సాక్షి, కరీంనగర్: దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయల రాయితీలు అందజేస్తున్నాయి. గ్యాస్‌బండ ధర పెరిగినప్పుడల్లా రాయితీని కూడా పెంచుతూ ఆ సొమ్మును వినియోగదారుల ఖాతాల్లో జమ చేస్తున్నాయి. గరిష్ఠంగా ఒక్కో వినియోగదారుడు నెలకు ఒకటి చొప్పున ఏడాదికి పన్నెండు సిలిండర్లు పొందే అవకాశముంది. అన్ని అవసరం లేకపోయినా కొందరు తీసుకుని ఇతరులకు విక్రయిస్తున్నారు. పథకాల్లో ఉన్న లోపాలను అదనుగా చేసుకుని పలు ఏజెన్సీలు పక్కదారి పట్టిస్తున్నాయి. దీంతో లక్ష్యానికి తీరని విఘాతం కలుగుతోంది. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్‌ను ఎక్కువగా వాణిజ్య అవసరాలకు వినియోగించడం సర్వసాధారణమైంది. ఇలాంటి దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు కొత్త విధానం అమల్లోకి వచ్చింది.
వినియోగదారుడి ధ్రువీకరణతోనే
వాణిజ్యానికి వినియోగించే సిలిండర్ల ధరలు అధికంగా ఉండటంతో గృహవసర సిలిండర్లు దారి మళ్లుతున్నాయి. హోటళ్లు, టీ స్టాళ్లు, టిఫిన్ సెంటర్లు, బేకరీలు ఇలా ఎక్కడ పడితే అక్కడ వాడుతూ ప్రభుత్వానికి నష్టం కలిగిస్తున్నారు. రాయితీ లక్షల్లో దుర్వినియోగమవుతోంది. దీనికి చెక్ పెట్టేందుకు చమురు సంస్థలు సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చాయి. పెట్రోలియం మంత్రిత్వశాఖ వంట గ్యాస్ డెలివరీకి సరికొత్త నిబంధన తీసుకొచ్చింది. ఇకపై ఓటీపీ(వన్‌టైం పాస్‌వర్డ్)ని తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారులు తాము రిజిష్టర్ చేసుకున్న మొబైల్ నుంచి రీఫిల్ బుక్‌చేసుకుంటే ఓటీపీ వస్తుంది. ఈ నంబర్ చెబితేనే ఇక నుంచి గ్యాస్ సిలిండర్ అందనుంది. ఇలా సదరు వినియోగదారుడి ధ్రువీకరణతోనే సరఫరా చేసే విధానం అమలుకు చమురు సంస్థలు శ్రీకారం చుట్టాయి. జిల్లాలోని హుజూరాబాద్, చొప్పదండి, కరీంనగర్, మానకొండూరు నియోజకవర్గాల పరిధిలో భారత్ గ్యాస్, ఇండెన్, హెచ్‌పీ చమురు సంస్థల ఏజెన్సీలు 35వరకు ఉన్నాయి. మొత్తంగా 5.10 లక్షల కనెక్షన్లుండగా.. ప్రతి నెలా జిల్లాలో లక్షకు పైగా గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తున్నారు.
ఆన్‌లైన్ చెల్లింపులకు ప్రాధాన్యం
జిల్లాలో నానాటికి కరోనా కేసులు అధికమవుతునే ఉన్నాయి. ఏజెన్సీలు గ్యాస్ బండలకు నగదు చెల్లింపులకు కూడా చెక్ పెడుతూ వాట్సప్ ద్వారా సులభంగా డబ్బును చెల్లించేలా ఏర్పాట్లు చేస్తోంది. రిజిష్టర్ నంబర్ల ద్వారా చమురు సంస్థల వాట్సప్ నంబర్లకు హాయ్ అని సమాచారం ఇవ్వాలి. ఇలా వచ్చిన వెంటనే క్షణాల్లో స్పందనను పొందవచ్చు. బుకింగ్‌తో పాటు నగదును తమ డెబిట్, క్రెడిట్ కార్డులు, బ్యాంకు ఖాతాలు, తదితర వాటిని వినియోగించి చెల్లించవచ్చు. దీనికి తోడు ఫోన్‌పే, గూగుల్ పేల ద్వారా కూడా నగదును బదిలీ చేయవచ్చు. ప్రజల్లో మరింత అవగాహన పెంచడం ద్వారా చమురు సంస్థలు అమలు చేసే డిజిటల్ చెల్లింపులు, ఓటీపీ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలుకు సాధ్యపడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అనుసంధానం చేసుకుంటే మేలు
గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది తమ మొబైల్ నంబర్‌ను లింక్ చేసుకోలేదు. ఇప్పటివరకు మొబైల్ నంబర్ అనుసం«ధానం లేని వినియోగదారులు ఈ నెలాఖరులోపు అనుసంధానించుకోవాలి. లేదంటే ఆ తరువాత ఓటీపీ చెప్పని క్రమంలో గ్యాస్ బండలను పొందే అవకాశం కోల్పొవాల్సి ఉంటుందని ఏజెన్సీలు పేర్కొంటున్నాయి.
ఇకపై ఓటీపీ చెబితేనే.. సిలిండర్
Published Thu, Aug 27 2020 12:08 PM | Last Updated on Thu, Aug 27 2020 12:08 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment