సాక్షి, హైదరాబాద్: టెండర్లలో తక్కువ మొత్తం కోట్ చేసిన కంపెనీకి ఎలక్ట్రిక్ బస్సుల సరఫరా కాంట్రాక్టును అప్పగించే విషయంలో నెలకొన్న వివాదం సకాలంలో బస్సులు రోడ్డెక్కకుండా చేస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈపాటికల్లా 300 ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రావాల్సి ఉంది. కానీ విషయం కోర్టుకు చేరటంతో బస్సులు రావటానికి మరింత సమయం పట్టే పరిస్థితి కనిపిస్తోంది.
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను పెంచే ఉద్దేశంతో తాజాగా ఫేమ్ (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఇన్ ఇండియా)–2 పథకం కింద 10 వేల బస్సులను రాయితీపై సరఫరా చేయాలని నిర్ణయించింది. తెలంగాణకు 300 బస్సులు మంజూరయ్యాయి. ఇటీవల కేంద్ర భారీ పరిశ్రమల శాఖ టెండర్లు పిలిచి ఖరారు చేసింది. ఇందులో ఎల్–1(తక్కువ మొత్తం కోట్ చేసిన కంపెనీ)గా వచ్చిన కంపెనీకి ఎక్కువ బస్సులు సరఫరా ఉన్న రాష్ట్రాల బాధ్యత అప్పగించింది. ఎల్–2గా ఉన్న కంపెనీ జాబితాలో తెలంగాణ ఉంది. కాగా ఎల్–2గా ఉన్న కంపెనీతో ఒప్పందం చేసుకునే సమయంలో వివాదం తలెత్తింది.
ఆ కంపెనీ కోర్టుకు వెళ్లటంతో..
తొలుత టెక్నికల్ బిడ్ తెరిచినప్పుడు ఓ కంపెనీ బిడ్‌కు అర్హమైంది కాదని భావించిన అధికారులు దాన్ని తిరస్కరించారు. నిజానికి ఆ కంపెనీ కోట్ చేసిన మొత్తం ప్రకారం ఎల్–2 స్థానంలో అదే ఉంటుంది. మూడో స్థానంలో ఉన్న కంపెనీని ఎల్–2గా నిర్ధారించారు. దీనికి తెలంగాణకు బస్సుల సరఫరా బాధ్యత అప్పగించాలని నిర్ణయించారు. ఇంతలో అన ర్హమైందిగా అధికారులు తేల్చిన కంపెనీ కోర్టును ఆశ్రయించిందని, తీర్పు ఆ కంపెనీకి అనుకూలంగా వచ్చిందని అధికారులు చెబుతున్నారు.
దీంతో మూడో స్థానంలో ఉన్న కంపెనీని ఎల్–2గా నిర్ధారిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తొలుత ఎల్–2గా నిర్ధారించిన కంపెనీకే బస్సుల సరఫరా బాధ్యత అప్పగించాల్సి ఉంది. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు ఆ కంపెనీతో చర్చించే సమయంలో, కేంద్ర ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకుని దీనిపై ఎలాంటి నిర్ణయానికి రావద్దని, తాము కోర్టు తీర్పును సవాల్ చేయబోతున్నామని చెప్పినట్టు సమాచారం.
త్వరలో 500 అద్దె ఎలక్ట్రిక్ బస్సులు..
ఫేమ్–2 పథకం బస్సుల పరిస్థితి ఇలావుండగా, గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (జీసీసీ) పద్ధతిలో 500 ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకోబోతున్నారు. దీనికి సంబంధించి పిలిచిన టెండర్లలో రెండు బడా కంపెనీలు పాల్గొన్నాయి. టెక్నికల్ బిడ్ ఓకే అయింది. ఫైనాన్షియల్ బిడ్‌లో తక్కువ మొత్తం కోట్ చేసిన కంపెనీకి ఆర్డర్ ఇవ్వనున్నారు. మరో నెలరోజుల్లో ఈ బస్సుల రాక ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment