
మాట్లాడుతున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
సుందరయ్యవిజ్ఞానకేంద్రం (హైదరాబాద్): యాదవ జాతికి మహాభారతమంత చరిత్ర ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ యాదవులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని గుర్తు చేశారు. ఆదివారం సుందరయ్యవిజ్ఞానకేంద్రంలో ఆల్ ఇండియా యాదవ మహాసభ ఆధ్వర్యంలో రాష్ట్ర యాదవ అడ్వొకేట్స్ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ లాయర్ల సంక్షేమానికి ప్రభుత్వం వంద కోట్ల నిధిని ఇచ్చిందన్నారు.
యాదవులను ఆర్థికంగా ప్రోత్స హించడానికి ప్రభుత్వం గొర్రెల పథకాన్ని తీసుకువచ్చిందన్నారు. తొలుత రూ.5 వేల కోట్లతో ప్రారంభిస్తే అది ఇప్పుడు రూ.11 వేల కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని కులాల కంటే ఎక్కువ భూమిని కలిగిన వారు యాదవులేనని అందుకే యాదవులంతా రైతుబంధు, రైతుబీమాను పొందుతున్నారని అన్నారు. జాతి గౌరవాన్ని పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ విద్యావంతులుగా కావాలన్నారు.
రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో యాదవులు అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందని చెప్పారు. ఆల్ ఇండియా యాదవ మహాసభ లీగల్ సెల్ అధ్యక్షుడు చలకాని వెంకట్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఓయూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్, సుప్రీంకోర్టు న్యాయవాది రణభీర్ యాదవ్, ఎమ్మెల్యే జయపాల్ యాదవ్, మాజీ మంత్రి కృష్ణా యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment