిన ప్రాంతీయ సదస్సులో మంత్రి మాట్లాడారు.
తెలంగాణకు 36 సఖి కేంద్రాలను మంజూరు చేయగా, ఇప్పటికే 33 కేంద్రాలు సేవలందిస్తున్నాయని తెలిపారు. హింసకు గురైన మహిళలు, బాలికలకు సఖి పథకం ద్వారా వైద్య, న్యాయ సహాయం, మానసిక సలహాలు, తాత్కాలిక ఆశ్రయం కల్పించనున్నట్లు వెల్లడించారు. కోవిడ్ మహమ్మారి కారణంగా అనాథలైన దాదాపు 4 వేల మంది పిల్లలకు పీఎం కేర్స్ పథకం కింద ఆర్థికసాయం అందించినట్లు వివరించారు. మంత్రి వివిధ పథకాల కింద లబ్ధి పొందినవారి జీవితగాధలను విన్నారు. పలువురు లబ్ధిదారులతో మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment