పంచాయతీలకు ‘పవర్‌ షాక్‌’ | Power Shock To Panchayats | Sakshi
Sakshi News home page

పంచాయతీలకు ‘పవర్‌ షాక్‌’

Published Sun, Oct 25 2020 1:52 AM | Last Updated on Sun, Oct 25 2020 1:54 AM

Power Shock To Panchayats - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పంచాయతీలకు ప్రభుత్వం ‘పవర్‌’షాక్‌ ఇచ్చింది. వీధి దీపాల నిర్వహణ బాధ్యతల నుంచి గ్రామ పంచాయతీలను తప్పించింది. ఈ నిర్ణయంతో స్థానిక పాలకవర్గాలు.. ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతున్నాయి. పంచాయతీల నిర్ణయాధికారాలపై ప్రభుత్వ పెత్తనమేంటని మండిపడుతున్నాయి. కరెంట్‌ బిల్లుల భారం తగ్గించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించిన పంచాయతీరాజ్‌ శాఖ.. మున్సిపాలిటీల మాదిరి పంచాయతీల్లోనూ ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఎల్‌ఈడీ దీపాల సరఫరా, నిర్వహణలో సమర్థంగా పనిచేస్తున్న ఇంధన పొదుపు సేవా సంస్థ (ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీస్‌ లిమిటెడ్‌)తో 

ఒప్పందం చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 12,753 గ్రామపంచాయతీల్లో ఏడేళ్ల పాటు వీధి దీపాల నిర్వహణ బాధ్యతలను ఆ సంస్థకు అప్పగించింది. ఈ మేరకు ఈఈఎస్‌ఎల్‌ సంస్థతో త్రైపాక్షిక ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించింది. జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో), గ్రామ పంచాయతీలు, ఈఈఎస్‌ ఎల్‌ సంస్థల మధ్య త్రైపాక్షిక ఒప్పందం చేసుకునేందుకు అంగీకరించింది.

బల్బు మొదలు టైమర్‌ వరకు
ఒప్పంద కాలంలో ఎల్‌ఈడీ లైట్ల నిర్వహణ బాధ్యత పూర్తిగా సంస్థదే. బల్బుల బిగింపు, నిర్వహణ, ఇంధన పొదుపులో భాగంగా టైమర్లను కూడా సంస్థనే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే కరెంట్‌ బిల్లులను మాత్రం స్థానిక పంచాయతీలు చెల్లించాలి. నిధుల కొరతతో బిల్లులు చెల్లించలేని పరిస్థితుల్లో గ్రామపంచాయతీ ఉంటే బిల్లులను డీపీవో సర్దుబాటు చేయాలి. ఈఈఎస్‌ఎల్‌ సంస్థ పనితీరును క్రమం తప్పకుండా గ్రామపంచాయతీలు మదింపు చేయాలని, నేషనల్‌ లైట్స్‌ కోడ్‌ ప్రమాణాలకు అనుగుణంగా వీధి దీపాలను ఏర్పాటు చేశారో లేదో పరిశీలించాలని స్పష్టం చేసింది. పంచాయతీల్లో వీధి దీపాల నిర్వహణ పరిశీలనకు పంచాయతీరాజ్‌ కమిషనరేట్‌లో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సర్పంచ్‌లు..
ఈఈఎస్‌ఎల్‌ సంస్థకు పంచాయతీల్లోని వీధి దీపాల బాధ్యతలను కట్టబెట్టడాన్ని గ్రామపంచాయతీలు తప్పుపడుతున్నాయి. పంచాయతీరాజ్‌ చట్టం సెక్షన్‌–32 ప్రకారం పారిశుధ్యం, వీధి దీపాల నిర్వహణ అధికారాలు సర్పంచ్‌లకు ఉంటాయని, ఆ అధికారాలకు కత్తెర పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే ఈఈఎస్‌ఎల్‌ సంస్థ ఈ పనులు అప్పగించేందుకు అంగీకారం తెలుపుతూ తీర్మానాలు చేసేందుకు పంచాయతీలు ససేమిరా అంటున్నాయి. దీంతో తీర్మానాల కోసం సర్పంచ్‌లకు నచ్చజెప్పడం అధికారులకు తలనొప్పిగా మారింది. కాగా, ఈ నెల 28లోపు ఒప్పందాలు చేసుకోవాలని పంచాయతీరాజ్‌ శాఖ డెడ్‌లైన్‌ విధించింది. అయితే ఇప్పటివరకు సిద్దిపేట, రంగారెడ్డి, నారాయణపేట, జనగామ జిల్లాలు మాత్రమే ఈ మేరకు ఒప్పంద పత్రాలు పంపాయి. మిగతా జిల్లాల్లో ఇప్పటికీ పంచాయతీల్లో తీర్మానాల ప్రక్రియ పూర్తి కాకపోవడంతో పంచాయతీరాజ్‌ అధికారులు తలపట్టుకుంటున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement