త్వరలోనే ఐక్యకార్యాచరణ ప్రకటన ..
రేపటి నుంచి ప్రజాక్షేత్రంలో
10 లక్షల నిరుద్యోగ యువతతో నిరుద్యోగ మార్చ్
నిరుద్యోగుల సత్తా చూపిస్తా.. ప్రలోభాలకు లొంగలేదు..
గాంధీ ప్రాంగణంలో కొబ్బరినీళ్లు తాగి దీక్ష విరమించిన మోతీలాల్‌నాయక్
గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్) : ‘ఆరోగ్యం సహకరించడం లేదు.. శరీరంలోని అన్నీ అవయవాలు కొంతమేర శక్తిని కోల్పోయాయి. అందుకే నిరాహార దీక్ష విరమిస్తున్నా. ప్రలోభాలకు లొంగలేదు..తొమ్మిది రోజులు ఆహారం తీసుకోకుండా నిరుద్యోగుల కోసం పోరాటం చేశాను. ఇకపై ఆహారం తీసుకుంటూ ఉద్యమిస్తా.. త్వరలోనే ఐక్య కార్యాచరణ ప్రకటిస్తా’ అని నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతీలాల్‌నాయక్ స్పష్టం చేశారు. తొమ్మిది రోజులుగా ఆమరణదీక్ష చేస్తున్న ఆయన మంగళవారం ఉదయం గాంధీ ప్రాంగణంలో కొబ్బరినీళ్లు తాగి దీక్షను విరమిస్తున్నట్టు ప్రకటించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. పలుపార్టీల నేతలు, సంఘ నాయకులు కలిసి ఉద్యమం చేద్దామనే పిలుపు మేరకు దీక్ష విరమించానని, రేపటి నుంచి ప్రజాక్షేత్రంలో ఉంటానని చెప్పారు. తన దీక్షకు సంఘీభావం ప్రకటించిన అందరినీ కలిసి మద్దతు కూడగట్టి, నిరుద్యోగుల సత్తా చూపిస్తామని, ప్రభుత్వ మెడలు వంచి న్యాయమైన డిమాండ్లు సాధించుకుంటామన్నారు. తొమ్మిది రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని, ఇకపై పాముకాటు ఎలా ఉంటుందో చూపిస్తానని సవాల్ విసిరారు.
మరణిస్తే ఉద్యమం చేయలేనని, బతికి డిమాండ్లు సాధించుకుంటామని, రోజుకో తీరుతో విభిన్న తరహాల్లో ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు విశ్రమించనని శపథం చేశారు. తెలంగాణలోని పలు రాజకీ యపార్టీలు, సంఘాలు, నిరుద్యోగులు తన వెనుక ఉన్నారని, త్వరలోనే 10 లక్షల మందితో నిరుద్యోగ మార్చ్ నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. మంత్రి సీతక్క ఫోన్ చేసి మాట్లాడింది వాస్తమేనన్నారు. నగరంలోని అశోక్‌నగర్ సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి తన కార్యాచరణ ప్రారంభమవుతుందని చెప్పారు. న్యాయమైన డిమాండ్లు సాధించేవరకు తన పోరాటం ఆగదన్నారు.
నగర కేంద్ర గ్రంథాలయానికి మోతీలాల్‌నాయక్
మోతీలాల్ నాయక్ దీక్ష విరమించిన అనంతరం చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంథాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణ ప్రకటించారు. లక్షలాది మందితో మరో 10 రోజుల్లో టీజీపీఎస్‌సీని ముట్టడి లాంటి కార్యక్రమాలు చేపడతామన్నారు. సిటీ లైబ్రరీ నిరుద్యోగుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు హామీ ఇచ్చి మోసం చేసిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment