హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచిన క్షిపణి శాస్త్రవేత్త
రేపు మధ్యాహ్నం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త, ‘అగ్ని’ క్షిపణి మిషన్ తొలి ప్రోగ్రామ్ డైరెక్టర్ రామ్ నరైన్ అగర్వాల్ (84) కన్నుమూశారు. వయో సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి హైదరాబాద్‌లోని సంతోష్‌నగర్‌లో ఉన్న స్వగృహంలో మృతి చెందారు. రాజస్తాన్‌లోని జైపూర్‌లో జన్మించిన రామ్ నరైన్.. 1983లో ప్రారంభమైన ‘అగ్ని క్షిపణి’ ప్రోగ్రామ్‌లో చేరారు.
ఆ మిషన్‌కు తొలి ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా పనిచేసి.. అగ్ని క్షిపణుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఆయనను ఫాదర్ ఆఫ్ అగ్ని మిస్సైల్స్‌గా పిలుస్తారు. రామ్ నరైన్ చేసిన సేవలకు 1990లో పద్మశ్రీ, 2000లో పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. శనివారం మధ్యాహ్నం సంతోష్‌నగర్‌లోని నివాసం నుంచి రామ్ నరైన్ అంతిమయాత్ర ప్రారంభం అవుతుందని.. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలను నిర్వహించనున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు.
అగ్ని క్షిపణులకు ఆద్యుడు: డీఆర్డీఏ మాజీ డైరెక్టర్ సతీశ్‌రెడ్డి
అగ్ని క్షిపణుల అభివృద్ధి, ప్రయోగాలలో రామ్ నరైన్ అగర్వాల్ కీలకపాత్ర పోషించారని డీఆర్డీఏ మాజీ డైరెక్టర్ సతీశ్‌రెడ్డి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల క్షిపణి ప్రయోగాల లాంచ్ పాడ్స్ రూపకల్పనలోనూ కీలకంగా పనిచేశారని చెప్పారు. రామ్ కృషి వల్లే ఈరోజు భారతదేశం రక్షణరంగంలో చాలా ముందుందన్నారు. రామ్ నరైన్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment