సాక్షి, హైదరాబాద్: ఆన్‌లైన్ విద్య పల్లెల వరకు చేరనట్టు కనిపిస్తోంది. గ్రామీణ విద్యార్థులు ఇంటర్నెట్ వేగాన్ని అందుకోనట్టు తెలుస్తోంది. ఆన్‌లైన్ చదువుకు కావాల్సిన వస్తువుల కోసం ఖర్చు చేసే స్థోమత పల్లె విద్యార్థులకు లేకపోవడం, ఎలాగో కష్టపడి తెచ్చుకున్నా అరకొర ఇంటర్నెట్‌తో చదువుకునేందుకు ఇబ్బంది పడినట్టు అనిపిస్తోంది. తాజా ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు ఈ సందేహా లను లేవనెత్తాయి.
కరోనా లాక్‌డౌన్‌తో..
2020లో కరోనా లాక్‌డౌన్ పెట్టడంతో సాధారణ ప్రజలతో పాటు విద్యార్థులూ మారుమూల గ్రామా లకు వెళ్లాల్సి వచ్చింది. అదే సమయంలో ఆన్‌లైన్ బోధన తెరమీదికొచ్చింది. కానీ అప్పటికప్పుడు దాన్ని అందిపుచ్చుకోవడం పల్లె విద్యార్థులకు సాధ్యం కాలేదు. ఆన్‌లైన్ విద్యకు ఉపకరణాలు సమకూర్చుకోవడంలో వెనుక బడ్డారు. ఎలాగోలా కష్టపడి తెచ్చుకున్నా అరకొర ఇంటర్నెట్, అంతరాయాలతో ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వ కాలేజీల అధ్యాపకులు కూడా ఆన్‌లైన్‌కు అంతగా ఆసక్తి చూపలేదు. కాలేజీల్లో మౌలిక సదుపాయాలు లేవన్నారు. సంక్షేమ హాస్టళ్లను మూసేయడంతో పేద విద్యార్థులు ఇళ్లకు వెళ్లారు. అప్పటికీ ఇంటర్ సిలబస్ 30 శాతం తగ్గించినా గ్రామీణ విద్యార్థులు వేగంగా ముందుకెళ్లలేక పోయారు. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు ఎక్కు వుండే సూర్యాపేట, మహబూబాబాద్, వనపర్తి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో ఇంటర్ ఉత్తీర్ణత 45 శాతం కన్నా తక్కువే నమోదైంది. అరకొరగా పాసైనా వాళ్ల మార్కుల గ్రేడ్ సగటున 50 శాతం దాటలేదు. దాదాపు లక్ష మందికి పైగా విద్యార్థులు ఆన్‌లైన్ స్పీడ్‌ను అందుకోలేదని ఫలితాలను బట్టి తెలుస్తోంది.
పట్టణాలకే పరిమితమైందా?
సాధారణంగా ఇంటర్ విద్యకు ఎక్కువ మంది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని కాలేజీలకే ప్రాధాన్యమిస్తున్నారు. హాస్టళ్లలో ఉండి చదువుకుం టున్నారు. కరోనా వల్ల ప్రైవేటు కాలేజీల్లో ఆన్‌లైన్ విద్యాబోధనకు ప్రాధాన్యమిచ్చారు. విద్యార్థులూ పట్టణాల్లో ఉండటంతో నెట్ సమస్యలు రాలేదు. ఆ సమయంలో వచ్చిన కొత్త యాప్‌లూ పట్టణ విద్యార్థులకు ఉపయోగపడ్డాయి. ఫలితంగా పట్టణాల్లో ఉత్తీర్ణత ఎక్కువగా కన్పిస్తోంది. హైదరాబాద్, ఖమ్మం, వరంగల్‌లలో 50 నుంచి 60 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వీళ్లలో ఎక్కువ మంది 75 శాతం మార్కులతో ‘ఏ’ గ్రేడ్ సాధించారు. దీన్ని బట్టి ఆన్‌లైన్ విద్య పట్టణాలకే పరిమితమైందని విద్యావేత్తలు విశ్లేషిస్తున్నారు.
ఎవరిదీ వైఫల్యం?
220 రోజులు జరగాల్సిన ప్రత్యక్ష బోధన 60 రోజులే సాగింది. 60 శాతం వరకూ వచ్చే ఫలి తాలు 49 శాతం దగ్గరే ఆగాయి. దీన్నిబట్టి ఆన్ లైన్ బోధన గ్రామీణ విద్యార్థులను చేరుకోలే దని గుర్తించాలి. ఈ వైఫల్యంపై ఆత్మ పరిశీలన జరగాలి. నష్టపోయేది ఊళ్లల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలేనని తెలుసుకోవాలి.
– డాక్టర్ పి. మధుసూదన్ రెడ్డి ,(ఇంటర్ విద్యార్థి జేఏసీ చైర్మన్)
పాఠం వినే అవకాశమేది?
ప్రభుత్వ హాస్టల్‌లో సీటొచ్చింది. కానీ కరోనా వల్ల మూసేశారు. మా ఊర్లో టీవీ కనెక్షన్లు లేవు. మొబైల్ సిగ్నల్ సరిగా రాదు. ఊరికి దూరంగా వెళ్తేనే సిగ్నల్ వచ్చేది. దీంతో ఆన్ లైన్ క్లాసులకు కష్టమైంది. ఈ మధ్యే కాలేజీలు తెరిచారు. హాస్టళ్లు ఆలస్యమయ్యాయి. దీంతో ఫస్టియర్‌లో రెండు సబ్జెక్టుల్లో ఫెయిలయ్యాను.
– ఎ. శంకర్ (అడవి ముత్తారం,కరీంనగర్ జిల్లా)
Comments
Please login to add a commentAdd a comment