నందుతో రఘురామ కృష్ణరాజు (ఫైల్)
సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన హరియాణాలోని ఫరీదాబాద్‌కు చెందిన రామచంద్రభారతి, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి నందుకుమార్‌తో.. ఆంధ్రప్రదేశ్‌లోని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుకు సత్సంబంధాలు ఉన్నట్టుగా సిట్ గుర్తించినట్లు తెలిసింది. నిందితుల సెల్‌ఫోన్లలో రఘురామ కృష్ణరాజు దిగిన ఫొటోలు, ఇతర కీలక వివరాలు బయటపడినట్లు సమాచారం. దీంతో ఎంపీని విచారించాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు 41–ఏ సీఆర్‌పీసీ కింద గురువారం నోటీసులు జారీ చేశారు. ఈ నెల 29న ఉదయం 10:30 గంటలకు బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోని సిట్ కార్యాలయంలో విచారణకు రావాలని తెలిపారు.
సహేతుక కారణం లేకుండా గైర్హాజరైతే 41–ఏ (3), (4) సీఆర్‌పీసీ కింద అరెస్టు చేస్తామని ఎంపీకి పంపిన ఈ–మెయిల్‌లో విచారణాధికారి, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్ స్పష్టం చేశారు. మరోవైపు ఎంపీకి ప్రత్యక్షంగా నోటీసులు అందించేందుకు సిట్ అధికారులు గురువారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని రఘురామ నివాసానికి వెళ్లగా.. ఆయన ఇంట్లో లేరని, ఢిల్లీకి వెళ్లారని సిబ్బంది తెలిపినట్లు సమాచారం. దీంతో ఢిల్లీ వెళ్లిన సిట్ బృందం ఆయన నివాసంలో నోటీ సులు అందజేసింది. ఎమ్మెల్యేల కొనుగోళ్లకు సంబంధించి రఘురామ కృష్ణరాజుకు ముందే సమాచారం ఉందేమోనని, ఎమ్మెల్యేలకు ఆఫర్ చేసిన నగదు సమకూర్చడంలో ఎంపీ పాత్ర ఉందేమోనని సిట్ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయనను విచారించాలని నిర్ణయించింది.
ఏడుకు చేరిన నిందితుల సంఖ్య
‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో తాజాగా మరో నలుగురిని సిట్ అధికారులు నిందితులుగా చేర్చారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతో‹Ù, కర్ణాటక బీడీజేఎస్ చీఫ్ తుషార్ వెల్లపల్లి, కేరళ వైద్యుడు కొట్టిలిల్ నారాయణ జగ్గు అలియాస్ జగ్గు స్వామి, కరీంనగర్‌కు చెందిన న్యాయవాది భూసారపు శ్రీనివాస్‌లను నిందితులుగా పేర్కొన్నారు. ఈ మేరకు నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో మెమో ఫైల్ చేశారు. ఈ కేసును పర్యవేక్షిస్తున్న హైకోర్టు సింగిల్ జడ్జికి కూడా ఈ సమాచారం అందజేసినట్లు తెలిసింది. దీంతో ఈ కేసులో మొత్తం నిందితులు సంఖ్య ఏడుకు చేరుకుంది. ఇప్పటికే నిందితులుగా ఉన్న రామచంద్రభారతి, నందుకుమార్, సింహయాజీలు అరెస్టయి, చంచల్‌గూడ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. తాజా నలుగురు నిందితులకు కూడా 120–బీ, 171–బీ రెడ్ విత్ 171–ఈ, 506 రెడ్ విత్ 34 ఐపీసీ, అవినీతి నిరోధక చట్టం–1988 సెక్షన్–8 కేసులు వర్తిస్తాయని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
మరో ఐదుగురికి మళ్లీ నోటీసులు..
ఈ కేసు వెలుగులోకి వచి్చనప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన జగ్గు స్వామి సోదరుడు మణిలాల్, అతని ముగ్గురు పర్సనల్ అసిస్టెంట్లు శరత్, ప్రశాంత్, విమల్ అలాగే జగ్గు పనిచేస్తున్న అమృత ఆసుపత్రి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీఎస్‌ఓ) ప్రతాపన్‌లను విచారించాలని సిట్ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆ నలుగురు సాక్షులకు సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేశారు. అయితే వారు విచారణకు గైర్హాజరు కావటంతో తాజాగా 41–ఏ సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేశారు. ఈసారి కూడా హాజరుకాకపోతే 41–ఏ (3), (4) సీఆర్‌పీసీ కింద అరెస్టు చేస్తామని హెచ్చరించారు.
‘అమృత’తో జగ్గుస్వామి సంబంధాలు నిర్ధారణ!
జగ్గు స్వామిని విచారించేందుకు కేరళ వెళ్లిన సిట్ సభ్యురాలు, నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరి బృందాన్ని .. అమృత ఆసుపత్రితో జగ్గుకు ఎలాంటి సంబంధాలు లేవంటూ ఆసుపత్రి సీఎస్‌ఓ తప్పుదోవ పట్టించినట్లు తెలిసింది. దీంతో సిట్ బృందం స్థానిక పోలీసుల సహకారంతో జగ్గు ఇళ్లు, ఆఫీసులపై సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరిశీలించగా.. అమృత వైద్య విజ్ఞానసంస్థ (ఎయిమ్స్)లో పరిపాలన విభాగంలో డిప్యూటీ మేనేజర్‌గా జగ్గు స్వామి పనిచేస్తున్నారని తేలింది. ఆసుపత్రి తరఫున బ్యాంక్ చెక్‌లను జారీ చేసే అధికారం కూడా ఆయనకు ఉందని గుర్తించినట్టు తెలిసింది.
ఇదీ చదవండి: కక్షతోనే ఆంక్షలు.. కేంద్రం తీరుతో రాష్ట్రానికి రూ. 40,000 కోట్ల గండి
Comments
Please login to add a commentAdd a comment