
మాట్లాడుతున్న తలసాని. చిత్రంలో కొప్పుల, మహమూద్ అలీ
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ లౌకికవాద రాష్ట్రంగా విరాజిల్లుతోందని మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రంజాన్ మాసంలో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా, ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకొనేలా ప్రతి ఒక్కరు సహకరించాలని సూచించారు. రంజాన్ మాసం సమీపిస్తున్న తరుణంలో... మంత్రులు, ఎమ్మెల్యేలు, పలు ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే నెల 3నుంచి మొదలయ్యే రంజాన్ మాసం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని, మసీదులు, ఈద్గాలకు మరమ్మతులు చేసి, అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఉపవాస దీక్షల్లో ఉండే వారికి అవసరమైన నిత్యావసరాలు అందుబాటులో ఉండేలా చూడాలని, రాత్రి వేళల్లో హోటళ్లు, దుకాణాలను మూసేయించొద్దని సూచించారు.