సాక్షి, నిర్మల్: ఎంతో కష్టపడి ఉద్యోగం సాధించుకుంది. తనకంటూ ఓ భరోసా దొరికిందని సంతోష పడింది. భర్త, పిల్లలతో సాఫీగా జీవితం సాగుతోంది. అందరిలాగే తన పని తాను చేసుకుపోతోంది. కానీ.. తను పనిచేస్తున్నచోట ఓ నీచుడి కళ్లు తనపైనే ఉన్నాయన్న విషయాన్ని గుర్తించలేకపోయింది. కళ్లతోనే కీచకత్వాన్ని ప్రదర్శిస్తున్న ఆ దుర్మార్గుడు క్రమంగా తనతో అసభ్యంగా మాట్లాడే వరకూ వచ్చాడు. ఈ విషయం ఎవరితో చెప్పుకోవాలో తెలియక.. చెబితే ఏమనుకుంటారోనన్న భయంతో.. కుమిలి పోసాగింది. ఆమె తనను ఏం చేయాలేదన్న ధీమానా.. లేక ఏం చేసినా.. తనకేం కాదన్న ధైర్యమా..! ఆ కీచకుడు తన చేష్టలతో ఆమెను మరింత ఇబ్బంది పెట్టాడు.
చివరకు తన కుటుంబానికి తన బాధను చెప్పుకుని బోరుమంది. ఇలా.. ఈ ఒక్క ఉద్యోగినికే కాదు.. మరో ఉపాధ్యాయురాలికి ఇదే పరిస్థితి. ఇంకో శాఖలో పనిచేస్తున్న యువ ఉద్యోగికీ ఇదే వేధింపులు. ఓస్థాయిలో ఉన్న మహిళ అధికారికీ అప్పుడప్పుడు ఇలాంటి కీచక చేష్టలు ఎదురవుతూనే ఉన్నాయి. సర్కారు ఉద్యోగాల్లో ఉన్నవాళ్లకే ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఇక నెలజీతంతో కుటుంబాలను పోషించుకునే ప్రైవేటు పనులు చేసే మహిళల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఆమె బయటకు వెళ్లిందంటే చాలు.. వేధించని చోటెక్కడైనా ఉందా.. అన్న ప్రశ్నలూ మహిళాలోకం నుంచి వస్తున్నాయి.
జిల్లాలో ఏళ్లుగా ఇలాంటి కీచక చేష్టలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏదైన ఘటన జరిగినప్పుడు స్పందించే ఉన్నతాధికారులు ఆ తర్వాత చర్యలపై దృష్టిపెట్టడం లేదు. ఇప్పటికీ జిల్లాలో మహిళా ఉద్యోగినులు ఇలాంటి ఫిర్యాదులు చేయడానికి ఉండాల్సిన అంతర్గత ఫిర్యాదుల కమిటీలు(ఇంటర్నల్ కంప్‌లైంట్ కమిటీ–ఐసీసీ) పత్తాలేవు. ఒక్క శాఖలో కూడా కమిటీలను వేయకపోవడం దారుణం.
ఛదవండి: మసాజ్‌సెంటర్ ముసుగులో వ్యభిచారం.. ఏడుగురు అరెస్ట్
అంతటా అభద్రతే..
ఆ చోట.. ఈచోట.. అని కాదు. మహిళలపై అంతటా వేధింపులు పెరుగుతున్నాయి. అడుగడుగునా అతివలకు అసభ్యకరమైన చేష్టలు, వ్యంగ్యమైన మాటలు, మింగేలా చూసే చూపులు తప్పడం లేదు. జనాభాపరంగా మహిళలు అధికంగా ఉన్న జిల్లాలో వారిపైనే ఇలాంటి కీచక చేష్టలు పెరుగుతుండటం కలవరపెడుతోంది. కొంతమంది రాక్షసులు కళ్లతోనే మహిళలను చిత్రహింసలు పెడుతున్నారు. ఎవరైనా అమాయకత్వంగా ఉంటే ఆసరాగా చేసుకుని అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. బస్సుల్లో వచ్చే విద్యార్థినులు, వ్యాపారసంస్థలు, ఆఫీసుల్లో పనిచేసే యువతులతో పాటు ప్రభుత్వ ఉద్యోగినులపైనా వేధింపులు పెరుగుతున్నాయి.
ఉద్యోగాలు వదులుకునే దాకా..
మూడేళ్ల క్రితం జిల్లాలోని ఓ శాఖకు చెందిన ఉద్యోగిని తన పై అధికారి నుంచి వేధింపులను ఎదుర్కొన్నారు. సంబంధిత శాఖ పనిపైన కాకుండా ఆ పైఅధికారి పర్సనల్ విషయాలను మాట్లాడటం, చొరవ తీసుకోవడం చేశాడు. ఆమె సెల్‌ఫోన్‌కు రాత్రిపూట మెసేజ్‌లను పంపడం, ఫోన్లు చేయడం వంటివీ కొనసాగించాడు. చివరకు ఆమె పై అధికారుల వద్దకు వెళ్లడంతో ఆ కీచకుడు కాళ్లబేరానికి వచ్చాడు. తనకు ఇబ్బంది కలిగిన చోట ఉండలేక సదరు ఉద్యోగిని దూరంగా ట్రాన్స్‌ఫర్ చేసుకుని వెళ్లిపోయారు.
► మరోశాఖలోనూ ఓ స్థాయి ఉన్న అధికారి ఇదే తీరుగా తన కింది ఉద్యోగిని పట్ల ప్రవర్తించిన విషయం విచారణ వరకూ వెళ్లినా.. అధికారులు బయటకు రానివ్వలేదు.
► కొత్తగా ఉద్యోగాల్లో చేరిన యువ ఉద్యోగినులపైనా కొంతమందిపై అధికారుల తీరుపై సరిగా లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
► అధికారులు, తోటి ఉద్యోగులచేష్టలు ఇబ్బంది పెడుతుండటంతో ఒకరిద్దరు కాంట్రాక్టు ఉద్యోగినులు తమ ఉద్యోగాలనూ వదులుకున్నారు.
► తాజాగా ఉపాధ్యాయ వృత్తిలో ఉండి, తోటి ఉపాధ్యాయురాలితోనే అసభ్యంగా ప్రవర్తించాడో దుర్మార్గుడు. గతంలో పనిచేసిన చోటల్లా ఇలాంటి కీచక చేష్టలనే ప్రదర్శించినట్లు ఆరో పణలున్నాయి. ఎలాగు బదిలీల్లో వేరే జిల్లాకు వెళ్తున్నానన్న ధీమాతో సహోపాధ్యాయురాలి ని వేధించిన ఈ ‘టీచకుడి’ తీరు ఉ న్నతాధికారుల వరకూ వెళ్లింది. వాళ్లు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ప్రశ్నార్థకంగా ఉంది.
చదవండి: ప్రేమలేనిదే జీవించలేమని.. ప్రేమికుల ఆత్మహత్య
ఐసీసీ జాడేది..
‘పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధం, నిషేధ చట్టం–2103’ ప్రకారం.. మహిళలు పనిచేసే చోట వారికి ఎదురయ్యే వేధింపులు, సమస్యలపై విచారించేందుకు ‘అంతర్గత ఫిర్యాదుల కమిటీ’ని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. చట్ట ప్రకారం ఆయాశాఖల వారీగా అంతర్గత ఫిర్యాదుల కమిటీ(ఐసీసీ)లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. జిల్లాలో మాత్రం ఇప్పటి వరకు ఈ కమిటీలు ఏర్పాటు కాలేదు. గతేడాది స్వయంగా సీఎంఓ నుంచి మహిళ ఉద్యోగినుల కోసం ప్రత్యేకంగా ఓ సెల్ ఏర్పాటు చేసే దిశగా చర్యలు మొదలుపెట్టినా.. అవి ఇంకా కొలిక్కిరాలేదు. ఈ సెల్ ఏర్పాటైతే బాధితులు ఆన్‌లైన్ ద్వారా చేసే ఫిర్యాదు ఏకకాలంలో సంబంధిత శాఖాధికారి, కలెక్టర్, ఐసీసీ రాష్ట్ర కమిటీతో పాటు జాతీయస్థాయి కమిటీ వరకూ వెళ్తుంది. కానీ.. ఇప్పటికీ ఐసీసీ మహిళ ఉద్యోగినులకు అందుబాటులోకి రాకపోవడం శోచనీయం. మహిళ ఉద్యోగినుల రక్షణకోసం గత ఏడాది ఫిబ్రవరిలో కలెక్టర్ ముషరఫ్ అలీ ఓ సీరియస్ సర్క్యులర్ జారీ చేశారు. ఇది కూడా పూర్తిగా అమలు కాకపోవడం గమనార్హం.
చర్యలు తీసుకుంటాం..
జిల్లాలో మహిళా ఉద్యోగినులపై ఎలాంటి వేధింపులను సహించేది లేదు. గత ఏడాదే దీనిపై సర్క్యులర్ జారీ చేశాం. జిల్లాలో ఇంటర్నల్ కంప్‌లైంట్ కమిటీ కూడా డీడబ్ల్యూఓ చైర్మన్‌గా పనిచేస్తోంది. ఇంటర్నల్ కంప్‌లైంట్ సెల్ సేవలు కూడా అందుబాటులోకి వస్తాయి. బాధితులు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు.
– ముషరఫ్ అలీ ఫారూఖి, కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment