
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు వేసవి ఎండలతో వాతావరణం వేడెక్కుతుండగా.. మరోవైపు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పొలిటికల్ హీట్ రగులుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్న నేపథ్యంలో ఓయూలో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమానికి వైస్ చాన్స్‌లర్ నిరాకరించారు. ఈ నేపథ్యంలోనే ఓయూలోని పరిపాలన కార్యాలయంపై కొంతమంది దాడులకు పాల్పడటంతో కేసుల నమోదు, అరెస్టులు, రిమాండ్ వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.
కొన్నాళ్లుగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కొన్ని పరిణామాలు చోటుచేసుకున్నాయి. వీసీ రవీందర్ ఏడాది క్రితం బాధ్యతలు చేపట్టిన తర్వాత సంస్కరణల దిశగా అడుగులేశారు. పీహెచ్‌డీల కాలవ్యవధిని నిక్కచ్చిగా అమలు చేయాలనే ఉద్దేశంతో పాటు క్యాంపస్ పరిధిలో భద్రత ఏర్పాట్లలో కొత్త వ్యక్తుల నియామకం, హాస్టళ్ళపై నిరంతర నిఘా వంటి చర్యలపై విద్యార్థుల నుంచి వ్యతిరేకత కన్పిస్తోంది. దీనికి తోడుగా రాహుల్ గాంధీ అంశం తెరమీదికి రావడంతో ఉద్రిక్తతలకు దారి తీసింది.
వివాదానికి కారణమేంటి?
రాహుల్ ముఖాముఖి వివాదంపై విభిన్న వాదనలు విన్పిస్తున్నాయి. చారిత్రక నేపథ్యం ఉన్న ఓయూకి జాతీయ నాయకులను అనుమతిస్తే వర్సిటీకి మరింత బలం చేకూరుతుందని విద్యార్థులు చెబుతుండగా.. విద్య, రాజకీయాలను వేర్వేరుగా చూడటం సరికాదని కాలేజీ రాజకీయ విభాగం అధ్యాపకుడు ఒకరు వ్యాఖ్యానించారు. అనేక సందర్భాల్లో రాజకీయ ప్రముఖులను ఆహ్వానించడం సాధారణమేనన్నారు.
రాహుల్ ముఖాముఖిని ఈ కోణంలోనే చూస్తే వివాదం ఉండేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఓయూ క్యాంపస్‌లోకి రాజకీయ కార్యకలాపాలను అనుమతించవద్దనే నిర్ణయం తీసుకున్నామని వీసీ రవీందర్ అంటుండగా.. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే ఈ విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారని ఓయూ విద్యార్థి నిరుద్యోగ ఫ్రంట్ చైర్మన్ చనగాని దయాకర్ చెబుతుండడం గమనార్హం.
(చదవండి: ఓయూ రగడ.. ఆగని అరెస్టులు)
Comments
Please login to add a commentAdd a comment