జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌కు ఎల్ అండ్ టీ ప్రాజెక్టు డైరెక్టర్ ఎంవీ రామకృష్ణరాజు వెల్లడి
2019లోనే మేడిగడ్డ బరాజ్‌కు తీవ్ర నష్టం.. సీసీ బ్లాకులు కొట్టుకుపోయాయి
బరాజ్‌లో లోపాలను సరిదిద్దేందుకు నీటిపారుదల శాఖ రివైజ్డ్ డిజైన్లు ఇవ్వలేదు
తర్వాతి నాలుగేళ్లలో సమస్య తీవ్రత పెరిగి బరాజ్ కుంగిపోయిందని వివరణ
డిజైన్‌లో లోపాలున్నట్టు ఐఐటీ రూర్కీ తేల్చిందన్న ఉపాధ్యక్షుడు ఎస్.సురేశ్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బరాజ్‌ను తొలిసారి 2019లో నీళ్లతో నింపారని, అదే ఏడాది బరాజ్‌కు నష్టం జరిగిందని నిర్మాణ సంస్థ ‘ఎల్ అండ్ టీ’ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంవీ రామకృష్ణరాజు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌కు వెల్లడించారు. బరాజ్ దిగువన సీసీ బ్లాకులు కొట్టుకుపోయి అప్రాన్ పూర్తిగా ధ్వంసమైనట్టు గుర్తించి, నీటిపారుదల శాఖకు నివేదించామని వివరించారు. బరాజ్‌లో లోపాలను సరిదిద్దేందుకు రివైజ్డ్ డిజైన్లు, డ్రాయింగ్స్‌ను నీటిపారుదల శాఖ అందించలేదని, దీంతో సమస్య పెరిగి 2023 అక్టోబర్ 21న 7వ బ్లాక్ కుంగిపోయిందని పేర్కొన్నారు. ముందే రివైజ్డ్ డిజైన్లు ఇచ్చి ఉంటే బరాజ్‌ను రక్షించుకోవడానికి అవకాశం ఉండేదని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్‌ల నిర్మాణంపై ఏర్పాటైన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ శుక్రవారం మేడిగడ్డ బరాజ్ నిర్మాణ సంస్థ ‘ఎల్ అండ్ టీ’ప్రతినిధులకు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించింది.
డిజైన్లతో మాకు సంబంధం ఉండదు..
‘‘మేడిగడ్డ, ఇతర బరాజ్‌లలో 2019లో ఒకే తరహా సమస్యలు ఉత్పన్నమయ్యాయి. నీటి పారుదల శాఖ సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ) ఇంజనీర్ల ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ లేబోరేటరీస్ (టీఎస్‌ఈఆర్‌ఎల్)తో మళ్లీ మోడల్ స్టడీస్ నిర్వహించాలని క్షేత్రస్థాయిలోని ఈఈ పైఅధికారులకు లేఖ రాశారు. 2020 జూన్‌లో సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్) నిపుణులు, సీడీఓ ఇంజనీర్లు బరాజ్‌లను పరిశీలించారు. బరాజ్ రక్షణ కోసం ఎనర్జీ డిస్సిపేషన్ పనుల డిజైన్లను రూపొందించాలని 2020 ఫిబ్రవరిలో నీటిపారుదల శాఖ ఈఎన్సీ.. సీడీఓ సీఈను ఆదేశించారు.
టీఎస్‌ఈఆర్‌ఎల్ నిర్వహించిన 2డీ మోడల్ స్టడీస్ ఆధారంగా.. బరాజ్ దిగువన తగిన రీతిలో ఎనర్జీ డిస్సిపేషన్ ఏర్పాట్లు చేసేందుకు డిజైన్లను అందించాలని 2021 మార్చిలో కోరారు. రిటైర్డ్ ఈఎన్సీలతో కూడిన నిపుణుల కమిటీ 2022 మార్చిలో బరాజ్‌లను సందర్శించి షూటింగ్ వెలాసిటీని తగ్గించాలని సూచించింది. కానీ రివైజ్డ్ డిజైన్లు అందించకపోవడంతో బరాజ్ కుంగింది’’అని కమిషన్‌కు ఎంవీ రామకృష్ణరాజు వివరించారు. పీస్ రేటు కాంట్రాక్టు విధానంలో పనులు దక్కించుకున్న తమకు డిజైన్ల తయారీతో సంబంధం ఉండదని తెలిపారు. గడువులోగా పూర్తి చేయాలని ఒత్తిడి ఉన్నా నాణ్యతలో రాజీపడలేదని పేర్కొన్నారు.
విజిలెన్స్ విభాగం బరాజ్ నుంచి 90 కాంక్రీట్ నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తే.. ప్రమాణాలకు మించిన నాణ్యత ఉన్నట్టు తేలిందని వివరించారు. మేడిగడ్డ బరాజ్ నిర్మాణంలో లోపాలపై కమిషన్‌కు అఫిడవిట్ దాఖలు చేసిన ‘ఎల్ అండ్ టీ’మాజీ ఉన్నతాధికారి అమర్‌పాల్ సింగ్ వ్యవహారంపై స్పందించేందుకు ఎంవీ రామకృష్ణరాజు నిరాకరించారు.
మరో ఇద్దరు ప్రతినిధుల క్రాస్ ఎగ్జామినేషన్లో..
⇒ బరాజ్ గేట్ల నుంచి వరద సెకనుకు 6 మీటర్ల వేగం (షూటింగ్ వెలాసిటీ)తో దిగువన నేలను తాకుతుందనే అంచనాలతో నీటి పారుదల శాఖ (సీడీఓ) డిజైన్లను రూపొందించగా.. వాస్తవ వేగం సెకనుకు 16 మీటర్లుగా ఉందని, డిజైన్లలో లోపాలున్నాయని ఐఐటీ రూర్కీ అధ్యయనంలో తేలిందని ‘ఎల్ అండ్ టీ’హైడల్ ప్రాజెక్టు విభాగం ఉపాధ్యక్షుడు ఎస్.సురేశ్‌కుమార్ కమిషన్‌కు వివరించారు.
⇒ ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ రామరాజు బరాజ్‌ను సందర్శించి 2022 వర్షాకాలానికి ముందే షూటింగ్ వెలాసిటీని తగ్గించే ఏర్పాట్లు చేయాలని, లేకుంటే బరాజ్ దెబ్బతింటుందని హెచ్చరించారని కమిషన్‌కు ‘ఎల్ అండ్ టీ’డీజీఎం రజనీష్ పి.చౌహాన్ తెలిపారు. 7వ బ్లాక్‌కు మరమ్మతులు సాధ్యం కాదని, పూర్తిగా పునర్నిర్మించక తప్పదని పేర్కొన్నట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment