సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వైన్‌షాపుల నిర్వహణ కోసం రానున్న రెండేళ్ల కాలానికి లైసెన్సులు పొందేందుకు గాను చేపట్టిన దరఖాస్తుల ప్రక్రియ గతంతో పోలిస్తే తడబడుతూ ముందుకెళుతోంది. 2023–25 సంవత్సరాలకు గాను వైన్‌షాపులకు లైసెన్సులను లాటరీ పద్ధతిలో కేటాయించేందుకు గాను ఈనెల 4వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా, ఎనిమిదో రోజు శుక్రవారం ముగిసేనాటికి 15వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ గణాంకాలు చెపుతున్నాయి.
అదే గత ఏడాది తొలి ఎనిమిది రోజుల్లో 14,500 వరకు దరఖాస్తులు రావడం గమనార్హం. తొలి ఏడు రోజుల్లో ఈసారి 8వేల వరకు దరఖాస్తులు రాగా, గతంలో 9వేల వరకు వచ్చాయి. గతంతో పోలిస్తే తొలి వారంలో దరఖాస్తుల సంఖ్య తగ్గినా, శుక్రవారం చివరి నిమిషంలో పెద్ద ఎత్తున వచ్చిన దరఖాస్తులతో ఎౖMð్సజ్ యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది.
అయితే, గతంలో షెడ్యూల్ ఇచ్చిన తర్వాత దరఖాస్తుల ప్రక్రియ కోసం 10 రోజులు సమయం ఇవ్వగా, ఈసారి 12 రోజులు సమయం ఇచ్చారు. రెండో శనివారం అయినప్పటికీ 12వ తేదీన కూడా దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఆదివారం, ఆగస్టు 15 సెలవు దినాలు కావడంతో మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో 16,17,18 తేదీల్లో భారీగా దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి.
గత రెండేళ్ల కాలానికి గాను మొత్తం 68 వేలకు పైగా దరఖాస్తులు రాగా, దరఖాస్తు రుసుంతో పాటు తొలి వాయిదా ఎక్సైజ్ ఫీజు కలిపి మొత్తం రూ.1,691 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. అయితే, ఈసారి ఆ స్థాయిలో దరఖాస్తులు వస్తాయా రావా అన్న మీమాంసలో ఎక్సైజ్ వర్గాలుండడం గమనార్హం.
రెండు పిల్‌లు, రెండు రిట్‌లు
ఇక, మద్యం దుకాణాల కేటాయింపుపై గతం నుంచీ నాలుగు కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. వైన్‌షాపుల కేటాయింపులో రిజర్వేషన్లు అమలు చేయడంపై రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, మరో రెండు రిట్ పిటిషన్‌లు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి. దీనికి తోడు ఈసారి మరో రెండు కేసులు కోర్టుల్లో నమోదయ్యాయి.
కొత్తగూడెం ఏరియాలోని కొన్ని దుకాణాలు షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నప్పటికీ గిరిజనులకు వాటికి కేటాయించకుండా జనరల్ కేటగిరీలో చూపెట్టారని ఒక పిటిషన్ దాఖలు కాగా, గిరిజనులకు రిజర్వేషన్లు కేటాయించడంలో రాష్ట్రమంతటా ఒకే విధానాన్ని పాటించడం లేదంటూ మరొక పిటిషన్ ఈసారి దాఖలు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో కోర్టులు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తాయోననే ఆసక్తి కూడా అటు ఎక్సైజ్ వర్గాల్లోనూ, ఇటు మద్యం వ్యాపారుల్లోనూ వ్యక్తమవుతుండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment