మంత్రి కొండా సురేఖపై రూ. 100 కోట్లకు మరో దావా వేస్తా | Movie hero Nagarjuna on Konda Surekha | Sakshi
Sakshi News home page

మంత్రి కొండా సురేఖపై రూ. 100 కోట్లకు మరో దావా వేస్తా

Published Sat, Oct 5 2024 6:08 AM | Last Updated on Sat, Oct 5 2024 6:08 AM

Movie hero Nagarjuna on Konda Surekha

సినీ హీరో నాగార్జున వెల్లడి

కుటుంబాన్ని కాపాడుకోవడంలో తాను సింహాన్ని అని వ్యాఖ్య

సాక్షి, హైదరాబాద్‌: మంత్రి కొండా సురేఖ తమ కుటుంబాన్ని ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యల ఉదంతం గురించి సినీ హీరో నాగార్జున మరోసారి స్పందించారు. మంత్రిపై ఇప్పటికే క్రిమినల్‌ పరువునష్టం కేసు వేశామని.. ఆమెపై రూ. 100 కోట్లకు మరో పరువునష్టం దావా వేసేందుకు సిద్ధమవుతు న్నామని ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ చెప్పారు. మంత్రి కొండా సురేఖ కేవలం సమంతపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పారని.. కానీ తనకు, తన కుటుంబానికి మాత్రం ఒక్క ముక్క క్షమాపణ కూడా చెప్పలేదని నాగార్జున మండిపడ్డారు. 

ఒకవేళ ఇప్పుడు తనకు, తన కుటుంబానికి ఆమె క్షమాపణ చెప్పినా దావా విషయంలో వెనక్కి తగ్గబోనని తేల్చిచెప్పారు. సినీ పరిశ్రమలోని వ్యక్తులను సున్నిత లక్ష్యాలుగా చేసుకోవడాన్ని ఇకపై ఎంతమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ‘కొంతకాలంగా ఒక దాని తర్వాత ఒకటి సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఎప్పటికప్పుడు ఇదే చివరిదని అనుకున్నా. కానీ దైవానికి ఇంకేవో ప్రణాళికలు ఉన్నట్లు అనిపిస్తోంది. అయినా పరవాలేదు. 

నేనెప్పుడూ బలమైన వ్యక్తిత్వంగల వాడినని నమ్ముతా. నా కుటుంబాన్ని కాపాడే విషయంలో నేను ఓ సింహాన్ని. అదృష్టవశాత్తూ మొత్తం తెలుగు సినీ పరిశ్రమంతా మాకు అండగా నిలిచింది. ఇదంతా మా నాన్న మంచితనం, ఆశీర్వాదమేనని భావిస్తున్నా’ అని నాగార్జున పేర్కొన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement