
మంత్రి కొప్పుల ఈశ్వర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధుతో రాష్ట్రంలోని 17 లక్షల కుటుంబాల్లో వెలుగులు నిండుతాయని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దళితబంధు లాంటి బృహత్తరమైన, విప్లవాత్మకమైన పథకం ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో తప్ప దేశంలో ఎక్కడా లేదన్నారు. ఈ పథకం అమలు విషయంలో ఎలాంటి అనుమానాలకు తావు లేదని, ఎవరూ కూడా అయోమయానికి, గందరగోళానికి గురి కావొద్దని సూచించారు.
దళితబంధును ముఖ్యమంత్రి కేసీఆర్ యజ్ఞంలా దృఢ సంకల్పంతో అమలు చేస్తున్నారన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 100 యూనిట్లకు సంబంధించి మొత్తం 11 వేల 500 పూర్తి కాగా, మిగిలిన 335 యూనిట్ల గ్రౌండింగ్ నాలుగైదు రోజుల్లో పూర్తవుతుందని, అసెంబ్లీ నియోజకవర్గానికి 1,500 యూనిట్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందని కొప్పుల తెలిపారు. వచ్చే ఎనిమిదేళ్లలో మొత్తం 17 లక్షల ఎస్సీ కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని, వారి జీవితాల్లో వెలుగులు ప్రసరిస్తాయని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment