ఐటీడీఏ సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి సత్యవతి రాథోడ్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: పోడు భూముల అంశంపై అధికార పార్టీ ఎమ్మెల్యేల నుంచి మంత్రులకు ఊహించని పరిణామం ఎదురైంది. పోడు భూముల్లో అటవీ అధికారులు కందకాలు తీయడం, మొక్కలు నాటడం వంటి పనులతో గిరిజనులను ఇబ్బంది పెడుతున్నారని వారు గళం విప్పారు. అధికారుల తీరుతో తాము ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. భద్రాచలంలో శుక్రవారం జరిగిన ఐటీడీఏ పాలకమండలి వేదికగా పోడు భూములపై వాడీ వేడి చర్చ జరిగింది.
ఆవేదనతో చెబుతున్నా: వనమా
పోడు భూములకు పట్టాల అంశంపై చర్చ సందర్భంగా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. పోడు రైతులను ఇబ్బంది పెట్టొద్దని సీఎం కేసీఆర్ చెప్పారని తాము అటవీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. వారు ఖాతరు చేయడం లేదన్నారు. ఒకవైపు టీఆర్‌ఎస్‌ది ప్రజా ప్రభుత్వంగా చెప్పుకుంటుంటే అటవీ అధికారులు గిరిజనులను, గ్రామీణ ప్రాంత ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని, దీనిపై మంత్రులు స్పందించాలని డిమాండ్ చేశారు.
అడవి నుంచి కనీసం రోడ్డు నిర్మాణాలకు కూడా అనుమతి ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన నియోజకర్గంలో పలు రోడ్లకు రూ.50 కోట్ల వరకు నిధులు మంజూరైనా అటవీ శాఖ అడ్డంకులతో పనులు జరగడం లేదన్నారు.
రెవెన్యూ సదస్సుల్లో పరిష్కరిస్తాం: సత్యవతి రాథోడ్
పోడు అంశంపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పందిస్తూ.. పోడు భూములకు పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయితే లబ్ధిదారులను గుర్తించడంలో అనేక సమస్యలు ఉన్నందున ఆలస్యం అవుతోందన్నారు. దీనిపై ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ సీఎం కేసీఆర్‌కు నివేదిక అందించిందని తెలిపారు. ఈనెల 11న ముఖ్యమంత్రితో జరిగే సమావేశంలో ఈ అంశాన్ని చర్చిస్తామని, 15 నుంచి జరిగే రెవెన్యూ సదస్సుల్లో ఈ సమస్యకు పరిష్కారం చూపేలా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.
ట్రెంచ్‌లు కొట్టొద్దు: పువ్వాడ
పోడు భూములకు యాజమాన్య హక్కులు కల్పించే అంశంపై సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. వివాదం లేని పోడు భూముల జోలికి వెళ్లొద్దని ఆయన అటవీ శాఖకు సూచించారు. ఎక్కడైనా సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించి ట్రెంచ్‌లు కొడితే ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించినట్టుగా పరిగణిస్తామ న్నారు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ.. పంటలు వేసిన తర్వాత ట్రెంచ్‌లు కొట్టడం, ప్లాంటేషన్ చేయడం వల్ల ఈ సమస్య జటిలంగా మారుతోందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment