
సాక్షి, ముషీరాబాద్: రాష్ట్ర మాజీ హోంమంత్రి, కార్మిక నాయకుడు నాయిని నర్సింహారెడ్డి(80) బుధవారం అర్ధరాత్రి దాటాక కన్నుమూశారు. ఇటీవల ఆయన కోవిడ్ బారిన పడ్డారు. దాని నుంచి కోలుకున్న తర్వాత నిమోనియా సోకింది. వారం రోజులుగా అపోలో ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. అర్ధరాత్రి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నాయిని తుదిశ్వాస విడిచారు. ఆరడుగుల ఆజానుబాహుడు.. కోర మీసాలు.. వీటికి తోడు బుల్లెట్.. నాయిని నర్సింహారెడ్డి అనగానే గుర్తుకొచ్చేవి ఇవే. సోష లిస్టు పార్టీ భావాలతో ఎప్పుడూ నీతి, న్యాయం కోసం పోరాడేవారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా ఇట్టే అక్కడికి చేరి వారికి న్యాయం జరిగే వరకు వెన్నంటే ఉండేవారు. అందువల్లే హైదరాబాద్ వచ్చిన అనతికాలంలోనే కార్మికుల పక్షాన నిలబడి వారి హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరూ ఆయనను ముద్దుగా బుల్లెట్ వీరుడు.. మీసాల సూర్యుడు అని పిలుచుకునేవారు. ఆయన ఏ గల్లీకి వెళ్లినా బుల్లెట్ ఉండాల్సిందే. వయోభారం మీదపడ్డా.. బుల్లెట్ నడపలేని స్థితిలో ఉన్నా తన బుల్లెట్‌ను మాత్రం రోజూ తుడవడం, ఒకసారి స్టార్ట్ చేసి పక్క న పెట్టడం ఆయనకు అలవాటు. ముఖ్యం గా వాహనాలంటే ఆయనకు అమితమైన మోజు. మార్కెట్‌లోకి ఏ కొత్త వాహనం వచ్చినా దానిని ట్రయల్ చేసేవారు. చదవండి: మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుమూత
రమిజాబీ కేసుతో వెలుగులోకి...
1978లో నల్లకుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో రమిజాబీ అనే ముస్లిం మహిళపై జరిగిన అత్యాచారం, దాడి ఘటన అప్పట్లో రాష్త్రాన్ని మొత్తం కుదిపివేసింది. బాధితుల పక్షాన నిలబడి నాయిని సుదీర్ఘ పోరాటం చేశారు. అప్పట్లో నల్లకుంట పోలీస్‌స్టేషన్‌ను వేలాది మందితో ముట్టడించారు. అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి నల్లకుంట, ముషీరాబాద్ ప్రాంతాలలో కర్ఫ్యూ కూడా విధించారు. ఈ ఘటనతోనే నాయిని వెలుగులోకి వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment