సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలోనూ.. ఆ తర్వాత తెలంగాణ ఏర్పడ్డాక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏనాడూ విమర్శలు ఎదుర్కొలేదు. కానీ, ఏడాది కాలంగా మాయని మచ్చ మీదేసుకుంది. ఇంటి దొంగల చేతివాటంతో మొదలైన పేపర్ లీకేజీ వ్యవహారం.. రాజకీయ పరిణామాలు, నిరుద్యోగుల్లో పెల్లుబిక్కిన అసంతృప్తి.. చివరకు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రభావం చూపించాయి. అయితే నాడు ప్రతిపక్షం హోదాలో టీఎస్‌పీఎస్సీ బోర్డు ప్రక్షాళన కోరిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు అధికారం చేపట్టాక ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ జనార్ధన్‌రెడ్డి తన రాజీనామాను సోమవారం గవర్నర్‌కు సమర్పించారు. సమీక్షకు రావాలంటూ సీఎంవో నుంచి పిలుపు అందుకున్న ఆయన.. గంటల వ్యవధిలోనే సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి ఆపై రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కానీ, రాజీనామాను ఆమోదించకుండా గవర్నర్ తమిళిసై ట్విస్ట్ ఇవ్వడంతో.. ఉత్కంఠ కొనసాగుతోంది.
మరోవైపు తాజాగా TSPSC బోర్డు సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ రాజీనామా చేశారు. తప్పు చేయకున్నా.. బోర్డు సభ్యుడిగా మానసిక క్షోభను అనుభవించామని, బోర్డు సభ్యులపై ముప్పేట విమర్శ దాడి జరుగుతోందని.. గుంపగుత్తగా దోషులిగా చిత్రీకరించే యత్నం జరుగుతోందంటూ ఆవేదనపూరితమైన ప్రకటనతో తన రాజీనామా ప్రకటించారాయన.
మేమేం చేశాం?
సాధారణంగా బోర్డు సభ్యుల ఎంపిక రాజ్యాంగబద్ధంగా జరుగుతుంది. అలాగే తొలగింపు కోసం కూడా ఒక పద్ధతి ఉంటుంది. అయితే ఇప్పుడున్న తమలో వ్యక్తిగతంగా ఎవరిపైనా ఆరోపణలు రాలేదన్నది సభ్యుల వాదన. కనీసం విచారణ కూడా జరపకుండా బోర్డు నుంచి తొలగించాలని.. ప్రక్షాళన చేయాలని పౌర సమాజంతో పాటు మేధోవర్గం నుంచి కూడా వస్తున్న డిమాండ్లను వాళ్లు భరించలేకపోతున్నారట. ఏకపక్షంగా జరుగుతున్న విమర్శల దాడి.. బోర్డు సభ్యుల తొలగింపు ఉండబోతుందన్న సంకేతాల నేపథ్యంలోనే తాము మనోవేదనకు గురవుతున్నట్లు చెబుతున్నారు వాళ్లు.
మూకుమ్మడి రాజీనామాలు..?
ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు, రాతపరీక్షలు, ప్రశ్నపత్రాల లీకేజీ, తదుపరి నియామక ప్రక్రియను సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయంలో సమీక్షించారు. అయితే.. బోర్డు సభ్యులు ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. కమిషన్ సభ్యులుగా రాజీనామాలపైనే ఆయనతో వాళ్లు చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు రాజ్‌భవన్ అపాయింట్‌మెంట్ కోరడంతో.. సభ్యులు మూకుమ్మడిగా తమ రాజీనామాల్ని గవర్నర్‌కు అందజేస్తారనే ప్రచారం ఊపందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment