సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్‌ఎస్‌ను గద్దె దించడం, తెలంగాణలో అధికారంలోకి రావడమే ధ్యేయంగా బీజేపీ జాతీయ నాయకత్వం రోడ్డుమ్యాప్ సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, టీఆర్‌ఎస్ అనుసరిస్తున్న అప్రజాస్వామిక వైఖరి, బీజేపీని అణగదొక్కేలా కార్యకర్తలపై దాడులకు పాల్పడడం వంటి వాటిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.
తెలంగాణపై అనుసరించాల్సిన రాజకీయ వ్యూహంపై తీర్మానం వంటిది చేయకపోయినా ప్రాధాన్యతాంశంగా చర్చించడంతో పాటు 8 పేజీల ప్రత్యేక ప్రకటన చేశారు. రెండురోజుల జాతీయ కార్యవర్గ సమావేశాల్లో వివిధ తీర్మానాలు, ప్రస్తావనలు, తెలంగాణపై ప్రత్యేక ప్రకటన సందర్భంగానూ.. టీఆర్‌ఎస్ అనుసరిస్తున్న తీరుపై పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రతి ఎన్నికల్లోనూ విజయం సాధించేలా క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేసే అంశాలపై ప్రత్యేకంగా చర్చించి తీర్మానించారు. ఈ సమావేశాల్లో తెలంగాణపై ప్రత్యేక ప్రకటనతో పాటు రాజకీయ, ఆర్థిక తీర్మానాలను ఆమోదించారు. మోదీ ప్రభుత్వ ఎనిమిదేళ్ల ప్రగతిపై పార్టీ అభినందన ప్రస్తావన చేసింది.
రాష్ట్ర సర్కారు, టీఆర్‌ఎస్సే లక్ష్యం
ఇది బీజేపీ జాతీయ భేటీ అయినా.. ఒక రాష్ట్ర సర్కార్‌పై, అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆదివారం భేటీ ముగింపు ఉపన్యాసం సందర్భంగా.. ఇది భాగ్యనగరం అంటూ, తెలంగాణలో కార్యకర్తలు అధికార పార్టీ నుంచి తీవ్రస్థాయిలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్నారని ప్రధాని మోదీ అభినందించారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ బీజేపీని అధికారానికి తీసుకురావాలన్న లక్ష్యంతో కృషి కొనసాగించడంతో పాటు కచ్చితంగా అధికారంలోకి వచ్చే దిశలో చర్య లు తీసుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలం గాణలో ఎట్టి పరిస్ఠితుల్లోనూ అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించడంతో పాటు, ప్రత్యేక వ్యూహాల ను అనుసరిస్తుందనడానికి ఇదే తార్కాణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
కుటుంబ పాలనను అంతమొందిస్తాం..
తెలంగాణలో కేసీఆర్ కుటుంబపాలనను బీజేపీ అంతమొందిస్తుందని, కుటుంబ, వారసత్వ పాలన, జాతి.. కుల..మతాలు, సంతుష్టీకరణ రాజకీయాలకు చరమగీతం పాడతామని పేర్కొంటూ తీర్మానాలు ఆమోదించారు. రాజకీయ తీర్మానంపై చర్చలో పాల్గొన్న సీనియర్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాష్ట్రంలోని పరిస్థితులు, టీఆర్‌ఎస్ అనుసరిస్తున్న అప్రజాస్వామిక, నిరంకుశ విధానాలు, కుటుంబ, వారసత్వ పాలన కారణంగా రాష్ట్రంలోని పేదలు,
ప్రజలు తీవ్రసమస్యలు ఎదుర్కోవడం వంటి వాటిని ప్రస్తావించారు. కాగా దేశవ్యాప్తంగా కుటుంబ, వారసత్వ పాలనను అంతమొందించడంపై ప్రత్యేక దృష్టిని పెడుతున్నట్టు ఈ సమావేశాల్లో బీజేపీ ప్రకటించింది. వివిధ సందర్భాల్లో, చర్చల్లో తెలంగాణ ప్రస్తావన తీసుకువచ్చిన నేతలు.. కేసీఆర్ కుటుంబ అవినీతి, నియంత పాలనను అందమొందించాల్సిందేనని అన్నారు.
కాంగ్రెస్ తీరుపైనా ధ్వజం...
రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా.. కేసీఆర్‌పై, టీఆర్‌ఎస్‌పై విమర్శలు చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ హయాంలో కేంద్రంలో, రాష్ట్రాల్లో అభివృద్ధి జరగడం లేదంటూ జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని వివిధ రాష్ట్రాల నేతలకు సూచించారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో రాజకీయ వేధింపులు ఎక్కువయ్యాయని, వాటన్నింటినీ అధిగమించి అన్నిచోట్లా అధికారంలోకి రావడమే బీజేపీ ధ్యేయమనే అంశం ఈ సమావేశాల్లో స్పష్టమైంది.
నియంత్రణ పాటించాలి
ఇటీవల పార్టీ అధికార ప్రతినిధి నూపుర్‌శర్మ టీవీ చర్చల్లో చేసిన ఘాటైన వ్యాఖ్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని పార్టీ భావిస్తోంది. ఈ అంశంపై కొంత చర్చ జరిగినట్టు తెలుస్తోంది. సమావేశాల్లో భాగంగా పార్టీ అధికార ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ అయిన సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ఈ విషయంలో పలు జాగ్రత్తలు, సూచనలు చేసినట్టు సమాచారం.
దీనిపై చర్చకు అవకాశం ఇవ్వకుండా, అనవసర వ్యాఖ్యలు చేయకుండా నియంత్రణ పాటించాలని చెప్పినట్టు తెలిసింది. బీజేఎల్పీ నేత రాజాసింగ్‌ను కూడా పిలిపించి సంయమనంతో వ్యవహరించాలని, తీవ్రమైన వ్యాఖ్య లు చేయకుండా సమతుల్యం కోల్పోకుండా ఉండాలని హితవు పలికినట్టు సమాచారం. ఉదయ్‌పూర్‌లో ఒక టైలర్ తల నరికివేత, మహారాష్ట్రలోని అమరావతిలో మరో ఘటన నేపథ్యంలో ఆచితూచి స్పందించాల్సిందిగా అధికార ప్రతినిధులు, నేతలకు నాయకత్వం హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. నూపుర్‌శర్మ కేసులో సుప్రీంకోర్టు చేసిన వ్యా ఖ్యలపైనా చర్చ జరిగినట్టు చెబుతున్నా.. వివరాలను బయటకు వెల్లడించేందుకు కార్యవర్గ సభ్యులు నిరాకరించారు.
Comments
Please login to add a commentAdd a comment