విమానాశ్రయంలో ప్రయాణికులకు మొక్కలు పంపిణీ చేస్తున్న ఎంపీ సంతోష్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: ప్రకృతిలో పచ్చదనం ప్రాముఖ్యత, ఆవశ్యకత తెలిసిన వ్యక్తి మన సీఎం కేసీఆర్ అని, ఆరేళ్ల క్రితమే ఆయన రాష్ట్రంలో హరిత హారానికి నాంది పలికారని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ పేర్కొన్నారు. హరిత తెలంగాణగా మార్చాలనుకుంటున్న సీఎం కేసీఆర్ సంకల్పానికి అనుగుణంగా ఆయన పుట్టినరోజున కోటి వృక్షార్చన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా మంగళవారం శంషాబాద్ విమానాశ్రయంలో ఎంపీ సంతోష్‌కుమార్ ప్రయాణికులకు ఔషధ మొక్కలు పంపిణీ చేశారు. కొచ్చి నుంచి ఎయిర్‌పోర్టుకు వచ్చిన శ్రీనివాస్, సుమలత దంపతులకు ఆయన మొదటి మొక్కను అందజేయగా.. పంజాబ్, ముంబై తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి మొక్కలను అందజేసి వాటిని బుధవారం నాటాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ సంతోష్ మాట్లాడు తూ.. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా నిర్వహిస్తున్న హరితహారం కూడా మంచి సత్ఫలితాలు ఇస్తున్నట్లు తెలిపారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మూడేళ్లుగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఎన్నో మొక్కలు నాటినట్లు గెయిల్ (జీహెచ్‌ఐఏఎల్) సీఈఓ ప్రదీప్‌ఫణికర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎంకే సింగ్, ఏవియేషన్ డైరెక్టర్ భరత్‌రెడ్డి, గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణకు దేవుడిచ్చిన వరం కేసీఆర్: హోంశాఖ మంత్రి మహమూద్ అలీ
అభివృద్ధి, సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలోని ప్రతీ కుటుంబంలో వెలుగులు నింపుతున్న సీఎం కేసీఆర్‌ను దేవుడు బహు మతిగా ఇచ్చారని హోం మంత్రి మహమూద్ అలీ కొనియాడారు. అన్ని వర్గాల వారికి లబ్ధి కలిగేలా పథకాలు అమలు చేయడంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని వ్యాఖ్యానించారు. మంగళవారం కేసీఆర్ సేవామండలి ఆధ్వర్యంలో తెలంగాణ భవన్‌లో జరిగిన సీఎం జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో నేరాల తగ్గుదలకు హైదరాబాద్‌లో నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ త్వరలో అందుబాటులోకి రానుందని తెలిపారు. కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని చేపట్టనున్న కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
మహోన్నత మేధావి కేసీఆర్: నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి
మాటను ఆయుధంగా చేసి సమాజాన్ని మలుపు తిప్పి అహింసతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహోన్నత మేధావి సీఎం కేసీఆర్ అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్షను సాధించి, రాష్ట్రాన్ని అగ్ర భాగాన నిలిపే ప్రయత్నంలో కేసీఆర్ ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. ప్రజల ఆశీస్సులతో కేసీఆర్ మరింత విజయవంతం కావాలని కోరుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment