
సాక్షి, గచ్చిబౌలి: హుస్సేన్ సాగర్ తరువాత చెప్పుకోదగ్గ చారిత్రక సుందర తటాకం మన దుర్గం చెరువు. నిజాం నవాబుల కాలంలోనే హుస్సేన్ సాగర్ నిర్మించగా రెండు గుట్టల మధ్యలో గలగల పారే సేలయేరు లాంటి దుర్గం చెరువు ఆ నిజాం నవాబులు నివాసం ఉండే సెవన్ టూంబ్స్‌కు తాగునీరు అందించినట్లు చరిత్ర చెబుతోంది. అంతటి ప్రాధాన్యత ఉన్న దుర్గం చెరువు మొన్నటి వరకు దుర్గంధంగా మారిందనే చెప్పాలి. ఐటీ కారిడార్‌లో ఉన్న మేటి చెరువుగా ప్రసిద్ధి గాంచిన దుర్గంచెరువు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోగా కె.రహేజా గ్రూపు చెరువు అభివృద్ధికి నడుం బిగించింది. అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు రహేజా గ్రూపు దుర్గం చెరువును టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దుతున్నాయి.
ఇప్పటికే దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి పనులు పూర్తి కాగా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభానికి సిద్ధంగా ఉంది. కేబుల్ బ్రిడ్జి రాత్రి సమయంలో జిగేల్ మంటూ ఇట్టే ఆకర్షించే రీతిలో విద్యుత్ కాంతుల ఉన్న దృశ్యాలు అందరినీ కట్టి పడేస్తున్నాయనే చెప్పాలి. అంతర్జాతీయ ప్రమాణాలతో బోటింగ్, రెస్టారెంట్‌లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర టూరిజం శాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ మనోహర్‌ను ఆదేశించారు. విద్యుత్ వెలుగు జిలుగులు మధ్య కేబుల్ బ్రిడ్జిపై విహరిస్తూ దుర్గం చెరువు అందాలను మనసారా చూస్తూ పర్యాటకులు సేదదీరే అరుదైన అవకాశం చిక్కనుంది. ఇది నిజంగా నగర వాసులకు సరికొత్త అనుభూతిగా చెప్పవచ్చు. మరి కొద్ది రోజుల్లోనే దుర్గం చెరువు మరో ఐకాన్‌గా నిలువనుంది.
వచ్చే వారంలో కేబుల్ బ్రిడ్జి ప్రారంభం
జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 నుంచి ఐటీ కారిడార్‌ను కేబుల్ బ్రిడ్జి ద్వారా అనుసంధానం చేస్తూ రూ.184 కోట్ల వ్యయంతో నిర్మించారు. 233 మీటర్ల పొడవు, ఆరు లేన్ల వెడల్పు ఉంటుంది. పాదచారులు, సైకిలిస్ట్‌ల కోసం ప్రత్యేకంగా ట్రాక్‌లు ఏర్పాటు చేశారు. బ్రిడ్జిపై ప్రత్యేకంగా లైటింగ్ ఏర్పాటు చేశారు. రాత్రి సమయంలో వివిధ రంగుల్లో జిగేల్ మంటోంది. కేబుల్ బ్రిడ్జికి రెండు వైపుల వాటర్ ఫౌంటేన్‌లు ఏర్పాటు చేయనున్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేబుల్ బ్రిడ్జిని వచ్చే వారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిచనున్నారు.
ప్రారంభానికి జీహెచ్‌ఎంసీ అధికారులు, ఇరిగేషన్‌తో పాటు హెచ్‌ఎండీఏ, టూరిజం శాఖ అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ఉదయం సాయంత్రం వేళల్లో జూబ్లీహిల్స్ నుంచి మాదాపూర్‌కు రావాలంటే దాదాపు 30–40 నిమిషాల సమయం అవసరం. రోడ్ నెంబర్ 45 నుంచి కేబుల్ బ్రిడ్జి ద్వారా ఐటీ కారిడార్‌లోని ఇనార్బిట్ మాల్‌కు కేవలం10 నిమిషాల వ్యవధిలోనే చేరుకోవచ్చు.
సర్వాంగ సుందరంగా
ఆకర్షణీయంగా రూపుదిద్దుకున్న కేబుల్ బ్రిడ్జికి తగ్గట్టుగా దుర్గం చెరువును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ధేందుకు ‘మన దుర్గం పేరిట’ కె రహేజా గ్రూపు రూ.40 కోట్లకు పైగా సీఎస్‌ఆర్ నిధులను ఇప్పటికే ఖర్చుచేసింది. చెరువు చుట్టూ 4.5 కిలో మీటర్ల పొడవునా వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేసింది. భద్రతలో భాగంగా ఇన్నర్ సైడ్ సేఫ్టీ రెయిలింగ్‌ను అమర్చారు. ట్రాక్ పొడవునా ప్లాంటేషన్‌తో పాటు ఎలక్ట్రికల్ లైటింగ్ అమర్చనున్నారు. చిల్డ్రన్ ప్లే ఏరియాతో పాటు ఓపెన్ జిమ్, రెండు ఎంట్రెన్స్ ప్లాజాలు ఏర్పాటు చేశారు. ఇనార్బిట్ మాల్ వైపు ఉన్న బ్రిడ్జి కింది భాగం నుంచి ఎన్‌సీసీ బిల్డింగ్ వద్ద ఉన్న ఎంట్రెన్స్ పాలజా వరకు ఉన్న ఖాళీ స్థలాన్ని చదును చేస్తున్నారు.
అందులో వర్టికల్ ల్యాండ్ స్కేపింగ్, ప్లాంటేషన్ చేపట్టి ఆహ్లాదంగా తీర్చి దిద్దనున్నారు. కేబుల్ బ్రిడ్జి ప్రారంభంలోపే సుందరీకరణ పనులు పూర్తి కానున్నాయి. దుర్గంధంగా ఉన్న దుర్గం చెరువులో గుర్రపు డెక్కను పూర్తి స్థాయిలో తొలగించారు. అంతే కాకుండా చెరువులో మురుగు నీరు కలువ కుండా ఉంచేందుకు రెండున్నర కిలో మీటర్ల పొడవునా పైపులైన్ వేసి మురుగు నీరును కిందికి పంపిస్తున్నారు. కేవలం వర్షం వచ్చినప్పడే మాత్రమే ఇన్‌లెట్స్ ద్వారా కొద్ది మేర మురుగు నీరు చెరువులోకి వచ్చే అవకాశం ఉంది. చెరువులోకి వచ్చే ఇన్‌లెట్స్ వద్ద మురుగు నీరు శుద్ధి చేసే అంశాల్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.
పర్యాటకులను ఆకర్షించే విధంగా నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ బోటింగ్ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించినట్లు తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్ తెలిపారు. సోఫాలో కూర్చుని పర్యాటకులు జాలీ రైడ్‌కు వెళ్లేందుకు డీలక్స్ బోట్ అందుబాటులోకి తెస్తామన్నారు. నలుగురు కూర్చునే స్పీడ్ బోట్‌తో పాటు రెండు ఫెడల్ బోట్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. దుర్గం చెరువులో పర్యాటకులను ఆకర్షించే రీతిలో ఫ్లోటింగ్ రెస్టారెంట్‌ను నెలకొల్పుతామని పేర్కొన్నారు. కోవిడ్–19 నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే బోటింగ్ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని వివరించారు. నగరానికే తలమానికింగా ఉండే కేబుల్ బ్రిడ్జి ప్రారంభం అనంతం రెండవ ఫేజ్‌లో పర్యాటకుల సౌకర్యార్ధం మరిన్ని ఏర్పాట్లు చేసే ఆలోచన ఉందని అన్నారు.
ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment