
కేంద్రమంత్రి మాండవీయ నుంచి అవార్డు అందుకుంటున్న మంత్రి రజిని, వైద్య శాఖ అధికారి కృష్ణబాబు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలో ఏపీలో వైద్య, ఆరోగ్య రంగం అభివృద్ధికి రూ.16 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి 5 వేల మందికి ఒక సబ్ సెంటర్ ఉండాలని చెబితే, ఏపీలో ప్రతి 2 వేల జనాభాకు ఒక హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు.
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనల ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లో వైద్య రంగం అద్భుత ప్రగతి సాధించిందని ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా, భవిష్యత్‌లోనూ సాధ్యం కాదనేలా విప్లవాత్మక మార్పులు తెచ్చారని అన్నారు. ఆయన ఉన్నత లక్ష్యాలు పేదలకు ఎంతో మేలు చేస్తున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో యూనివర్సల్ హెల్త్ కవరేజీ డే వేడుకలను శనివారం వారణాసిలో ప్రారంభించారు.
కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, పలు రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూడు అంశాల్లో రాష్ట్రాలకు కేంద్రం అవార్డులు ప్రకటించగా రెండింటిని ఏపీ సాధించింది. వేడుకల్లో భాగంగా ‘ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్–15వ ఆర్థిక సంఘం నిధులు’ అంశంపై జరిగిన మంత్రుల చర్చా గోష్టిలో విడల రజిని ప్రసంగించారు.
ఏపీలో వైద్య ఆరోగ్య రంగంలో అమలు చేస్తున్న సంస్కరణలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం మూడు విభాగాల్లో అవార్డులు ప్రకటించగా.., ఏకంగా రెండింటిని ఏపీ సాధించడం సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధికి నిదర్శనమని తెలిపారు. ఏపీ ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ఎంతో కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో మెడికల్ కళాశాలల నిర్మాణం, క్యాన్సర్, కిడ్నీ వ్యాధికి చికిత్స అందించే విషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని ఆకాంక్షించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలో ఏపీలో వైద్య, ఆరోగ్య రంగం అభివృద్ధికి రూ.16 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి 5 వేల మందికి ఒక సబ్ సెంటర్ ఉండాలని చెబితే, ఏపీలో ప్రతి 2 వేల జనాభాకు ఒక హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. గ్రామీణ వైద్య విభాగం బలోపేతానికి 10,032 వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీటి ద్వారా 14 రకాల వైద్య పరీక్షలు, 67 రకాల మందులను ప్రభుత్వమే గ్రామీణులకు ఉచితంగా అందిస్తోందన్నారు. టెలీ మెడిసిన్ ద్వారా పేదలకు ఉచితంగా స్పెషలిస్టు వైద్య సేవలను అందిస్తోందని, రోజూ 60 వేల కాల్స్ వస్తున్నాయని తెలిపారు.
దేశ చరిత్రలో తొలిసారిగా ఫ్యామిలీ ఫిజిషియన్ విధానాన్ని రాష్ట్రంలో తెచ్చామని చెప్పారు. దీని ద్వారా గ్రామీణులకు స్థానికంగానే ఉచితంగా ఓపీ సేవలు, వైద్య పరీక్షలు, మందులు అందుతున్నాయని వివరించారు. ప్రాథమిక ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు రూ.2,750 కోట్లు, సెకండరీ వైద్య విభాగానికి రూ.1,223 కోట్లు, టెర్షియరీ వైద్య విభాగం మెరుగుకు రూ.12,500 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు వివరించారు. 2007లోనే అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిష్టాత్మకంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చారని, సీఎం వైఎస్ జగన్ ఈ పథకాన్ని మరింత సమర్ధవంతంగా అమలు చేస్తున్నారని చెప్పారు.
ఈ పథకం ద్వారా నిజమైన హెల్త్ కవరేజిని ఏపీ సాధించిందని తెలిపారు. ఆరోగ్య శ్రీ ద్వారా 3,255 చికిత్సలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం ఏపీనే అని చెప్పారు. నేడు అదే పథకాన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఆయుష్మాన్ భారత్– ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పేరుతో అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఆరోగ్య ఆసరా పథకం ద్వారా ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించుకున్న రోగులు కోలుకునే సమయంలో రోజుకు రూ.225 నుంచి నెలకు రూ.5 వేల వరకు సీఎం వైఎస్ జగన్ ఆర్థిక సాయం అందిస్తున్నారన్నారు. ప్రభుత్వ రంగంలోనే క్యాన్సర్‌కు ఆధునిక వైద్యం అందించేందుకు రూ.400 కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు.
వైద్య రంగంలో ఏపీకి రెండు ప్రతిష్టాత్మక అవార్డులు
వైద్య రంగంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మూడు ప్రతిష్టాత్మక అవార్డుల్లో రెండు ఆంధ్రప్రదేశ్‌కే వచ్చాయి. టెలీ కన్సల్టేషన్, విలేజ్ హెల్త్ క్లినిక్‌ల అంశాల్లో ఏపీ అవార్డులు పొందింది. శనివారం వారణాసిలో జరిగిన యూనివర్సల్ హెల్త్ కవరేజీ డే వేడుకల్లో కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ చేతుల మీదుగా టెలీ కన్సల్టేషన్ విభాగంలో వచ్చిన పురస్కారాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు అందుకున్నారు. విలేజ్ హెల్త్ క్లినిక్‌ల అంశానికి వచ్చిన మరో అవార్డును ఏపీ ప్రభుత్వం ఆదివారం అందుకోనుంది.