ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేవారు రోజుల తరబడి ముభావంగా మారిపోయారనుకోండి.. అతడు లేదా ఆమె మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు లెక్క! అంతేకాదు.. మామూలు రోజుల్లో ఆడుతూ పాడుతూ చేసే పనులను కూడా అయిష్టంగానో, తప్పదన్న ట్టుగానో చేస్తున్నా, అవసరానికి మించి లేదా చాలా తక్కువగా నిద్రపోతున్నా, బకాసురుడి పెద్దన్నలా అతిగా తింటున్నా, 2,3 ముద్దలతోనే ఇక చాలు అనేస్తున్నా.. ఏవో మానసిక సమస్యలే ఉన్నట్లు భావించాలని మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ లక్షణాలే కాదు.. ఇంకా బోలెడన్ని ఉన్నాయి. మద్యం, ధూమపానాలను మొదలుపెట్టినా, ఎక్కువ చేసినా, రోజువారీ పనులు పూర్తి చేసుకోవడంలో విపరీతమైన బద్దకం ప్రదర్శిస్తున్నా, అయిష్టత చూపినా మానసిక సమస్యల బాధితులే. ఈ లక్షణాలన్నీ పెద్దగా హాని కరం కాకపోవచ్చు. కానీ ఇతరులను గాయపరచడం లేదా తనను తాను గాయపరచు కోవడం వంటివి తీవ్రమైన మానసిక సమస్యలకు సూచికగా భావించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎవరికీ వినిపించని శబ్ధాలు తమకే వినిపిస్తున్నాయని ఎవరైనా చెబుతున్నా, లేదా ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టుగా కనిపిస్తున్నాయని చెబుతున్నా, భ్రాంతికి గురవుతు న్నామన్నా అనుమానించాల్సిందేనని మానసిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
వైద్యులతో సంప్రదింపుల తర్వాతే నిర్ధారణ
మనిషన్నాక కష్టసుఖాలు ఉండవా? వాటికి స్పందించకుండా ఎలా ఉండటం? అని అనుకుంటున్నారా? అది కూడా నిజమే. అందుకే కేవలం భౌతికపరమైన లక్షణాలను మాత్రమే ఆధారంగా చేసుకుని ఒక వ్యక్తికి మానసిక సమస్య ఉన్నట్లు నిర్ధారణకు రాలేం. శాస్త్రీయ పద్ధతుల్లో పరీక్షలు జరపాల్సి ఉంటుంది. అయితే ఇవి, కనిపించే లక్షణాలకు ఇతర కార ణాలు ఏవీ లేవని నిర్ధారించుకునేందుకు మాత్ర మే చేస్తారు.
ఇంకోలా చెప్పాలంటే మానసిక సమస్యలను నిర్ధారించేందుకు నిర్దిష్ట పరీక్షలేవీ లేవు. మానసిక వైద్యులతో సంప్రదింపులు జరిపిన తరువాత మాత్రమే ఈ విషయంలో కచ్చితమైన నిర్ధారణకు రాగలమంటున్నారు ప్రముఖ సైక్రియాటిస్ట్ డాక్టర్ గౌరవ్ గుప్తా. అలాగే వారి మానసిక స్థితిని, ఆలోచనల తీరు తెన్నులను అర్థం చేసుకునేందుకు సైకలాజికల్ ఎవాల్యుయేషన్ (మానసిక స్థితిని అంచనా వేయడం) చేపడతామని, రకరకాల ప్రశ్నలు వేసి వాటి సమాధానాలను విశ్లేషించడం ద్వారా ఏ రకమైన చికిత్చ చేయవచ్చన్న నిర్ధారణకు వస్తామని ఆయన తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా మనో సమస్యల నిర్ధారణ కోసం అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ రూపొందించిన ‘డయాగ్నస్టిక్ అండ్ స్టాటస్టికల్ మాన్యు వల్ ఆఫ్ మెంటల్ హెల్త్ (డీఎస్‌ఎం–5)ను సంబంధిత నిపుణులు ఉపయోగిస్తుంటారు.
మంత్రాలతో అయ్యే పనికాదు..
మానసిక సమస్యల చికిత్సకు మంచి మాట ఎంత ఉపయోగ పడుతుందో, మందులూ అంతే బాగా పనికొస్తాయి. కాకపోతే ఏది ఎప్పుడు వాడాలన్న విచక్షణ ఉండాలి. మందులు, మాటలు మాత్రమే కాకుండా మానసిక సమస్యలను సరి చేసుకునేందుకు బోలెడన్ని మార్గాలున్నాయి. అయితే ఈ అంశాల విషయంలో చికిత్స ఎవరికి వారికే ప్రత్యేకం. ఒకరికి వాడిన పద్ధతి ఇంకొకరికి పనిచేస్తుందన్న గ్యారంటీ లేదు. కొన్నిసార్లు ఒకటి కంటే ఎక్కువ పద్ధతులను కలిపి వాడటం మరింత ప్రభావశీలిగా పనిచేస్తుంది. మంత్రాలు, తంత్రాలతోనో, తాయత్తులు తావీదులతోనో అయ్యే పని అస్సలు కాదు.
మాటలతో పరిష్కరించే సైకాలజిస్టులు
సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు, సైకోథెరపిస్టులు ముగ్గురూ మానసిక సమస్యల వైద్యులే. ముగ్గురూ మానసిక సమస్యల పరిష్కారం కోసమే పనిచేçస్తుంటారు. కానీ విధివిధానాలు పూర్తిగా వేర్వేరు.మందులు కాకుండా కేవలం మాటల ద్వారా, కొన్ని ప్రత్యేక పద్ధతుల సాయంతో మానసిక సమస్యలను పరిష్కరించేవారు సైకాలజిస్టులు. కౌన్సెలింగ్, హిప్నాసిస్, ఎన్‌ఎల్‌పీ వంటి వాటి ద్వారా చికిత్స అందిస్తారు. మందులు అస్సలు ఇవ్వరు. చట్టం ప్రకారం ఇవ్వకూడదు కూడా.
థెరపీలతోనూ సత్ఫలితాలు
కాగ్నెటివ్ బిహేవియరల్ థెరపీ, ఎక్స్‌పోజర్ థెరపీ, డయలెక్టికల్ బిహేవియరల్ థెరపీ వంటి పద్ధతులను సైకోథెరపిస్టుల ఉపయోగిస్తుంటారు. మన ఆలోచనల్లో మార్పులు తీసుకొచ్చి, మన ప్రవర్తనను సరిచేసి సమస్యను పరిష్కరించడం కాగ్నెటివ్ బిహేవియరల్ థెరపీ. ఇందులోనే కొంచెం భిన్నమైన పద్ధతులను ఉపయోగించే ఇంకో చికిత్సా పద్ధతి డయలెక్టికల్ బిహేవియరల్ థెరపీ. ఇక ఎక్స్‌పోజర్ థెరపీ విషయానికి వస్తే, ఇందులో సమస్యకు అసలు కారణాన్ని దశలవారీగా పరిచయం చేస్తూ పరిష్కారం వెతకడం. ఉదాహరణకు బల్లి అంటే భయముంటే, ముందుగా బల్లి బొమ్మను చూపి ఆ తరువాత రబ్బరు బల్లిని ముట్టు కోమని, ఆ తరువాత అసలు బల్లిని చూపడం చేస్తారు. ఈ క్రమంలో బల్లి అంటే ఉండే భయం తొలగిపోతుంది.
డ్రగ్స్, మద్యం, ధూమపానంతోనూ సమస్యలు
మన తల్లిదండ్రులు, ముందుతరాల నుంచి మనకు వచ్చే జన్యువులు, బాహ్య ప్రపంచంలో ప్రభావం చూపే అంశాలు మానసిక వ్యాధులకు ప్రధాన కారణం. జీవనశైలి అలవాట్లు వంటివి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. డ్రగ్స్, మద్యం, పొగ తాగడం, ఇతర అలవాట్లు ఇందులో ముఖ్యమైనవి. కుటుంబంలో లేదా ఉద్యోగం చేస్తున్న చోట పరిస్థితులు, పరిణామాలపై ఎలా స్పందిస్తున్నారన్న దాన్నిబట్టి మానసిక ఒత్తిడిని అంచనా వేయొచ్చు.
ఏదైనా సమస్య తలెత్తిన ప్రతిసారీ భయపడి వెనుకంజ వేయడం, లేక ఆవేశంగా స్పందించడం వంటివి ప్రతికూల అంశాలే. నేటి జీవన విధానంలో ఒత్తిడిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలన్నది నేర్చుకోవాలి. ఎవరైనా ఎప్పటిలా కాకుండా భిన్నంగా వ్యవహరిస్తున్నారని తెలుసుకుని మానసిక నిపుణుడి దగ్గరకు తీసుకువెళితే వారు తిరిగి సాధారణ జీవనం సాగించే అవకాశం ఉంటుంది.
స్వసహాయం కూడా..
మానసిక సమస్యలను పరిష్కరించుకునేందుకు ఉన్న ఇంకో పద్ధతి స్వసహాయం.అంటే మనకు మనమే సాయం చేసుకోవడం. సమస్యకు కారణాలను గుర్తించడం, పరిష్కారానికి ఉన్న మార్గాలను చిత్తశుద్ధితో అమలు చేయడం, అవసరమైనప్పుడు ఇతరుల సాయం తీసుకోవడం వంటివి ఈ స్వసహాయ పద్ధతిలో చేసే పనులు.
మందులిచ్చేది సైకియాట్రిస్టులే
మానసిక సమస్యలకు మందులు ఇవ్వగలిగిన వారు సైకియాట్రిస్టులు మాత్రమే. మనోవ్యాకులతను దూరం చేసేందుకు వీరు యాంటీ సైకాటిక్స్, ఆంగ్జియోలిటిక్ మందులను వాడతారు వీరు. ఆసక్తికరంగా ఇవేవీ సమస్యకు చికిత్స అందించవు. కాకపోతే లక్షణాలు మెరుగుపడేందుకు ఉపయోగపడతాయి అంతే. మనకు ఆనందాన్ని కలుగజేసే సెరటోనిన్ వంటి రసాయనాలు శరీరానికి బాగా ఒంటబట్టేలా చేస్తాయి ఈ మందుల్లో కొన్ని.
సకాలంలో స్పందించకపోతే సమస్య తీవ్రం
చేస్తున్న పనులను ఇష్టపూర్వకంగా చేయకపోవడం, కావాల్సిన నైపుణ్యాలు ఉన్నాయా లేదా అని సరిచూసుకోలేకపోవడం, ఆలోచనలు భావోద్వేగంతో కూడుకున్నవి కావడం.. ఇలాంటివి ఎవరిలో ఉన్నా వారికి మానసిక నిపుణుల చేత చికిత్స చేయించాలి. ఇతరులతో పోల్చి చూసుకుని బాధపడడం, తమ జీవితం ఏమై పోతుందోననే అనవసర ఆందోళన, ఆదుర్దా పడుతున్న వారు మానసిక అనారోగ్యానికి గురైనట్టు లెక్క.
ఇలాంటి వారు మానసిక ఒత్తిళ్ల బారిన పడుతున్నారని గుర్తించి, వాటి పరిష్కార మార్గాలు అన్వేషించకపోవడం వల్ల సమస్య మరింత పెరుగుతుంది. ఏ వ్యక్తి అయినా ఒత్తిళ్లతో ఎక్కువ రోజులు ఉంటే మెదడులోని కెమికల్ కాంపోజిషన్ దెబ్బతిని, న్యూరో ట్రాన్స్‌మీటర్ల పనితీరుపై ప్రభావం చూపి మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇలాంటి వారికి సకాలంలో చికిత్స అందించగలిగితే తేలిగ్గా బయటపడుతారు.
-కంచర్ల యాదగిరిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment