సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మహేష్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌కు చెందిన చెస్ట్ ఖాతా నుంచి రూ.12.93 కోట్లు కాజేసిన కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. సైబర్ నేరగాళ్లు ఈ వ్యవహారాన్ని కీలాగర్స్ (ఇదో రహస్య సాఫ్ట్‌వేర్) సాయంతో చేశారని, హైదరా బాద్ కేంద్రంగా ప్రాక్సీ సర్వర్‌లో కథ నడిపారని గుర్తించారు. సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు అందించిన యువకుడు, యువతిని ఢిల్లీలో అరెస్టు చేశారు. వీరిని గురువారం నగరానికి తీసుకొచ్చి కోర్టులో హాజరుపరచనున్నారు. సైబర్ సెక్యూరిటీ పక్కాగా లేని మహేష్ బ్యాంక్‌ను కొల్లగొట్టడానికి సైబర్ కేటుగాళ్లు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించారు.
ఆయా ప్రాంతాల్లో ఉన్న దళారుల సాయంతో 128 ఖాతాలు ఎంపిక చేసుకున్నారు. ఈ ఖాతాదారులకు 10–15 శాతం కమీషన్ ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. సూత్రధారులకు, వీరికి మధ్యలో నాలుగు అంచెల్లో అనేక మంది సహకరించారు. వీరిలో నైజీరియన్లతోపాటు వివిధ మెట్రో నగరాలు, ఈశాన్య రాష్ట్రాలకు చెం దిన వారున్నారు. నగదు బదిలీ చేయడానికి ఖాతాలు సిద్ధమైన తర్వాత అసలు పని ప్రారం భించిన సైబర్ నేరగాళ్లు హైద రాబాద్‌లో ఉన్న సూత్రధా రులకు సమాచారం ఇచ్చారు.
ఈ–మెయిల్ రూపంలో కీలాగర్స్
బ్యాంక్ సర్వర్‌ను హ్యాకింగ్ చేసేందుకు ముగ్గురు సూత్రధారులు హైదరాబాద్ శివార్లలో అడ్డా ఏర్పాటు చేసుకున్నారు. ప్రాక్సీ సర్వర్లు వాడుతూ నవంబర్ నుంచి కీలాగర్స్ ప్రయోగించారు. ఇంటర్‌నెట్‌తోపాటు డార్క్ నెట్‌లో విరివిగా లభిస్తున్న ఈ నిగూఢ సాఫ్ట్‌వేర్‌ను సైబర్ నేరగాళ్లు బ్యాంకు అధికారిక ఈ–మెయిల్‌కు జోక్స్, బొమ్మలు, ఆఫర్లు లేదా ఆర్బీఐ పేరుతో పంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు బ్యాంక్‌నకు పదుల సంఖ్యలో కీలాగర్స్‌తో కూడిన మెయిల్స్ పంపారు. దీన్ని అవతలి వ్యక్తి క్లిక్ చేయగానే అతడికి తెలియకుండానే వారి కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ అయింది. దీంతో వారి పని సులువైంది.
ఈ సాఫ్ట్‌వేర్ ఉన్న కంప్యూటర్‌లో కీ బోర్డులో ఒక్క బటన్ నొక్కినా ఆ వివరాలు పూర్తిగా సైబర్ నేరగాడికి ఈ–మెయిల్ రూపంలో చేరిపోతాయి. ఇలానే మహేష్ బ్యాంక్ సూపర్ అడ్మిన్ యూజర్ నేమ్, పాస్‌వర్డ్ సైబర్ నేరగాళ్లకు చేరాయి. వీటి ద్వారానే బ్యాంక్ నెట్‌వర్క్ నుంచి సర్వర్‌లోకి చొరబడి దఫదఫాలుగా రూ.12.93 కోట్లను నాలుగు ఖాతాల్లోకి బదిలీ చేశారు. వాటి నుంచి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న మరో 128 ఖాతాల్లోకి మళ్లించారు. ప్రస్తుతం ముగ్గురు కీలక సైబర్ నేరగాళ్లతోపాటు బ్యాంకు ఖాతాలు అందించిన, దళారులుగా వ్యవహరించిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
నీలం రంగులో లింకులు!
‘సాధారణంగా మెయిల్స్ ద్వారా వచ్చే కీలాగర్స్ లింకులు నీలం రంగులో ఉంటాయి. అపరిచిత ఈ–మెయిల్స్‌లో ఇలాంటి లింక్స్ ఉంటే వాటి జోలికి పోకపోవడం ఉత్తమం. ఆ లింక్‌ను కాపీ చేసి అడ్రస్ బార్‌లో పేస్ట్ చేసి ఎంటర్ చేస్తే అది అసలుదా? నకిలీదా తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీనిపై బ్యాంకు అధికారులకు అవగాహన లేకపోవడమే సైబర్ నేరగాళ్లకు కలిసి వచ్చింది’ అని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment