సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 19న రాష్ట్రానికి రానున్నారు. నెల వ్యవధిలోనే రెండోసారి తెలంగాణ పర్యటనకు వస్తున్న ప్రధానమంత్రి.. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. గత ఏడాది కాలంలో ప్రధాని తెలంగాణకు రావడం ఇది ఐదోసారి కావడం గమనార్హం. కాగా గత నవంబర్ 12న రామగుండంలో జరిగిన బహిరంగ సభలో కూడా ఆయన ప్రసంగించిన సంగతి తెలిసిందే.
తాజా రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధాని రూ.7,076 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 19న ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో వందేభారత్ రైలును (సికింద్రాబాద్–విశాఖపట్నం) మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభిస్తారు. అక్కడే సికింద్రాబాద్ స్టేషన్ ఆధునీకరణ పనులకు భూమిపూజ చేస్తారు. ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు.
అనంతరం అక్కడే బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మొత్తంగా చూస్తే వందేభారత్ రైలు, సికింద్రాబాద్– మహబూబ్‌నగర్ డబ్లింగ్ పనులు (రూ.1,410 కోట్ల వ్యయం), ఐఐటీ హైదరాబాద్‌లో చేపట్టిన వివిధ నిర్మాణాలు (రూ. 2,597 కోట్లు) కలిపి రూ.4,007 కోట్ల విలువైన ప్రాజెక్టులను మోదీ జాతికి అంకితం చేస్తారు. అలాగే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ (రూ.699 కోట్లు), కాజీపేట వర్క్ షాపు నిర్మాణం (రూ. 521 కోట్లు)తో పాటు మూడు జాతీయ రహదారుల విస్తరణ పనులు కలిపి మొత్తం రూ.3,069 కోట్ల విలువైన ప్రాజెక్టులకు భూమి పూజ చేస్తారని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జి.కిషన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ఎస్సీఆర్ అధికారులతో బీజేపీ నేతల భేటీ
మోదీ పర్యటన నేపథ్యంలో సోమవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సందర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు ఎంపీ డా.కె.లక్ష్మణ్ దక్షిణ మధ్య రైల్వే అధికారులతో సమావేశమయ్యారు. వందే భారత్ రైలుతో పాటు ఆరోజు ప్రధాని ప్రారంభించనున్న వివిధ కార్యక్రమాల ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం బండితో కలిసి లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర ప్రయోజనాలకు ప్రధాని పెద్దపీట
‘రాష్ట్ర ప్రయోజనాలకు ప్రధాని మోదీ పెద్ద పీట వేస్తున్నారు. ఇప్పటికే రూ.1.04 లక్ష కోట్ల వ్యయంతో తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణాన్ని కేంద్రం చేపట్టింది. ఈ విషయంలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానానికి చేరుకుంది. వందే భారత్ రైలుతో ప్రయాణికులకు మూడున్నర గంటల సమయం ఆదా కానుంది. మరోవైపు ప్రధానమంత్రి సడక్ యోజన కింద పెద్ద ఎత్తున రోడ్డు నిర్మాణ పనులు చేపడుతూ గ్రామాలను పట్టణాలతో అనుసంధానిస్తున్నారు. దీంతోపాటు నదుల అనుసంధాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
తెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించగా స్పందిస్తూ..‘నూతన సంవత్సర కానుకగా ప్రధాని తెలంగాణలో రైల్వే అభివృద్ధి పనుల కోసం రూ.2,400 కోట్లకుపైగా నిధులు ఖర్చు చేయబోతున్నారు. అబద్ధాలు ప్రచారం చేస్తున్న బీఆర్‌ఎస్ నాయకులకు ఈ పర్యటనతోనైనా కనువిప్పు కలగాలని కోరుకుంటున్నా..’ అని అన్నారు. అనంతరం రైల్వే ఉన్నతాధికారులతో కలిసి బండి సంజయ్, లక్ష్మణ్ పరేడ్ గ్రౌండ్స్‌ను సందర్శించారు. అక్కడ చేయాల్సిన వివిధ శంకుస్థాపనలు, ప్రారం¿ోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు గరికపాటి మోహన్‌రావు, చింతల రామచంద్రారెడ్డి తదితరులతో పాటు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment