ఏయూ క్యాంపస్/డాబాగార్డెన్స్: ప్రపంచ ప్రఖ్యాత గణాంక, గణిత శాస్త్రవేత్త డాక్టర్ సీఆర్ రావు (102) కన్నుమూశారు. అమెరికాలో ఉన్న ఆయన అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. 1920 సెపె్టంబర్ 10న కర్ణాటకలోని బళ్లారి జిల్లా హడగళిలో కల్యంపూడి రాధాకృష్ణా రావు (సీఆర్ రావు) తెలుగు కుటుంబంలో జన్మించారు. తర్వాత ఏపీలోని గూడూరు, నూజివీడు, నందిగామల్లో ఆయన బాల్యం గడిచింది. విశాఖలోని ఏవీఎన్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. 1940లో ఏయూలో గణిత శాస్త్రం అభ్యసించారు.
అనంతరం యూనివర్సిటీ ఆఫ్ కోల్‌కతాలో ఎంఏ స్టాటస్టిక్స్ చేశారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని కింగ్స్ కాలేజీలో 1948లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఇండియన్ స్టాటస్టికల్ ఇన్‌స్టిట్యూట్‌లో విద్యార్థిగా చేరి అదే సంస్థకు డైరెక్టర్‌గా ఎదిగారు. అక్కడ పదవీ విరమణ చేసిన అనంతరం అమెరికాలో స్థిరపడి అక్కడ యూనివర్సిటీ ఆఫ్ బఫెలోలో రీసెర్చ్ ప్రొఫెసర్‌గా సేవలందించారు. ఆయన 19 దేశాల నుంచి 39 డాక్టరేట్లు అందుకున్నారు. 477 పరిశోధన పత్రాలను సమర్పించారు. 15 పుస్తకాలు రాశారు.
2002లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జిబుష్ చేతుల మీదుగా ఆ దేశ అత్యున్నత నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ పురస్కారాన్ని అందుకున్నారు. యూకే ఇంటర్నేషనల్ స్టాటస్టికల్ ఇన్‌స్టిట్యూట్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ బయోమెట్రిక్ సొసైటీకి అధ్యక్షుడిగా పనిచేశారు. భారత స్టాటస్టిక్స్ రంగానికి ఆయన చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఆయనను 1968లో పద్మభూషణ్, 2001లో పద్మవిభూషణ్‌తో సత్కరించింది. ఎన్‌ఎస్ భటా్నగర్ పురస్కారాన్ని కూడా సీఆర్ రావు అందుకున్నారు. ఆయన 2020 సెప్టెంబర్ 10న 100వ పుట్టినరోజును జరుపుకున్నారు.
స్టాటస్టిక్స్‌లో నోబెల్ అంతటి గౌరవం
సీఆర్ రావుకు 75 ఏళ్ల కిందట గణాంక రంగంలో విప్లవాత్మకమైన ఆలోచనలకు బీజం వేసినందుకు గాను ఆ రంగంలో నోబెల్ బహుమతికి సమానమైన ఇంటర్నేషనల్ ప్రైజ్ ఆఫ్ స్టాటస్టిక్స్–2023 అవార్డును అందజేశారు. 102 ఏళ్ల వయసులో ఈ ఏడాదే ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
1945లో కోల్‌కతా మ్యాథమెటికల్ సొసైటీలో ప్రచురితమైన సీఆర్ రావు పరిశోధన పత్రానికి ఈ అవార్డు దక్కింది. ఆయన చేసిన కృషి..ఇప్పటికీ సైన్స్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతూ ఉందని ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటస్టిక్ ఫౌండేషన్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment