బంజారాహిల్స్: స్విగ్గీ, జొమాటో అంటే కేవలంహోటళ్ల నుంచి మాత్రమే ఫుడ్ డెలివరీ తీసుకొని భోజన ప్రియులకు అందిస్తుంటారు. ఇదే స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్‌లు రోడ్ల పక్కన ఆహార పదార్థాలు విక్రయించే చిరు వ్యాపారుల నుంచి టిఫిన్లు, మీల్స్ కూడా కోరుకున్న భోజన ప్రియులకు అందజేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ పథకాన్ని జీహెచ్‌ఎంసీలో సర్కిల్–17, 18లలో పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా స్వనిధి సే సమృద్ధి క్యాంప్స్ పీఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి పథకంలో భాగంగా రోడ్ల పక్కన ఫుడ్ వెండర్స్‌ను కూడా స్విగ్గీ, జొమాటోలలో భాగస్వామ్యం చేయనున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని జీహెచ్‌ఎంసీ సిటీ మేనేజర్ ట్రైనింగ్ సెంటర్‌లో ఇందుకు సంబంధించిన కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్లు, స్ట్రీట్‌వెండర్లతో జీహెచ్‌ఎంసీ సర్కిల్–18 యూసీడీ డీపీవో హిమబింధు ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, సోమాజిగూడ, ఖైరతాబాద్, సనత్‌నగర్, అమీర్‌పేట, షేక్‌పేట డివిజన్ల పరిధిలోని రిసోర్స్‌పర్సన్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రభుత్వ ముఖ్య ఉద్దేశాన్ని అవగాహన చేసుకొని వీధి వ్యాపారులకు అవగాహన కల్పించి వారిని ఈ పథకంలో భాగస్వాములు చేసే విధంగా ఆర్పీలు పని చేయాలని అధికారులు సూచించారు. ఆయా ప్రాంతాల్లో వీధి వ్యాపారులను, ఫుడ్ వెండర్స్‌ను కలుసుకొని వారికి మరింత ఆదాయం చేకూర్చేలా ఈ పథకం ఉద్దేశాన్ని తెలియజేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment