
ఆర్థికసాయం చేస్తున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నార్కట్‌పల్లి: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని ఇద్దరు యువకులకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆర్థిక సాయం అందించారు. మండలంలోని శాపల్లి గ్రామానికి చెందిన శ్రీపాద మధు చిన్నవయసులోనే తల్లిదండ్రులు కృష్ణమాచారి, విజయ మృతి చెందారు. అమ్మమ్మ సావిత్రమ్మ అతడిని పెంచి పెద్దచేసింది. అమ్మమ్మ కూడా అనారోగ్యంతో ఇటీవల మృతి చెందింది. దీంతో మధు అనాథ అయ్యాడు. 10వ తరగతి వరకు చదివిన మధు... ఉన్నత చదువులు చదివే ఆర్థిక స్థోమతలేక కుల వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
గ్రామ వార్డు మెంబర్ శిరిగిరెడ్డి వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బత్తుల ఊషయ్యల ద్వారా విషయం తెలుసుకున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంగళవారం గ్రామానికి వచ్చి మధుకు రూ.50 వేల ఆర్థిక సాయం చేశారు. అలాగే ఇల్లు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు బత్తుల ఊషయ్య, పాశం శ్రీనివాస్‌రెడ్డి, కొంపెల్లి సైదులు, మదాసు చంద్రశేఖర్, కొమరబోయిన మల్లేషం, శిరిగిరెడ్డి వెంకట్‌రెడ్డి, కూరా కుల కృష్ణ, మాగి సుజన, నాయకులు ఉడతల వెంకన్న, తదితరులు ఉన్నారు.
క్రీడాకారుడికి కూడా..
మండలంలోని కొండపాకగూడేనికి చెందిన కబడ్డీ క్రీడాకారుడు గుండబోయిన సాయితేజ జాతీయస్థాయి కబడ్డీ జట్టుకు ఎంపికయ్యాడు. ఈనెల 9 నుంచి మహారాష్ట్రలో జరిగే పోటీల్లో పాల్గొననున్నాడు. నిరుపేద కుటుంబం కావడంతో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సాయికి రూ. 25 వేలు ఆర్థిక సాయం అందించారు.