2.1 నుంచి 4.022 టీఎంసీలకు...నిల్వకు వీలుగా చెరువుల అభివృద్ధి
రూ.2,945.50 కోట్ల నుంచి రూ.4,350 కోట్లకు పెరిగిన అంచనా వ్యయం
రెండు దశల్లోనే నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు... లక్ష ఎకరాలకు సాగునీరు.. 0.38 టీఎంసీల మేర తాగునీరు
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం..త్వరలో టెండర్లకు ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్‌నగర్ సాగు, తాగునీటి అవసరాలను తీర్చడానికి నిర్మించతలపెట్టిన నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం సామర్థ్యాన్ని మరింతగా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టు ద్వారా మొత్తం 10 చెరువులకు నీటిని మళ్లించాల్సి ఉండగా, వాటి సామర్థ్యాన్ని 0.9 టీఎంసీల నుంచి 2.1 టీఎంసీలకు పెంచాలని మొదట్లో నిర్ణయించింది.
తాజాగా 4.022 టీఎంసీలను నిల్వ చేసే జలాశయాలుగా ఈ చెరువులను అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రాజెక్టు అంచనా వ్యయం సైతం రూ.2,945.50 కోట్ల నుంచి రూ.4,350 కోట్లకు చేరింది. తొలుత ప్రతిపాదించిన నాలుగు దశలకు బదులుగా రెండు దశల్లో ఈ పథకాన్ని నిర్మించనుండగా, త్వరలోనే టెండర్లు పిలిచేందుకు నీటిపారుదల శాఖ ఏర్పాట్లు చేస్తోంది.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నారాయణపేట, కొడంగల్, మక్తల్ నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలకు సాగునీరు, నారాయణపేట జిల్లాకు తాగునీరు అందించేందుకు ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి గత ఫిబ్రవరిలో ఈ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు.
భూత్పూర్ నుంచి నీటి తరలింపు
నీటిని తీసుకునే ప్రాంతం నుంచి సరఫరా చేసే చివరి పాయింట్ వరకు ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై సమగ్ర అధ్యయనం ముగిసింది. సంగంబండకు బదులు భీమా పథకంలో భాగంగా నిర్మించిన భూత్పూర్ జలాశయం నుంచి నీటిని తీసుకుంటారు. తాజా ప్రతిపాదనల ప్రకారం భూత్పూర్ జలాశయం నుంచి కనుకుర్తి వరకు మూడు చోట్ల నీటిని ఎత్తి పోయాలని, మొత్తం రెండు దశల్లో ఈ ప్రాజెక్టు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
తొలి దశలో భూత్పూర్ జలాశయం నుంచి ఊట్కూరు చెరువులోకి నీళ్లను ఎత్తిపోయనున్నారు. అక్కడి నుంచి జయమ్మ చెరువు, అక్కడి నుంచి కనుకుర్తి చెరువుకు నీళ్లను ఎత్తిపోస్తారు. ఇందుకోసం ఉట్కూరు, జయమ్మ, కనుకుర్తి చెరువుల ఆధునీకరణ, నిల్వ సామర్థ్యం పెంపు పనులను నిర్వహిస్తారు. తొలి దశ పనులకు రూ.2,945 కోట్ల వ్యయం కానుందని అంచనా వేశారు.
రెండో దశ పనుల్లో భాగంగా జాజాపూర్, దౌలతాబాద్, బొమ్రాస్‌పేట, లక్ష్మీపూర్, ఎర్లపల్లి, హుస్నాబాద్, కొడంగల్ అనే మొత్తం ఏడు చెరువుల నిల్వ సామర్థ్యాన్ని పెంచుతారు. గ్రావిటీ కాల్వలు, డిస్ట్రిబ్యూటరీ కాల్వలను నిర్మిస్తారు. రెండో దశ పనులకు రూ.1,404.50 కోట్ల వ్యయం అవుతుందని అంచనా.
భూత్పూర్‌తో తక్కువ వ్యయం
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన ఉద్ధండాపూర్ రిజర్వాయర్ (+269 అడుగుల సముద్రం మట్టం) నుంచి నీటిని లిఫ్ట్ చేయటం కంటే సముద్రానికి 350 అడుగుల మట్టంలో ఉన్న భూత్పూర్ రిజర్వాయర్ నుంచి ఎత్తిపోయడానికి తక్కువ నిర్వహణ వ్యయం అవుతుందని, సులువుగా ఉంటుందని ప్రభుత్వం భావించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
లక్ష ఎకరాలకు ఏడు టీఎంసీలు
మక్తల్ నియోజకవర్గంలో ఊట్కూరు, మక్తల్ మండలాల పరిధిలో 25,783 ఎకరాలు, నారాయణపేట నియోజకవర్గంలో నారాయణపేట, ధన్వాడ, దామరగిద్ద మండలాల్లో 20,472 ఎకరాలు, కొడంగల్ నియోజకవర్గంలోని కొడంగల్, మద్దూరు, కోస్గి, దౌలతాబాద్, బొమ్రాస్‌పేట మండలాల్లో 53,745 ఎకరాలు కలిపి మొత్తం లక్ష ఎకరాలను ఈ ప్రాజెక్టు కింద ప్రతిపాదించారు.
0.38 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేయడం ద్వారా నారాయణపేట జిల్లాలోని పలు గ్రామాలకు తాగునీటిని అందిస్తారు. ఇందుకోసం అప్రోచ్ ఛానెళ్లు, పంప్ హౌస్‌లు, డెలివరీ మెయిన్స్, సిస్టర్న్స్ నిర్మించనున్నారు. భూగర్భ సొరంగాలకు బదులు ప్రెషర్ మెయిన్స్ నిర్మించాలని నిర్ణయించారు.
ఉమ్మడి రాష్ట్రంలో సర్వే నిర్వహించి రూ.3,117 కోట్లతో ఈ ప్రాజెక్టును నిర్మించేందుకు డీపీఆర్‌ను సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదనలకు పలు మార్పులు చేర్పులు చేసిన రేవంత్‌రెడ్డి సర్కారు రూ.2,945.5 కోట్ల పనులకు గత ఫిబ్రవరి 8న పాలనా పరమైన అనుమతులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment