సాక్షి, హైదరాబాద్: దేశ ప్రప్రథమ పౌరురాలు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. బుధవారం ఆయా జిల్లాల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారామె. ఇక పర్యటన ముగియడంతో ఆమె హైదరాబాద్‌కు బయల్దేరారు. ఉదయం భద్రాచలం సీతారాములవారిని దర్శించుకుని,ఆపై మధ్యాహ్నా సమయంలో ములుగు రామప్పను ఆమె సందర్శించారు. ఆమె వెంట గవర్నర్ తమిళిసైతో పాటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పలువురు తెలంగాణ మంత్రులు ఉన్నారు.
సాక్షి, ములుగు జిల్లా: యునెస్కో గుర్తింపు పొందిన రామప్పను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించారు . కాకతీయుల కళానైపుణ్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచే రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఆమె పూజలు చేశారు. రాష్ట్రపతి వెంట ఆమె కుటుంబ సభ్యులతో పాటు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్‌లు ఉన్నారు.
హెలిప్యాడ్ నుంచి రామప్ప స్టోన్ గేట్ వరకు కాన్వాయ్ వాహనంలో వచ్చారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆపై స్టోన్ గేట్ నుంచి రామప్ప ఆలయానికి కాలినడకన చేరుకున్నారు. అనంతరం.. రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు.రామప్ప ఆలయ ఆవరణలో ‘ప్రసాద్’ స్కీమ్ కింద రూ. 62 కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. యునెస్కో గుర్తింపు లో భాగంగా కామేశ్వరాలయం పునర్నిర్మాణంకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా భూమిపూజ జరిగింది.
యునెస్కో గుర్తింపులో.. ఈ కామేశ్వరాలయం పునర్నిర్మాణమే కీలకంగా మారింది. వేయి స్థంభాల మండపం తరహాలో 33 మీటర్ల పొడవు, 33 మీటర్ల వెడల్పుతో మహామండపం నిర్మాణం జరనుంది. 2023 జూన్ వరకు ప్రదక్షిణ పథం వరకు, 2026 మార్చి నాటికి కక్షాసనతో పూర్తి పునరుద్దరణ చేస్తారు. అలాగే.. 3 మీటర్ల లోతు నుంచి సాండ్ బాక్స్ పరిజ్ఞానంతో పునాదుల నిర్మాణం జరగనుంది. 8 శతాబ్దాల కిందట ఆలయం నిర్మించినప్పుడు వాడిన ఇసుకనే ఇప్పుడు వాడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం భద్రాచలం చేరుకున్నారు. రాజమండ్రి నుంచి వాయుమార్గం ద్వారా ఉదయం భద్రాచలం చేరుకున్నారు. ఐటీసీలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ దగ్గర రాష్ట్రపతికి మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్,సత్యవతి రాథోడ్ స్వాగతం పలికారు. అనంతరం శ్రీ సీతా లక్ష్మణ సమేత భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో అర్చకులు, వేద పండితులు రాష్ట్రపతికి స్వాగతం పలికారు. భద్రాచలం ఆలయంలో ముర్ము ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ప్రసాద పథకం కింద చేపట్టిన పలు అభివృద్ధి పనులకు రాష్ట్రపతి శంకుస్థాపన చేశారు. సుమారు 3:45 గంటల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం హెలికాప్టర్‌లో ములుగు జిల్లాలోని రామప్పకు బయలుదేరుతారు.
కాగా రాష్ట్రపతి పర్యటన సందర్భంగా 350 మంది అధికారులు విధుల్లో ఉండగా, రెండు వేల మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లతో నిమగ్నమయ్యారని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఉదయం 7 గంటల నుంచే భద్రాచలంలో ప్రజల రాకపోకలపై ఆంక్షలు ఉంటాయని, అనవసరంగా ఎవరూ రోడ్లపైకి రావద్దని సూచించారు.
భారీ కాన్వాయ్
రాష్ట్రపతి పర్యటన సందర్భంగా మునుపెన్నడూ చూడనంత భారీ కాన్వాయ్ గోదావరి వంతెనపై కనిపించనుంది. మంగళవారం నిర్వహించిన మాక్‌డ్రిల్‌లోనే ఏకంగా 70కి పైగా వాహనాలతో కూడిన కాన్వాయ్ ఐటీసీ క్యాంపస్ నుంచి ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. ఇక బుధవారం రాష్ట్రపతితో పాటు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు అంతా కలిస్తే వందకు పైగా వాహనాలతో కూడిన అతి భారీ కాన్వాయ్ భద్రాచలంలో సైరన్ మోగిస్తూ పరుగులు పెట్టనుంది. అయితే, ఆలయ తూర్పు ముఖద్వారం వరకు రాష్ట్రపతి, ఆమె వ్యక్తిగత భద్రతా సిబ్బంది వాహనాలకే అనుమతి ఇవ్వనున్నట్టు సమాచారం. మిగిలిన వీఐపీల వాహనాలను మిథిలా స్టేడియం వరకే అనుమతించనున్నారు.
15 రకాల వంటకాలు
భద్రాచలం పర్యటన సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఐటీసీ గెస్ట్‌హౌస్‌లో మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి కోసం 15 రకాల శాకాహార వంటలను సిద్ధం చేస్తున్నారు. ఉల్లిపాయ, చామగడ్డ, చింతపండు, అనపకాయలు ఉపయోగించకుండా వంటలు చేయాలని చెఫ్‌లకు ప్రత్యేక ఆదేశాలు అందాయి.
రాష్ట్రపతి పర్యటన ఇలా..
►ఉదయం 9 గంటలకు రాజమండ్రి నుంచి హెలీకాప్టర్‌లో బయలుదేరనున్న రాష్ట్రపతి సారపాక ఐటీసీలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌కు 9.50గంటలకు చేరుకుంటారు. రాజమండ్రి నుంచి సారపాక వరకు నడుమ 186 కి.మీ. మేర వాయుమార్గంలో ప్రయాణానికి 50 నిమిషాలు పడుతుందని షెడ్యూల్‌లో పొందుపర్చారు.
►10 గంటలకు హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గం ద్వారా 10:10 గంటలకు భద్రాచలం రామాలయ ప్రాంగణానికి చేరుకుంటారు.
►ఆలయ ప్రాంగణంలో ఉదయం 10:10 గంటల నుంచి 10:15 గంటల వరకు ఐదు నిమిషాలు రిజర్వ్ టైంగా కేటాయించారు.
► ఉదయం 10:15 గంటలకు లక్ష్మణ సమేత సీతారాముల దర్శనానికి రాష్ట్రపతి వెళ్తారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలోనే ‘ప్రసాద్’ పనులకు శంకుస్థాపన చేస్తారు.
►10:30 గంటలకు ఆలయం నుంచి బయలుదేరి 2 కి.మీ. దూరంలో ఉన్న శాంతినగర్‌లోని వీరభద్ర ఫంక్షన్ హాల్‌కు చేరుకుంటారు. అక్కడ ఐదు నిమిషాల పాటు రిజర్వ్ టైం కేటాయించారు.
►10:45 గంటల నుంచి 11:30 గంటల వరకు వనవాసీ కళ్యాణ పరిషత్ ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన సమ్మక్క – సారలమ్మ జన్‌జాతి పూజారి సమ్మేళనంలో పాల్గొంటారు. ఈ సమ్మేళనం తర్వాత అక్కడి నుంచే కుమురంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్ జిల్లాల్లో నిర్మించిన ఏకలవ్య గురుకుల పాఠశాలను వర్చువల్‌గా ప్రారంభిస్తారు.
►1:30 గంటలకు వీరభద్ర ఫంక్షన్ హాల్ నుంచి బయలుదేరి 11:40 గంటలకు ఐటీసీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు.
►ఉదయం 11:45 గంటల నుంచి మధ్యాహ్నం 1:15 గంటల వరకు భోజనానికి కేటాయించారు.
►మధ్యాహ్నం 1:15 గంటలకు గెస్ట్‌హౌస్ నుంచి బయలుదేరి 1:25 గంటలకు హెలిప్యాడ్‌కు చేరుకున్నాక మంత్రి పువ్వాడతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు వీడ్కోలు పలుకుతారు
►మధ్యాహ్నం 1:35 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరనున్న రాష్ట్రపతి 160 కి.మీ. దూరంలో ఉన్న ములుగు జిల్లా రామప్పకు మధ్యాహ్నం 2:20 గంటలకు చేరుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment